వారు... తమ స్కాల్‌పెల్ శస్త్రాలతో క్యాన్సర్ పేషెంటును ర్యాంకర్‌గా మారుస్తారు. వారు... భూతభవిష్యత్ వర్తమానాలకు వంతెన కట్టి వంశ పారంపర్య జబ్బుల్ని వడిసిపట్టి లాక్ చేస్తారు. వారిలో కొందరు... ధనం కోరేవారే ధన్వంతరులనే మాటను తప్పని నిరూపించేందుకు తమ సర్వశక్తులొడ్డుతారు. చికిత్స కోరి వచ్చిన చిన్నారులకు చికిత్స చేసి వారినే చికిత్సకులుగా మార్చి సమాజానికిస్తారు.
మరణం అంచున నిల్చున్నవారి చేయి పట్టి చేయూతనిచ్చి మృత్యువు నోటి నుంచి చిర్నవ్వుతో బయటకు తెస్తారు. పనికి మొరాయించిన గుండెనైనా, మూత్రపిండాన్నైనా పట్టిలాగి, తట్టిలేపి మళ్లీ పనిలో పెడతారు. ఈ డాక్టర్స్ డే సందర్భంగా వారు చేసిన వైద్యాలూ అందించిన చికిత్సల కథనాలు వారి నైపుణ్యాలను తెలపడంతో పాటు... అంతర్లీనంగానే కాకుండా నేరుగానే అనేక సందేశాలిస్తున్నాయి. చదివాక కొన్ని అంశాలపట్ల అవగాహననూ ఇస్తున్నాయి.
ఈ డాక్టర్స్ డే సందర్భంగా ఆ డాక్టర్ల నుంచి స్వీకరించి ఆ బంగారు పలుకుల్ని ఒడిబియ్యంలా ఒడిసిపట్టి మీ దోసిళ్లలోకి ఒంపుతున్నాం. ఆస్వాదించండి...
క్యాన్సర్ గెలిచి... ర్యాంకర్‌గా నిలిచి..!
కొన్ని విజయాలు విచిత్రంగా ఉంటాయి. ‘అతడు క్యాన్సర్‌ను జయించాడు’ అని సరిపెట్టుకుందామనేలోపే తొలి విజయం మరెన్నో విజయాలకు నాందిగా మారుతుంది. అలాంటి ఓ స్ఫూర్తిమంతమైన విజయగాథ ఇది. శిశిర్‌కు చాలా చిన్నవయసులో ఎముక క్యాన్సర్ అని తేలింది. ఆర్థోపెడిక్ ఆంకాలజీ సర్జన్‌గా 2016లో ఆ కేసు నా దగ్గరకు వచ్చింది. మిగతా క్యాన్సర్లతో పోలిస్తే బోన్ క్యాన్సర్ ఒకింత సంక్లిష్టమైనదే అనుకోవాలి. శిశిర్ ప్రాణం కా పాడాలంటే కాలి ఎముకను తొలగించాల్సిందే.
భవిష్యత్తు మీద ఆశలూ, ఆకాంక్షలూ ఉండాల్సిన ప్రాయం శిశిర్‌ది.
అంత చిన్నపిల్లాడికి కాలు తొలగించి అతణ్ణి అవిటివాడిని చేయడమా లేదంటే సంక్లిష్టమైన ప్రక్రియలు చేపట్టి కొంత రిస్క్ తీసుకోవడమా అనే నేపథ్యంలో మా అనుభవాన్నంతా ఉపయోగించి ఏదైనా చేద్దామని నేనూ, నా టీమ్ నిశ్చయించుకున్నాం. శిశిర్‌కు సంక్లిష్టమైన ‘లింబ్ సాల్వేజ్’ శస్త్రచికిత్స చేశాం. ఇందులో క్యాన్సర్ ప్రభావితమైన మేరకు ఎముకను వైడ్ ఎక్సిషన్ ద్వారా తొలగించాం. ఆ ఖాళీలో ‘మెగా ప్రోస్థెసిస్’ అమర్చాం. అంటే కృత్రిమ ఎముకతో కాలిని మళ్లీ నిర్మించాం. కాలిని తొలగించాల్సిన దుస్థితి తొలగి పోయింది.
అలా ఆ ముప్పు తప్పిందని ఆనందించేలోపే గాయానికి కొన్ని పోస్ట్ సర్జికల్ సమస్యలు తలెత్తాయి. శిశిర్‌ను కన్రెప్ప వాలకుండా... కంటికి రెప్పలా కాచుకుంటూ ఆ పరిస్థితినీ అధిగమించాం. పరిస్థితి దాదాపుగా నార్మల్‌కు వచ్చేస్తోందన్న సమయంలో మళ్లీ ఓ సవాల్ ఎదురైంది. మెగా ప్రోస్థటిక్ ఎముకకు 2020లో తీవ్రమైన ఇన్ఫెక్షన్ వచ్చింది. ఇప్పుడిది కాలిని తప్పకుండా తొలగించాల్సిన ఆవేదనాభరితమైన స్థితి.
అయితే నేనూ, నా మల్టీ డిసిప్లినరీ మెడికల్ టీమ్ మరోసారి రిస్క్ తీసుకోవాలనే నిర్ణయించాం. ఇన్ఫెక్ట్ అయిన మేరకు మెగా ప్రోస్థెసిస్‌ను తొలగించి... మరికొన్ని శస్త్రచికిత్సలూ, అడ్వాన్స్‌డ్ వైద్య చికిత్సలతో ఈ ఇన్ఫెక్షన్‌నూ పూర్తిగా అదుపులోకి తేగలిగాం. కాలిని కా పాడాం. క్లినికల్ అండ్ ల్యాబ్ పరీక్షల్లో ఇన్ఫెక్షన్ నియంత్రణలోకి వచ్చిందని తెలిశాక– రెండోదశ శస్త్ర చికిత్సలో మరో మెగా ప్రోస్థెసిస్‌ను అమర్చాం.
ప్రాణాలు కా పాడగలిగినా సొంతకాలితో వెళ్తాడా లేడా అన్న శిరీష్ హాయిగా తన కాళ్ల మీద నడుచుకుంటూ వెళ్లడం మా మొదటి ప్రత్యక్ష విజయమైతే... 2026 నాటి జేఈఈ పరీక్షలో ఆల్ ఇండియాలోనే 24వ ర్యాంకు సాధించి ఐఐటీలో సీటు సాధించేందుకు మా టీమ్ దోహదపడటం మా రెండో పరోక్ష విజయం. ఒక యాస్పిరెంట్ తాలూకు బంగారు భవితను మా స్కాల్‌పెల్‌తో, మా ట్రీట్‌మెంట్స్‌తో శాసించడం అన్నిటికంటే మరచి పోలేని విజయం.
- డాక్టర్ కిషోర్ రెడ్డి ,సీనియర్ ఆర్థోపెడిక్ ,ఆంకాలజిస్ట్
జన్యుశా పాన్ని ఆ పాం!
ఓ యువతి తన బిడ్డతో నా దగ్గరికి వచ్చింది. ఆమెకు మగబిడ్డ. ఇంతకు ముందు ఆమెకో ఆడబిడ్డా ఉంది. మన భారతీయ సమాజంలో అబ్బాయి పుడితే ఎంత ఆనందపడతారో మనకు తెలియంది కాదు. అయితే రెండు మూడేళ్లున్న ఆ చిన్నారి నడవడానికి చాలా ఇబ్బంది పడుతున్నాడు. మొదట ఆర్థోపెడిక్ డాక్టర్లను కలిశారు. తర్వాత పిల్లల వైద్యుల దగ్గరకూ వెళ్లారు. ఇక చివరగా డాక్టర్లు వాళ్లను జెనెటిక్స్ విభాగానికి పంపించారు.
మేము పరీక్షించి దాన్ని ‘‘డ్యూషెన్ మస్క్యులర్ డిస్ట్రఫీ’’ వ్యాధిగా నిర్ధారణ చేశాం. ఇదో ప్రోగ్రెసివ్ వ్యాధి. అంటే చిన్నారి పెరుగుతూ పోతున్న కొద్దీ తీవ్రతా పెరుగుతూ పోయే వ్యాధి. నిజానికి ఈ పిల్లలు చాలా తెలివైనవారు. సమస్యేమిటంటే... వాళ్ల కండరాలు క్రమంగా బలహీనపడుతూ పోతాయి. అంతేకాదు, కుటుంబంలో ఆ తర్వాత పుట్టే పిల్లలకూ ఈ సమస్య వచ్చే అవకాశం ఉంటుంది.
