
దేశంలోనే కాదు పాశ్చాత్య దేశాల్లోనూ ప్రదర్శనలు చేస్తూ భారతదేశ ప్రాచీన నాట్య కళలను విశ్వవ్యాప్తం చేస్తున్నారు తెలంగాణ రాష్ట్రం సికింద్రాబాద్ వెస్ట్ మారేడుపల్లిలోని భరత, కూచిపూడి డ్యాన్స్ అకాడమీ విద్యార్థులు. ప్రముఖ నాట్యాచారిణి నల్లా రమాదేవి శిక్షణలో తర్ఫీదు పొందుతున్న శ్రీవారి పాదాలు భరత నాట్య, కూచిపూడి అకాడమీ విద్యార్థినులు దేశవ్యాప్తంగా ఉన్న శక్తిపీఠాలు, జ్యోతిర్లింగాలే వేదికగా పలు ప్రదర్శనలు చేసి గుర్తింపు పొందారు. రెండేళ్లుగా వివిధ దేశాల్లోనూ నృత్య ప్రదర్శనలు చేసి భారతీయ కళలకు ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెడుతున్నారు. కొద్ది నెలల్లో అమెరికాలోని చికాగో, డల్లాస్ రాష్ట్రాల్లో ప్రదర్శనలు ఇచ్చేందుకు సమాయత్తమవుతున్నారు.
సరిగ్గా పదేళ్ల క్రితం 2015లో వెస్ట్ మారేడుపల్లిలో నల్లా రమాదేవి ప్రారంభించిన శ్రీవారి పాదాలు భరతనాట్యం, కూచిపూడి డ్యాన్స్ అకాడమీ ఎందరో ప్రతిభావంతులైన నృత్య కళాకారులను అందించింది. ఇక్కడ శిక్షణ పొందిన వందలాది మందిలో 120 మంది సుశిక్షితులైన నృత్య కళాకారులుగా రాణిస్తున్నారు. ఇందులో 25 మంది కళాకారులు దేశ విదేశాల్లో నృత్య కళాశాలలు ఏర్పాటు చేసుకుని శిక్షణ ఇస్తుండడం ఈ డ్యాన్స్ అకాడమీ ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. నాలుగేళ్ల కోర్సు అనంతరం, డిప్లొమా, పీజీ వరకూ సరి్టఫికెట్ కోర్సులు పొందే విధంగా ఇక్కడ శిక్షణ కొనసాగుతోంది. ప్రస్తుతం 200 మంది బాలికలు కూచిపూడి, భరతనాట్యంలో శిక్షణ పొందుతున్నారు. నాలుగేళ్ల బాల్యం నుంచి పీజీ సర్టిఫికెట్ కోర్సు పూర్తి చేసేంత వరకూ ఈ అకాడమీలో శిక్షణ ఇస్తున్నారు.
జ్యోతిర్లింగాల నుంచి తొలి అడుగు..
ఇక్కడ శిæక్షణ పొందుతున్న విద్యార్థులు నృత్య గురువు నల్లా రమాదేవి నేతృత్వంలో నగరంలో పలు ప్రదర్శనలు చేశారు. సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసిన సందర్భాల్లో నాట్య ప్రదర్శనలు చేయడం మామూలైన నేటి తరుణంలో ఏదైనా ప్రత్యేకతను సొంతం చేసుకోవాలన్న తపన మేరకు ప్రత్యేక ప్రదర్శనల కోసం జ్యోతిర్లింగాలు, శక్తి పీఠాలను వేదికలుగా శ్రీవారి పాదాలు నృత్య అకాడమీని ఎంచుకున్నారు.
అంతర్జాతీయ ప్రదర్శనలు..
ఇస్కాన్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న కృష్ణభగవాన్ దేవాలయాల్లో దేశవ్యాప్తంగా పలు ప్రదర్శనలు చేసిన అకాడమీకి చెందిన కళాకారులు అనేక పురస్కారాలు అందుకున్నారు. నృత్య కళకు సార్థకం చేకూర్చాలన్న తపనతో ఇప్పటి వరకూ 15 అష్టాదశ శక్తి పీఠాలు, జ్యోతిర్లింగాల ముందు ప్రదర్శనలు చేశారు. మలేషియా, ఇండోనేషియా, నేపాల్, బ్యాంకాగ్, దుబాయ్, శ్రీలంక, వియత్నాం వంటి దేశాల్లో బతుకమ్మ, శివతాండవం వంటి నృత్య రూపకాలకు ప్రత్యేక గుర్తింపు లభించింది. ఈ ఏడాది మే నెల్లో అమెరికాలో నృత్యరూపకాల ప్రదర్శనలు ఇచ్చేందుకు సమాయత్తం అవుతున్నారు.
నాట్యం అంటే చిన్ననాటి నుంచే ప్రాణం. భద్రాచలంలో పెరిగిన నేను అక్కడే నాట్యగురువు గిరిజాదేవి వద్ద నాట్యం నేర్చుకుని, భద్రాద్రి రాముడి సన్నిధిలోనే అరంగేట్రం చేశాను. భరతనాట్యం, కూచిపూడి నేర్చుకుని కళాశాల విద్య వరకూ భద్రాద్రి పరిసర ప్రాంతాల్లో పలు ప్రదర్శనలు ఇచ్చా.
అయితే పదిహేనేళ్ల క్రితం భద్రాచలం నుంచి హైదరాబాద్‌కు మా కుటుంబంతో షిఫ్ట్ అయ్యాం. ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగంలో చేరినా సంతృప్తి కలగలేదు. నాట్యంపై మమకారంతో ఉద్యోగం వదిలి పొట్టిశ్రీరాములు విశ్వవిద్యాలయంలో డ్యాన్స్ సర్టిఫికేషన్ కోర్సులో చేరి మరింత తర్ఫిదు పొందాను. డాక్టర్ ఇందిరాహేమ సహకారంతో శ్రీవారి పాదాలు పేరుతో డ్యాన్స్ అకాడమీని ప్రారంభించాను. నల్లా రమాదేవి, శ్రీవారి పాదాలు డ్యాన్స్ అకాడమీ నిర్వాహకురాలు
(చదవండి: