ఆధ్యాత్మికథ
ఒక పండితుడికి కొత్త ఊర్లు చూడటమంటే చాలా ఇష్టం. ఖాళీ సమయాల్లో కొత్త ఊర్లకు వెళ్ళి అక్కడి ఆచార వ్యవహారాలను తెలుసుకునేవాడు. అలా ఒక ఊరికి వెళ్లిన పండితుడికి తీవ్రమైన దాహం వేసింది. దగ్గరలోని గుడిసె వద్దకు వెళ్ళి నీళ్ళు అడిగాడు. ఆ ఇంటి గృహిణి చల్లటి నీళ్ళు ఇచ్చి, ‘అయ్యా! నా కూతురికి పొరుగు ఊరి అబ్బాయితో పెళ్ళి నిశ్చయమైంది. పెళ్ళికి మంచి ముహూర్తం చూసి పెట్టండి’ అని వేడుకుంది.
పండితుడు సంచిలోని పంచాంగం తీసి చూసి, ‘మూడు రోజుల తర్వాత మంచి ముహూర్తం ఉంది. ఇది దాటితే ఆరు నెలల వరకు కళ్యాణ గడియలు లేవు’ అని చెప్పాడు. ‘అయ్యో... ఇప్పటికిప్పుడు నా దగ్గర పెళ్ళి చేసేంత డబ్బులు లేవే’ అని బాధపడుతూ కూర్చుంది. ఇంతలో చల్లగా వీచిన గాలికి ఇంటిముందర ఉన్న అరటి ఆకులు చిన్నగా కదిలిన శబ్దం ఆమె చెవిన పడింది.
వెంటనే ఆ గృహిణి ఊరిలోని ప్రతి ఇంటికీ వెళ్ళింది. తన కూతురికి మూడు రోజుల్లో పెళ్ళి చేయబోతున్నామనే వార్తను తెలియజేసింది. ‘‘మా పాపకు మీ అందరి ఆశీర్వాదం కావాలని’’ కోరింది. అలాగేనని బదులిచ్చారు గ్రామస్తులు. ఆ రోజు సాయంత్రం పొలం పనులన్నీ ముగించుకుని ప్రతి ఇంటి నుంచి ఒకరు వచ్చి ఆ గుడిసె ముందు కూర్చున్నారు. గృహిణి అందరికీ అరటి ఆకుల్లో వేడివేడి పొంగలి వడ్డించింది. గ్రామస్తులు రుచిగా ఉన్న పెసరపప్పు పొంగలి తిని, ఆ అమ్మాయిని ఆశీర్వదించి వెళ్ళిపోయారు.
అది చూసి ఆ గృహిణి ‘ఇక నా కూతురి పెళ్ళి ఏ లోటు లేకుండా చేయగలను’ అంది. పండితుడు ఆశ్చర్యపోతూ, ‘నీ దగ్గరేమో అసలు డబ్బులు లేవన్నావు, వాళ్ళేమో చక్కగా తినేసి వెళ్లిపోయారు, నువ్వు డబ్బులు అడగలేదు, మరి పెళ్ళి ఎలా చేస్తావు?‘ అని ప్రశ్నించాడు.
ఆమె చిరునవ్వుతో గ్రామస్తులు తిన్న అరటి ఆకులను గంపలోకి తీసివేయడం ప్రారంభించింది. ఆమె కూతురు ఆ ఆకుల కింద గ్రామస్తులు పెట్టి వెళ్ళిన డబ్బులను పళ్ళెంలో పెట్టుకోవడం మొదలు పెట్టింది.
ఊరి ప్రజలు సహాయం చేసే ఈ వినూత్న పద్ధతిని చూసి పండితుడు ముగ్ధుడయ్యాడు.
‘అమ్మా! మీ ఊరి రాములవారి గుడిలోనే పౌరోహిత్యం చేసి, ఉచితంగా పెళ్ళి జరిపిస్తాను’ అని పండితుడు మాట ఇచ్చాడు. ‘ఇంటికి దీపం ఇల్లాలు–ఊరికి దీపం ఐకమత్యం’అనుకుంటూ ఆ గృహిణి చేతికి కొంచెం డబ్బులిచ్చాడు పండితుడు. తలుపు చాటున ఉన్న పెళ్ళికూతురు ముసిముసి నవ్వులు నవ్వింది.
– ఆర్.సి. కృష్ణస్వామి రాజు