అందుకే మేము ప్రీ–నేటల్ చెకప్ చేయాలని నిర్ణయించాం. ఎందుకంటే అప్పటికే ఆ తల్లి మరోసారి గర్భవతి. ఆ గర్భాన్ని పరీక్షిస్తే... లోపల బిడ్డ పూర్తి ఆరోగ్యంగా ఉందని తెలిసింది. తర్వాత ఆరోగ్యకరమైన బిడ్డ పుట్టాడు కూడా. దాంతో వాళ్లూ చాలా సంతోషించారు. ఎందుకంటే... ఇప్పుడు ఆ పెద్ద అబ్బాయిని అర్థం చేసుకుని, జీవితంలో అతడికి తోడుగా, ఆసరాగా ఉండేందుకు అవకాశముండేలా ఓ తమ్ముడు వచ్చాడు.
ఇక డ్యూషెన్ మస్క్యులర్ డిస్ట్రఫీలో ఏమవుతుందంటే... ఈ జీన్స్ ను ఒక తరం నుంచి మరో తరానికి మోసుకెళ్లే ఆ తల్లికీ గుండె సమస్యలు వచ్చే అవకాశముంది. అందుకే మేము ఆమెను కార్డియాలజిస్ట్ దగ్గరకు పం పాం. తల్లికి గుండె సమస్యలు రాకుండా ముందుజాగ్రత్తలు తీసుకున్నాం. ఇక మరో అంశం. డ్యూషెన్స్ మస్క్యులర్ డిస్ట్రఫీలో ఏమవుతుందో మాకు తెలుసు. ఈ వ్యాధిని ఎలా మేనేజ్ చేయాలనే అంశంపై మాకు అవగాహన ఉంటుంది. కాబట్టి ఫిజియోథెరపీ, మరికొన్ని చికిత్సా విధానాలతో వ్యాధి తీవ్రత పెరగడాన్ని ఆలస్యం చేయడం వంటి చర్యలు తీసుకున్నాం.
మాకు ఉండే సంతృప్తి ఏమిటంటే... ఇతర డాక్టర్లు తమ దగ్గరకు వచ్చిన పేషెంట్‌ను చూస్తారు. వారికి ఉన్న సమస్యకే చికిత్స అందిస్తారు. కానీ మేము... జెనెటిక్స్ స్పెషలిస్టులుగా ఆ ముందు తరం తల్లులనూ చూస్తాం. వాళ్లలో ఉన్న లో పాలను కనుగొంటాం. ఆ తరంవారినీ పరీక్షిస్తాం. వారికేమైనా జబ్బులు రాబోతున్నాయా అన్నది తెలుసుకుంటాం. అలాగే ఆ తర్వాతి తరంలోని బిడ్డలకు రాబోయే వ్యాధులనూ పసిగడతాం.
ప్రస్తుతం డ్యూషెన్ మస్క్యులర్ డిస్ట్రఫీకి పూర్తిస్థాయి చికిత్స లేక పోయినప్పటికీ అతన్ని ఎలా మేనేజ్ చేయాలో మాకు తెలుసు. కనీసం మరో 15 నుంచి 17 సంవత్సరాలు అతడిని బాగా చూసుకోవచ్చు. ఈలోపు కొత్త కొత్త చికిత్సలు రావచ్చు. అప్పుడా అబ్బాయికి ఆ చికిత్స అందించే అవకాశం ఉంటుంది. అందుకే మేము అతని వివరాలను మా డేటాబేస్‌లో ఉంచి, కొత్త చికిత్సలు వస్తే వారికి సమాచారం ఇస్తాం. ఇలా చూసినప్పుడు మేము ఇప్పుడు తక్షణ చికిత్సలు అందించడమే కాదు. మున్ముందు రాబోయే సమయంలో అందించాల్సిన చికిత్సలపై సమాచారమూ ఇస్తాం. ఈ కేస్ ద్వారా ఓ మొత్తం కుటుంబంలోని కొన్ని తరాలకు ఎలా సహాయం చేయగలిగామో చెప్పడం ద్వారా... ఇతర కుటుంబాలకు జెనెటిక్ కౌన్సెలింగ్ తీసుకోవడం ఎంత మంచిదో తెలిపే ఓ సందేశమిస్తున్నాం.
కుటుంబాన్ని గుర్తించడం, ఫాలోఅప్ చేయడం ఇది నిరంతర ప్రక్రియ. ఈ కేసే తీసుకోండి. ఆ తల్లికి వచ్చిన తర్వాతి గర్భాన్నీ మేము ఫాలోఅప్ చేశాం. కూతురికి కూడా కౌన్సెలింగ్ ఇచ్చాం. తర్వాతి తరాలు వాళ్ల పెళ్లిళ్ల సమయంలో తిరిగి మా దగ్గరికి వస్తారని మాకు తెలుసు. ఎందుకంటే వారి పిల్లలకు ఈ సమస్య రాకూడదని వాళ్లు కోరుకుంటారు కదా!
- డాక్టర్ అన్నీ క్యూ హసన్, సీనియర్ కన్సల్టెంట్ ఆఫ్ జెనెటిక్స్ అండ్ మాలెక్యులార్ మెడిసిన్
చిక్కులెన్ని ఉన్నా దక్కించుకున్నాం!
అతడో 25 ఏళ్ల యువకుడు. ఛాతీ నొప్పితో మా హాస్పిటల్ ఓపీలోకి వచ్చాడు. మొదట అది మామూలు ఛాతీ నొప్పిలాగే అనిపించింది. టిపికల్ హార్ట్ అటాక్ నొప్పిలా మాత్రం అనిపించలేదు. పైగా హాయిగా నడుచుకుంటూ వచ్చాడు. అతడితో ఎవరూ లేరు. కనీసం... ఫ్రెండ్స్ కానీ, బంధువులుగానీ ఎవరూ లేరు. సరే... మొదట ఈసీజీ, ఎకోకార్డియోగ్రఫీ చేయమన్నాను. బయట ఈసీజీ చేయించి తెచ్చానన్నాడు. బయటి ఈసీజీ పూర్తిగా నార్మల్! అయినా... మళ్లీ మరో ఈసీజీ తప్పనిసరిగా చేయాలని చె΄్పాన్నేను. మళ్లీ ఈసీజీ చేశాం. అందులో కొన్ని మార్పులు!! పూర్తిగా నార్మల్ కాదు. అయితే చూడ్డానికి పేషెంట్ మాత్రం బాగానే ఉన్నాడు. ఎకోలో కూడా కొద్దిగా మార్పులు కనిపించాయి.
అప్పుడు ఎందుకైనా మంచిది... అబ్జర్వేషన్ కోసం అడ్మిట్ చేద్దామని ఎమర్జెన్సీ రూమ్‌కు తీసుకెళ్లాం. అయితే! అక్కడా కుర్రాడు ఒక్కసారిగా కొలాప్స్ అయ్యాడు. అంతే... ఆస్పత్రి సిబ్బంది అందరమూ అప్రమత్తమయ్యాం. పలుమార్లు సీపీఆర్, మూడు సార్లు ఎలక్ట్రిక్ షాక్ ఇచ్చాం.
ఇప్పుడు సమస్య ఏమిటంటే, ఏ హాస్పిటల్‌లోనైనా డ్వాన్స్‌గా కొంత డబ్బు చెల్లించాలి. కొన్ని ఫార్మాలిటీస్ కూడా పూర్తి చేయాలి. ఎలాగోలా మేనేజ్ చేశాం. కానీ కన్సెంట్ ఇవ్వడానికి ఎవరూ లేదు. మాలాంటి పెద్ద ఆసుపత్రుల్లో కన్సెంట్ మాత్రం చాలా ముఖ్యం. లేదంటే నైతికంగానూ, హాస్పిటల్ వైపు నుంచీ... అంతెందుకు చట్టపరంగానూ ఎన్నో సమస్యలొస్తాయి. మొదట అతడో ఫ్రెండ్‌కి ఫోన్ చేశాడు. అయితే 15 నిమిషాల్లోనే మళ్లీ కొలాప్స్ అయ్యాడు.
మళ్లీ సీపీఆర్‌లూ, ఎలక్ట్రిక్ షాకులూ!! అదీ ఎలాంటి ఫైనాన్షియల్ క్లియరెన్స్ లేకుండా! ఎవరితోడూ లేకుండా!! సమయం లేదు. కా పాడి తీరాల్సిందే. ఈ లక్ష్యం తప్ప నాకు మరేమీ కనిపించడం లేదు. క్యాథ్ ల్యాబ్‌లో అప్పటికే ఇంట్యూబేషన్ చేసి (ఊపిరి సాగేందుకు అవసరమైన పైప్ వేసి) వెంటిలేటర్‌పై పెట్టాం. బీపీ కేవలం 60 (డయాస్టోల్) మాత్రమే. అయినా సీపీఆర్ కొనసాగించాం. మొదట 24 గంటల పాటు వెంటిలేటర్‌పై ఉంచాల్సి వచ్చింది. 24 గంటల తర్వాత పేషెంట్‌ను వెంటిలేటర్ పైనుంచి తొలగించాం. పేషెంట్ పూర్తిగా కోలుకున్నాడు. తర్వాత డిశ్చార్జ్ చేశాం.
ఇక్కడ ఈ వృత్తాంతం నుంచి డాక్టర్లుగా మేమూ, సమాజంలోని ప్రజలూ తెలుసుకోవాల్సినవీ, నేర్చుకోవాల్సినవీ చాలా అంశాలున్నాయి. అవేమిటంటే... పేషెంటైనా, మేమైనా బహుశా మా చివరి శ్వాస వరకూ పోరాడాల్సిందే. జీవితంలో ఎప్పుడూ ఆశ వదలకూడదు. సమాజంలోని ప్రజలందరూ తెలుసుకోవాల్సిన విషయమేమిటంటే... అతడికి బీపీ లేదు, డయాబెటిస్ లేదు, స్మోకింగ్ అలవాటు లేదు. అయినా కూడా హార్ట్ అటాక్ వచ్చింది. ఇలా బీపీ, డయాబెటిస్, స్మోకింగ్... ఇవేవీ లేక పోయినా హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వారిని ఎప్పుడూ నిర్లక్ష్యం చేయకూడదు. తండ్రి, తల్లి వైపు ఫ్యామిలీ హిస్టరీ ఉంటే క్రమం తప్పకుండా రెగ్యులర్ చెక్ అప్‌లు చేయించుకుంటూ ఉండాలి.
డాక్టర్ సాయి రవిశంకర్, సీనియర్ కార్డియాలజిస్ట్ అండ్ ప్రెసిడెంట్ ఎలక్ట్ ఫర్ కార్డియాలజీ సొసైటీ ఆఫ్ ఇండియా
చిన్నారి పేషెంట్‌లే నేడు డాక్టర్స్ అయ్యారు!
బ్రెయిన్ స్టెమ్ అంటే మెదడుకు మూలం. బ్రెయిన్ స్టెమ్ చని పోయిందంటే... మనిషిలోని మిగతా అవయవాలు బతికి ఉన్నప్పటికీ బ్రెయిన్‌డెడ్‌గా పరిగణిస్తారు. అంతటి కీలకమైన మెదడు భాగమే ఈ బ్రెయిన్ స్టెమ్. అందుకే... సాధారణంగా బ్రెయిన్ స్టెమ్ ట్యూమర్లు ఆపరేషన్ చేయలేనివిగా భావిస్తారు. అందుకే ఆ రిస్క్ తీసుకోలేక చాలామంది కేవలం రేడియేషన్ మాత్రమే ఇస్తారు.
సర్జరీ చేయాలంటే... దేశంలోనే కాదు... ప్రపంచంలోనూ చాలా కొద్ది కేంద్రాలే బ్రెయిన్ స్టెమ్ ట్యూమర్లకు శస్త్రచికిత్స చేస్తాయి. అయితే నా దగ్గర చికిత్స తీసుకున్న కొంతమంది అప్పటి చిన్నారులు ఇప్పుడు ఎంబీబీఎస్ పూర్తి చేసి ఆంధ్రప్రదేశ్‌లో వాళ్లే చికిత్సలందిస్తున్నారు. అంతేకాదు.. ఇంజనీరింగ్ పూర్తి చేసి ఉద్యోగాల్లో చేరబోతున్న అమ్మాయిలూ; బతుకుతాడో లేదో అనుకున్న వ్యక్తి బ్యాంకు ఉద్యోగం సం పాదించడం, ఎందరికో ఉ పాధినందిస్తూ పరిశ్రమ నెలకొల్పిన ఓ ఎంటర్‌ప్రెన్యూర్... వీళ్లవన్నీ స్ఫూర్తిగాధలే. వీళ్లలో సంతృప్తికరమైన ఫలితాలొచ్చిన ఒకరిద్దరు ఉదాహరణలను ఇక్కడ ప్రస్తావిస్తున్నాను.
ఒక కేసు గురించి చె΄్పాలంటే, ఆమె నా స్నేహితుడి కుమార్తె. ఆ అమ్మాయికి బ్రెయిన్ స్టెమ్‌లో ట్యూమర్ వచ్చింది. బ్రెయిన్ స్టెమ్ దెబ్బతింటే, మనుషులు నడవలేరు, స్పృహ కోల్పోతారు, పూర్తిగా ఇతరులపై ఆధారపడే స్థితికి వెళ్తారు. ఆ సమయంలో ఆమెకు 12 ఏళ్లు. చాలా మంచి డ్యాన్సర్ కూడా. ట్యూమర్ గుర్తించాక ఢిల్లీతో పాటు అనేక చోట్ల వైద్యుల అభి ప్రాయాలు తీసుకున్నారు. కాస్త కలిగినవాళ్లు కావడంతో ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్లి చికిత్స తీసుకునే అవకాశం ఉంది. కానీ.. మా దగ్గరే శస్త్రచికిత్స చేయించుకోవాలని నిర్ణయించారు.
అది చాలా క్లిష్టమైన ట్యూమర్. బ్రెయిన్ స్టెమ్ ప్రాంతం కావడంతో చాలా జాగ్రత్తగా మైక్రోస్కోప్ సహాయంతో ఆపరేషన్ చేశాం. శస్త్రచికిత్స సమయంలో ముఖ కదలికలూ, కళ్ల కదలికలూ, స్వాలోయింగ్ ప్రక్రియ, చేతులు–కాళ్ల కదలికలను నియంత్రించే నరాలను స్టిమ్యులేషన్ ద్వారా పరీక్షిస్తూ... అవేవీ దెబ్బతినకుండా ఆపరేషన్ చేశాం.
ఆపరేషన్ విజయవంతంగా పూర్తి అయ్యింది. ఆ చిన్నారి మళ్లీ స్కూల్‌కు వెళ్లింది.
అయితే ఐదేళ్ల తర్వాత, 2017 సమయంలో ట్యూమర్ మళ్లీ పెరగడంతో మరోసారి ఆపరేషన్ చేయాల్సి వచ్చింది. ఇప్పటివరకు ఆరోగ్యంగా ఉంది. అన్నట్టు ఇప్పుడామె కంప్యూటర్ సైన్స్ లో ఇంజినీరింగ్ చివరి సంవత్సరం చదువుతోంది రేపు ఉద్యోగం కూడా చేస్తుంది. గత ఎనిమిదేళ్లుగా ట్యూమర్ మళ్లీ పెరగలేదు. ఇంకో రెండేళ్లు కూడా పెరగక పోతే దాన్ని పూర్తిగా నయం అయినట్టే భావించవచ్చు.
అలాగే ఇంకో ఇద్దరమ్మాయిలు శ్రీకాకుళం నుంచి ఒకరు... అక్కడికి దగ్గరి ప్రాంతం నుంచి మరొకరు వచ్చారు. వారికి వారికి 10–12 ఏళ్ల వయసులో ఆపరేషన్ చేశాం. ఇప్పుడు వాళ్లు ఎంబీబీఎస్ పూర్తి చేశారు. ఇలా నేను ఆపరేషన్ చేసిన పిల్లల్లో ముగ్గురు–నలుగురు మెడిసిన్ పూర్తి చేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో వైద్యులుగా పనిచేస్తున్నారు.
మామూలుగానైతే ఇలాంటి పిల్లలకు సమస్య వచ్చినప్పుడు తల్లిదండ్రులు ఆశలు కోల్పోతారు. కానీ ప్రతి ట్యూమర్ హాని చేసేది కాక పోవచ్చు. అది ట్యూమర్ రకం మీద కూడా ఆధారపడి ఉంటుంది. అన్నింటికంటే ఆత్మవిశ్వాసంతో చికిత్స తీసుకోవాలి. అటు తర్వాత రెగ్యులర్ ఫాలోఅప్ చాలా ముఖ్యం. మనసులో ఆశనెప్పుడూ దివ్వెలా వెలిగిస్తూనే ఉండాలి. అప్పుడే అది వెలగడంతో పాటు మరెందరికో వెలుగునిస్తుంది.
- డాక్టర్ మానస్ పాణిగ్రహి , సీనియర్ న్యూరో సర్జన్
ఆ కిడ్నీ ఓ గట్టిపిండం... తప్పి పోయిన ప్రాణగండం!
ఇది పాతికేళ్ల యువకుడి కథ. విలువైన మన అవయవాలు మట్టిలో వృథా పోతున్న ఈ టైమ్‌లో అవయవదానమెంత విలువైనదో, ఎన్నెన్ని ప్రాణాలు కా పాడుతుందో చెప్పకనే చెప్పేకథ. అతడికి 25 ఏళ్లు. కళ్లల్లో ఎన్నో ఆశలు. మనసులో ఆశయాలు. ఐటీ రంగంలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా ముందుకు సాగుతున్న తరుణంలో పక్కలో బల్లెంలా పక్కటెముకల కింద నొప్పి! వ్యాధి నిర్ధారణలో అతడికి వచ్చిన ఆ జబ్బు ‘‘ఎండ్ స్టేజ్ కిడ్నీ డిసీజ్’’ అని తెలిసింది. అప్పటికే ఆ జబ్బు అతడి రెండు మూత్రపిండాల(కిడ్నీల)ను కబళించేసింది.
