పదవిలో ఉండగా తండ్రైన తొలి ఉపాధ్యక్షుడు..హాట్‌టాపిక్‌గా ఆ శాపం..! | JD Vances Baby Boy Ends a 156-Year Statistical Oddity | Sakshi
Sakshi News home page

JD Vances Baby Boy: పదవిలో ఉండగా తండ్రైన తొలి ఉపాధ్యక్షుడు..హాట్‌టాపిక్‌గా ఆ శాపం..!

Jul 20 2026 3:53 PM | Updated on Jul 20 2026 5:30 PM

JD Vances Baby Boy Ends a 156-Year Statistical Oddity

అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌, ఆయన భార్య ఉషా వాన్స్‌ దంపతులు నాలుగో బిడ్డకు స్వాగతం పలికారు. ఆయన సతీమణి ఉషా వాన్స్‌ ఆదివారం ఉదయం పండంటి మగబిడ్డకు జన్మనిచ్చినట్లు జేడీ వాన్స్‌ స్వయంగా తెలిపారు. తల్లి బిడ్డ ఆరోగ్యంగా ఉన్నారని, తన ముగ్గురు పిల్లలు తమ్ముడిని చూసి సంతోషిస్తున్నారని ఆయనే ఒక ప్రకటనలో వెల్లడించారు. అయితే ఇలా పదవిలో ఉండగా ఉపాధ్యాక్షుడి కుటుంబంలో ఒక చిన్నారి జన్మించడం 156 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి కావడంతోనే ఈ విషయం అందర్నీ తెగ ఆకర్షిస్తోంది. ఎందుకంటే గత శతాబ్దల కాలంలో.. పదవిలో ఉన్న ఏ ఉపాధ్యాక్షుడికి ఇలా పిల్లలు కలగకపోవడంతో ఈ అంశం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.

రీజన్‌ ఏంటంటే..
జేడీ వాన్స్‌లా పదవిలో ఉండగా పండంటి బిడ్డకు స్వాగతం పలికిన చివరి అమెరికా ఉపాధ్యక్షుడు స్కైలర్ కోల్‌ఫాక్స్. అప్పటి అధ్యక్షుడు యులిసెస్ ఎస్. గ్రాంట్ హయాంలో ఉపాధ్యక్షుడిగా ఉన్న కోల్‌ఫాక్స్, తన రెండవ భార్య ఎల్లెన్ మారియా కోల్‌ఫాక్స్‌లు స్కైలర్ కోల్‌ఫాక్స్ జూనియర్‌ అనే మగబిడ్డకు జన్మనిచ్చారు.  కానీ కోల్‌ఫాక్స్ తర్వాత వచ్చిన ఉపాధ్యక్షులందరూ బాధ్యతలు స్వీకరించే సమయానికి వయసు పైబడినవారు కావడం, లేదా పూర్తి కుటుంబం ఉండటం లేదా టీనేజ్‌పిల్లలు ఉండటం/వ్యక్తిగత కారణలు తదితరాలేనని చెప్పొచ్చు. 

అందుకు ఉదాహారణగా గతంలో  ఎన్నికైన ఉపాధ్యాక్షులును పరిశీలిస్తే..2021 నుంచి 2025 వరకు జో బైడెన్ హయాంలో ఉపాధ్యక్షురాలిగా పనిచేసిన కమలా హారిస్, ప్రమాణ స్వీకారం చేసే సమయానికి 56 ఏళ్ల వయసు. అంతకుముందు, 2017 నుంచి 2021 వరకు డొనాల్డ్ ట్రంప్ హయాంలో మైక్ పెన్స్ ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. ఆయన ప్రమాణ స్వీకారం చేసినప్పుడు 57 ఏళ్ల వయసు. అంతకుముందు, బరాక్ ఒబామా హయాంలో బైడెన్ ఉపాధ్యక్షుడిగా పనిచేశారు (వారి పదవీకాలం 8 ఏళ్లు). ఆయన పదవీ బాధ్యతలు స్వీకరించినప్పుడు 46 ఏళ్ల వయసు. 

అప్పటికే ఆయనకు నలుగురు పిల్లలు ఉండటంతో, ఆ తర్వాత ఆయనకు పిల్లలు కలగలేదు. బైడెన్‌కు ముందు, జార్జ్ డబ్ల్యూ. బుష్ హయాంలో డిక్ చెనీ ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. ఆ పదవీకాలం కూడా 8 ఏళ్లే. చెనీ ప్రమాణ స్వీకారం చేసినప్పుడు 60 ఏళ్ల వయసులో ఉన్నారు. ఆయనకు అప్పటికే ఇద్దరు కుమార్తెలు. మళ్లీ 156 ఏళ్ల తర్వాత అమెరికా ఉపాధ్యాక్షుడు జేడీ వాన్స్‌ పదవిలో ఉండగా తండ్రైనా తొలి ఉపాధ్యక్షుడిగా అరుదైన రికార్డు సృష్టించారు. ఇది యాదృచ్ఛికమైనదే అయినా..ఈ ఘటనతో నాటి అధ్యక్షుడి శాపం కథలు తెరమీదకు వచ్చాయి. 

అలా ఎన్నికైన ప్రతి అధ్యక్షుడు..
అధ్యక్షుడి శాపంగా పిలిచే దీన్ని 'టిప్పకానూ శాపం' (curse of Tippecanoe) అని పిలుస్తారు. దీని వెనుక ఉన్న జానపద కథనం ప్రకారం..'0'తో ముగిసే సంవత్సరంలో లేదా 20తో భాగించబడే సంవత్సరంలో ఎన్నికైన ప్రతి అమెరికా అధ్యక్షుడు పదవిలో ఉన్నప్పుడే మరణిస్తారని నమ్ముతారు (ఈ రెండు అంశాలు ఒకదానికొకటి సరిపోలుతాయి). ఈ నమ్మకం, శాపం మూలాలు 1811 నాటి టిప్పకానూ యుద్ధం నాటివి. అప్పుడు షానీ తెగ నాయకుడు టెకుమ్సే సోదరుడు టెన్స్క్వటవా, విలియం హెన్రీ హారిసన్‌ను శపించారు.  హారిసన్ 1840లో ఎన్నికయ్యారు - ఏడాది తర్వాత న్యుమోనియాతో మరణించారు. అబ్రహం లింకన్ 1860లో ఎన్నికయ్యారు. ఆయన 5 ఏళ్ల తర్వాత హత్యకు గురయ్యారు. 

జేమ్స్ ఎ. గార్‌ఫీల్డ్, విలియం మెకిన్లీలకు కూడా అదే గతి పట్టింది.  వరుసగా 1880,  1900లో ఎన్నికై, అధ్యక్ష పదవి చేపట్టిన ఏడాది లోపే హత్యకు గురయ్యారు. రూజ్‌వెల్ట్ 1940లో ఎన్నికయ్యారు. ఆయన ఐదేళ్ల  తర్వాత మెదడులో రక్తస్రావం (cerebral hemorrhage) కారణంగా మరణించారు. చివరికి, 1960లో జాన్ ఎఫ్. కెన్నెడీ ఎన్నికయ్యారు. ఆయన సరిగ్గా మూడేళ్ల తర్వాత హత్యకు గురయ్యారు. ఈ శాపం నిజమా అంటే..అది ఆయా వ్యక్తుల వ్యక్తిగత విశ్వాసాలకు సంబంధించిన అంశం. 

కానీ ఇప్పుడు అమెరికా వాసుల దృష్టి అంతా 2040లో ఎన్నికయ్యే అమెరికా అధ్యక్షుడిపైనే ఉండటం విశేషం. ఎందుకంటే అది 21వ శతాబ్దంలో కూడా ఈ 'శాపం నిజమవుతుందా లేదా అనే ఆసక్తితో వేచిచూస్తున్నారు. ఏదీ ఏమైనా ఇలాంటివి కాస్త గమ్మత్తుగా ఫన్నీగా అనిపిస్తున్నా.. ఆ కథలన్నీ వ్యక్తిగత నమ్మకాలకు సంబంధించినదే అంటూ కొట్టిపారేస్తున్నారు మానసిక నిపుణులు.

(చదవండి: సాధారణ బైక్‌ నుంచి బీఎండబ్ల్యూ రేంజ్‌కి..! వైరల్‌గా ఎన్నారై పోస్ట్‌)

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement