
ఆగస్ట్ 7 వరకు తల్లి పాల వారోత్సవాలు
‘‘తొమ్మిది నెలల బొడ్డుతాడు అకస్మాత్తుగా అలా కోసేస్తే ఎలా...?’’ అనుకున్నాడో ఏమో దేముడు!
‘‘పేగుబంధమిలా తెంచినందుకేనేమో... ఆహారంగా పాలబంధం పెట్టి స్తన్యబంధమేర్పాటు చేశాడనిపిస్తోంది!!
ప్రసవవేదనతో ప్రాణాల్ని తోడేసిన ఆ కొత్తబిడ్డలోకి తన ప్రాణాలు నింపి... తనలోంచి బయటకు తోడిన ప్రాణాలను మళ్లీ నెమ్మది నెమ్మదిగా పునఃప్రతిష్టించుకుంటూ ఉంటుంది అమ్మ. అలా అప్పుడప్పుడే కోలుకుంటున్న కీలక తరుణంలో ఆ అమ్మ పట్ల జడ్జిమెంటల్‌గా కొన్ని కామెంట్స్ చేయవద్దని కోరుతున్నారు మానసికవేత్తలు.
ఆ పోస్ట్ పార్టమ్ ‘బ్ల్యూ’స్ తాలూకు ‘నీలి’నీడల్ని క్రమంగా బిడ్డపై ప్రేమ పెంచుకుంటూ ఇంద్రధనుస్సులాంటి ఫ్లయింగ్ కలర్స్‌గా మార్చుకునే తరుణంలో ఆ కామెంట్లు ఆమెలో అపరాధభావం నింపుతాయంటూ హెచ్చరిస్తున్నారు. సూచన అనే మారువేషం వేసుకుని కర్కశాన్ని కనిపించకుండా కప్పేస్తూ ఉండే... పలకకూడని ఆ పరుష పదాలేమిటో చూద్దాం.
ఈనెల మొదటి తేదీతో మొదలై ఈ వారమంతా తల్లి పాల వారోత్సవాలు కొనసాగుతుంటాయి. ఈ సందర్భంగా బుజ్జాయికి తల్లి పాలే పట్టమంటూ సిఫార్సు చేస్తుంటారు డాక్లర్లు. ‘బాటిల్ పాలు బొజ్జ నింపుతాయేమోగానీ... అమ్మ పాలు కడుపునింపడంతో పాటూ ఆత్మనూ నింపుతాయంటున్నారు’ వైద్య నిపుణులు. ఈ సమయంలో కొన్ని మాటలు కొత్త తల్లితో చెప్పకూడదంటూ వారు సూచిస్తున్నారు.
‘‘అమ్మా! నువ్వు పీరియడ్స్‌లో ఉండి మైలతో ఉంటే బిడ్డకు పాలుపట్టకు’’
– కొందరు పెద్దాళ్ల పెడసరం మాట
ఇది ఎంతమాత్రమూ తల్లితో చెప్పకూడని మాట. బిడ్డకు తల్లి పాలను మించిన ఆహారం లేదు. డాక్టర్లు నిర్దిష్టంగా వద్దని చెబితే మినహా బిడ్డకు పాలుపట్టకుండా ఉండనే కూడదు. పైగా మురి పాలతో పట్టే ముర్రు పాలు ఇంకా ఇంకా మేలూ మంచీ చేసేవే. ఆ ముర్రు పాలనే కొలెస్ట్రమ్ అంటారు. తల్లిని దేవత అన్నాక అమ్మ అమృతం పట్టక పోతే ఎలా! అందుకే అనేక అనారోగ్యాలూ... ఎప్పుడో వృద్ధాప్యంలో బిడ్డకు వచ్చే ఎన్నో జబ్బుల్నించి రక్షించే ఆ పాలు అమృతాలు కాకుండా ఎలా పోతాయి. అమృతానికి అంటు ఏమిటి? పాలకు మైలేమిటి? అందుకే తల్లి ఏ పరిస్థితుల్లో ఉన్నా బిడ్డకు అమ్మ పాలు పట్టాల్సిందే.
‘‘ పాప ఏడుస్తోంది... పాలు సరిగా పట్టావా?
ఏమో.... పట్టావో లేదో?’’
– అనుభవజ్ఞురాలంటూ ఆరా తీసే మహిళ
పాలు తాగుతుండే పా పాయి చక్కగా బరువు పెరుగుతుంటే చాలు. పాలు తన ఒంటికి పడుతున్నట్టే లెక్క. తల్లి ఇచ్చే ఆ పాలబువ్వనంతా బిడ్డ ఒంటికంతా పట్టేలా ఏర్పాటు చేస్తుంది ప్రకృతి. అందుకే నెలల పా పాయిలకు మలవిసర్జన అంతగా కాక పోవచ్చు. కొన్నిసార్లు మల విసర్జనకు రెండు మూడురోజులూ పట్టవచ్చు లేదా రోజులో రెండుసార్లు కూడా కావచ్చు. కానీ మూత్రంతో రోజుకు ఆరుసార్లైనా డయపర్ తడిపేస్తుంది బేబీ! అలా రోజూ పాలు తాగే పసి పాప... రోజులో ఐదారుసార్లు పక్కతడిపేస్తుంటే చాలు.
ఇక పా పాయి ఏడుస్తుందంటే అర్థం పాలు సరి పోలేదని కాదు... అది కోలిక్ అని పిలిచే కడుపునొప్పి వల్ల కావచ్చు. చెప్పుకోలేని చెవినొప్పి ఉండచ్చు. అందుకే... పాప అదేపనిగా ఏడుస్తుంటే ఒకసారి చిన్నపిల్లల డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లాలి. అంతేతప్ప జడ్జిమెంటల్‌గా కామెంట్స్ పాస్ చేయకూడదు.
‘‘ఏమిటీ...? పాలు పట్టడం అప్పుడే మానేశావా?
మా కాలంలో బిడ్డకు మూడేళ్లు వచ్చే వరకూ పట్టేవాళ్లమమ్మా...’’
– తమ కాలమైన గతమంతా గొప్పేనంటూ చెప్పే ఓ పెద్దావిడ మాట
బిడ్డకు ఆర్నెల్లు వచ్చేవరకూ పాలు పట్టడం తప్పనిసరి. చిన్నారి పా పాయికి పాలే సరైన ఆహారం. ఆర్నెల్ల తర్వాత నెయ్యీ పప్పూతో గుజ్జుగుజ్జుగా కలిపిన అన్నం గోరుముద్దలతోనూ, గుజ్జుగా నలిపే పండ్ల బువ్వతో క్రమంగా ఘనాహారమంటూ అలవాటు చేయడాన్ని ఇంగ్లిష్‌లో ‘వీనింగ్’ అంటారు. ఇలా చేస్తూ కూడా ఏడాది ఏడాదిన్నర వరకూ పాలు పడుతూనే ఉండవచ్చు. డాక్టర్ చెప్పిన ఏ కారణాల వల్లనో లేదా బిడ్డకు సరిపడా పాలు తల్లికి పడకనో ఆపేయాల్సి వస్తే... అందుకు అనేక కారణాలుండవచ్చు. అందుకే అదేదో నిష్ఠూరంగా ఎలా పడితే అలా మాట్లాడాల్సిన మాట కాదు.
‘‘బిడ్డ బరువు సరిగా పెరుగుతున్నట్టుగా లేదు... పాలు సరిగా పట్టడం లేదా?’’
– పెత్తనం చేస్తున్నట్టుగా పెదవి దాటించే ఓ పెద్దావిడ ఆరా!
బిడ్డకు పాలు సరి పోయాయంటే... కడుపు నిండిన వెంటనే పా పాయి కనీసం గంటా గంటన్నర పాటు నిద్ర పోతుంది. పాలు తాగాక కనీసం గంటసేపైనా పా పాయి పడుకుందంటే చిన్నారికి కడుపు నిండినట్టే లెక్క. కొందరు బిడ్డలు కాస్త పీలగా ఉండొచ్చు. అందరూ బొద్దుగానే ఉండరు కదా. అలా చూసి... ఇలా నిష్టూరాలు ఆడకూడదు. మొదట్లో ఒకవైపు పాలు తాగడానికి బిడ్డకు 20 నిమిషాల నుంచి 25 నిమిషాలూ పట్టవచ్చు. పాలు తాగే నైపుణ్యం పెరుగుతున్నకొద్దీ పా పాయి 5 – 10 నిమిషాల్లోనే పాలు తాగేస్తుంటుంది. అయితే... పాలు పట్టేటప్పుడు మొదట వచ్చే పాలను ఫోర్ మిల్క్ అంటారు. అందులో నీటి మోతాదు ఎక్కువగా ఉంటుంది. అది తాగేశాకే హైండ్ మిల్క్ అనే పాలొస్తాయి. ఇందులో బిడ్డ పెరుగుదలకు కావాల్సిన కొవ్వులు ఎక్కువగా ఉంటాయి. అవన్నీ కొవ్వులే అయినా పాప ఒంటికి హాయిగా పట్టేలా చేస్తుంది ప్రకృతి.
కొత్త తల్లితో కినుక మాటలు ఎందుకు మాట్లాడకూడదంటే...
కొత్త తల్లికి అంతా కొత్తే. కొంగులో బంగారు బిడ్డతో కొత్త తల్లికి అసలే కంగారు. పాప పుట్టే సమయంలో అనుభవించే వేదనతో కొన్నిసార్లు పాపపై కోపం వచ్చేలాంటి ‘ పోస్ట్ పార్టమ్ బ్లూస్’ వర్కవుట్ అవుతూ ఉంటాయి. అవి క్రమంగా తగ్గుతుండే సమయంలో ఇలాంటి నిష్ఠూరాలతో అమ్మమనసుకు కష్టం కలిగిస్తాయి. అలాంటి వ్యాఖ్యలు ఆమెను మానసికంగా దెబ్బతీసి గిల్ట్‌ను నింపవచ్చు. మొదటే తెలియని తనం... అసలే అనుభవలేమి... పైగా ఇలాంటి మాటలు!! వీటితో ఆమెలో ఆత్మస్థైర్యం, ఆత్మవిశ్వాసం దెబ్బతింటే ఇంకా ఇంకా సమస్యలు రావచ్చు. అందుకే అలాంటిలాంటి అనుచిత వ్యాఖ్యలు వద్దంటూ సూచిస్తున్నారు సైకియాట్రిస్టులు, సైకాలజిస్టులు.