ఆ చిన్న వయసులోనే అతడి రెండు కిడ్నీలూ ఎంతగా కుంచించుకు పోయి నిర్జీవంగా మారాయంటే... ముక్క తీసి పరిశీలించేందుకు... అంటే బయాప్సీ కూడా చేయడానికి వీల్లేనంతగా! ఈ విషయం చె΄్పాక ఆ కుటుంబం గుండె పగిలి పోయింది. ఆశల ఐటీ ప్రపంచం నుంచి అతడి గమ్యస్థానం హాస్పిటల్‌కు చేరి... వారానికిత మూడుసార్లు డయాలిసిస్ బెడ్ మీద అచేతనంగా పడుకోవాల్సిన పరిస్థితి.
జీవన్‌దాన్ వరమిచ్చినా... విధి మరో వింత నాటకమాడింది...
కుటుంబంలో ఎవరి కిడ్నీ కూడా మ్యాచ్ కాక పోవడంతో అందరూ ‘జీవన్ దాన్’ వైపు ఆశగా చూశారు. రెండేళ్ల పాటు చావుతో పోరాడుతున్న ఆ యువకుడికి ఒకరోజు ఫోన్ వచ్చింది. రోడ్డు ప్రమాదంలో బ్రెయిన్ డెడ్ అయిన ఒక 20 ఏళ్ల యువకుడి కిడ్నీ మ్యాచ్ అయిందని తెలిసింది. ‘ఇక నా కుమారుడు బతికి పోతాడు’ అంటూ ఆశపడుతున్న ఆ తల్లిదండ్రులు కళ్లనిండా ఆనందబాష్పాలు. కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స విజయవంతంగా ముగిసింది. కథ ఇక్కడ ముగియలేదు... అసలు ట్విస్ట్ ఇక్కడే మొదలైంది!
నిజానికి కొత్త కిడ్నీ అమర్చాక దేహం మామూలు స్థితికి రావాలి. ఇక్కడ సీన్ రివర్స్ అయింది. కొత్తగా అమర్చిన కిడ్నీ శరీరంలో అస్సలు స్పందించలేదు! పైగా రక్తంలో ప్లేట్‌లెట్స్, ఇతర రక్తకణాల కౌంట్ దారుణంగా పడి పోయింది. సాధారణంగా ఐదు రోజుల్లో డిశ్చార్జ్ కావాల్సిన పేషెంట్, ప్రాణా పాయ స్థితిలోకి వెళ్ళి పోయాడు. ఇప్పుడీ కేసును మేము ఓ సవాల్‌గా తీసుకున్నాం. ఒక్క క్షణం కూడా పేషెంట్‌ను వదలకుండా నిరంతరం పర్యవేక్షించాం. దశలవారీ చికిత్సలు చేశాం. కొన్ని రిస్కులు తీసుకున్నాం.
రెండువారాల పాటు మృత్యువుతో అతడు పోరాడక ఓ మెడికల్ మిరాకిల్ జరిగింది. ఎప్పటికీ పనిచేయదనుకున్న ఆ కొత్త కిడ్నీ నెమ్మదిగా స్పందించడం మొదలుపెట్టింది. పడి పోయిన బ్లడ్ కౌంటులు తిరిగి పుంజుకున్నాయి. బ్లాక్‌హోల్ అంచున ఈవెంట్ హొరైజన్ నుంచి అటువైపునకు పడి పోయాడనుకున్న ఆ పేషెంట్ మెల్లగా చావునోట్లోంచి నవ్వుతూ బయటకు వచ్చాడు. తన సరికొత్త కిడ్నీతో, సంపూర్ణ ఆరోగ్యంతో జీవిస్తున్నాడు.
డాక్టర్ రేఖ పాలడుగు, సీనియర్ కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్ అండ్ కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ ఫిజీషియన్
కూతురిలోని ‘తల్లి మనసు’కు శాల్యూట్!
దాదాపు పన్నెండేళ్ల కిందట అరవైల్లో ఉన్న ఒక మహిళకు మేము ఆయోర్టిక్ వాల్వ్ శస్త్రచికిత్స చేసి వాల్వ్ మార్చి ఆమెకో కొత్త జీవితమిచ్చాం. అయితే కాల ప్రభావం దాని మీద కూడా పడింది. అంటే... పదేళ్లకు పైగా గడిచిన తరువాత, ఆ వాల్వ్ పనితీరు తగ్గింది. ఆమె మరోమారు మరణం అంచున నిలిచి... మరో జీవన్మరణ పోరాటానికి సిద్ధం కావాల్సి వచ్చింది.
ఆమె ఎప్పుడూ హాస్పిటల్‌కు వచ్చినా ఒంటరిగా వచ్చేది కాదు. ప్రతి కన్సల్టేషన్ టైములో, ప్రతి వైద్య పరీక్షలో, ప్రతి ఆందోళనభరితమైన చర్చలో ఆమెలో పాటు ఆమె కూతురు కూడా ఉండేది. ఎంతో నిశ్శబ్దంగా, బ్యాలెన్స్‌డ్‌గా, చాలా హుందాగా ఉండే ఆ కూతురికి తన తల్లి తాలూకు ప్రతి మందు గురించీ, ప్రతి లక్షణం గురించీ, ప్రతి రి పోర్ట్ గురించీ క్షుణ్ణంగా తెలుసు.
ఏళ్లు గడిచేకొద్దీ... ఆమె వివాహం చేసుకోలేదనీ... చేసుకోవాలని అనుకోవడం లేదనీ, పూర్తిగా తన తల్లిని చూసుకోవడానికే నిశ్చయించుకుందని నాకు ఆ తర్వాతెప్పుడో తెలిసింది. ఆ కూతురు ఓ చిన్న ఉద్యోగం చేసేది. మితంగా ఖర్చు చేసేది. ఎన్నో ఏళ్ల పాటు ప్రతి రూ పాయీ ఆదా చేసి, ఓ చిన్న ఇల్లు కొనుక్కోవడం... అందులో ఆ తల్లీకూతుళ్లు కలిసి జీవించడం... ‘‘మన ΄÷దరిల్లు’’ అని పిలుచుకునే ఆ గూటిలో బతకాలనుకోవడం... ఇదే ఆమె కల.
కానీ జీవితం ఆ కూతురికి క్రూరమైన పరీక్ష పెట్టింది. ఆ టైమ్‌లో ఆమెకూ కొన్ని అనారోగ్య లక్షణాలు కనిపించాయి.డాక్టర్‌ను సంప్రదిస్తే... ఆమెకు ఓ భయంకరమైన జబ్బు ఉన్నట్టు తెలిసింది. ఆ వ్యాధి పేరు గ్లియోబ్లాస్టోమా మల్టీఫార్మ్. ఇప్పటికీ వైద్యశాస్త్రానికి తెలిసిన అత్యంత దారుణమైనదీ, అలాగే చాలా వేగంగా పెరిగే మెదడు కణుతుల్లో అదీ ఒకటి.
మామూలుగానైతే ఈ పరిస్థితిలో చాలా మంది తమ కోసం పోరాడతారు. తమ కోసం కలలుగంటారు. తమకోసం ఖర్చు చేసుకుంటారు. కానీ ఆమె వేరే మార్గాన్ని ఎంచుకుంది.ఆమె తన చికిత్సను పక్కన పెట్టింది. కొంత అప్పు చేసింది. ఇంటి కోసం దాచుకున్న మొత్తం సేవింగ్స్ ఖర్చు చేసింది. తనకు అందుబాటులో ఉన్న ప్రతి అంశాన్నీ తల్లి కోసమే ఉపయోగించుకుంది.
ఆరోజు మేము తల్లికి కొన్ని పదుల ఏళ్ల పాటు పదిలంగా నిలిచి ఉండేలా మంచి మన్నికతో పనిచేసే ‘రెసిలియా’ అనే వాల్వ్ అమర్చాం. ఇవన్నీ ఆమెకు వివరిస్తూ ఉంటే ఆమె అడిగిన ప్రశ్న... ‘‘అమ్మ ఆయుర్దాయం కంటే ఈ వాల్వ్ మరిన్ని ఎక్కువ రోజులే పనిచేస్తుంది కదా’’ అని!
డా. వి. ఎస్. రామచంద్ర, సీనియర్ కార్డియాలజిస్ట్ అండ్ ఎలెక్ట్రోఫిజియాలజిస్ట్


