breaking news
World Breastfeeding Day
-
మాట కటువైతే... మురి పాలు విరుగుతాయ్!
‘‘తొమ్మిది నెలల బొడ్డుతాడు అకస్మాత్తుగా అలా కోసేస్తే ఎలా...?’’ అనుకున్నాడో ఏమో దేముడు! ‘‘పేగుబంధమిలా తెంచినందుకేనేమో... ఆహారంగా పాలబంధం పెట్టి స్తన్యబంధమేర్పాటు చేశాడనిపిస్తోంది!!ప్రసవవేదనతో ప్రాణాల్ని తోడేసిన ఆ కొత్తబిడ్డలోకి తన ప్రాణాలు నింపి... తనలోంచి బయటకు తోడిన ప్రాణాలను మళ్లీ నెమ్మది నెమ్మదిగా పునఃప్రతిష్టించుకుంటూ ఉంటుంది అమ్మ. అలా అప్పుడప్పుడే కోలుకుంటున్న కీలక తరుణంలో ఆ అమ్మ పట్ల జడ్జిమెంటల్‌గా కొన్ని కామెంట్స్ చేయవద్దని కోరుతున్నారు మానసికవేత్తలు.ఆ పోస్ట్ పార్టమ్ ‘బ్ల్యూ’స్ తాలూకు ‘నీలి’నీడల్ని క్రమంగా బిడ్డపై ప్రేమ పెంచుకుంటూ ఇంద్రధనుస్సులాంటి ఫ్లయింగ్ కలర్స్‌గా మార్చుకునే తరుణంలో ఆ కామెంట్లు ఆమెలో అపరాధభావం నింపుతాయంటూ హెచ్చరిస్తున్నారు. సూచన అనే మారువేషం వేసుకుని కర్కశాన్ని కనిపించకుండా కప్పేస్తూ ఉండే... పలకకూడని ఆ పరుష పదాలేమిటో చూద్దాం.ఈనెల మొదటి తేదీతో మొదలై ఈ వారమంతా తల్లి పాల వారోత్సవాలు కొనసాగుతుంటాయి. ఈ సందర్భంగా బుజ్జాయికి తల్లి పాలే పట్టమంటూ సిఫార్సు చేస్తుంటారు డాక్లర్లు. ‘బాటిల్ పాలు బొజ్జ నింపుతాయేమోగానీ... అమ్మ పాలు కడుపునింపడంతో పాటూ ఆత్మనూ నింపుతాయంటున్నారు’ వైద్య నిపుణులు. ఈ సమయంలో కొన్ని మాటలు కొత్త తల్లితో చెప్పకూడదంటూ వారు సూచిస్తున్నారు. ‘‘అమ్మా! నువ్వు పీరియడ్స్‌లో ఉండి మైలతో ఉంటే బిడ్డకు పాలుపట్టకు’’– కొందరు పెద్దాళ్ల పెడసరం మాటఇది ఎంతమాత్రమూ తల్లితో చెప్పకూడని మాట. బిడ్డకు తల్లి పాలను మించిన ఆహారం లేదు. డాక్టర్లు నిర్దిష్టంగా వద్దని చెబితే మినహా బిడ్డకు పాలుపట్టకుండా ఉండనే కూడదు. పైగా మురి పాలతో పట్టే ముర్రు పాలు ఇంకా ఇంకా మేలూ మంచీ చేసేవే. ఆ ముర్రు పాలనే కొలెస్ట్రమ్ అంటారు. తల్లిని దేవత అన్నాక అమ్మ అమృతం పట్టక పోతే ఎలా! అందుకే అనేక అనారోగ్యాలూ... ఎప్పుడో వృద్ధాప్యంలో బిడ్డకు వచ్చే ఎన్నో జబ్బుల్నించి రక్షించే ఆ పాలు అమృతాలు కాకుండా ఎలా పోతాయి. అమృతానికి అంటు ఏమిటి? పాలకు మైలేమిటి? అందుకే తల్లి ఏ పరిస్థితుల్లో ఉన్నా బిడ్డకు అమ్మ పాలు పట్టాల్సిందే. ‘‘ పాప ఏడుస్తోంది... పాలు సరిగా పట్టావా? ఏమో.... పట్టావో లేదో?’’ – అనుభవజ్ఞురాలంటూ ఆరా తీసే మహిళ పాలు తాగుతుండే పా పాయి చక్కగా బరువు పెరుగుతుంటే చాలు. పాలు తన ఒంటికి పడుతున్నట్టే లెక్క. తల్లి ఇచ్చే ఆ పాలబువ్వనంతా బిడ్డ ఒంటికంతా పట్టేలా ఏర్పాటు చేస్తుంది ప్రకృతి. అందుకే నెలల పా పాయిలకు మలవిసర్జన అంతగా కాక పోవచ్చు. కొన్నిసార్లు మల విసర్జనకు రెండు మూడురోజులూ పట్టవచ్చు లేదా రోజులో రెండుసార్లు కూడా కావచ్చు. కానీ మూత్రంతో రోజుకు ఆరుసార్లైనా డయపర్ తడిపేస్తుంది బేబీ! అలా రోజూ పాలు తాగే పసి పాప... రోజులో ఐదారుసార్లు పక్కతడిపేస్తుంటే చాలు. ఇక పా పాయి ఏడుస్తుందంటే అర్థం పాలు సరి పోలేదని కాదు... అది కోలిక్ అని పిలిచే కడుపునొప్పి వల్ల కావచ్చు. చెప్పుకోలేని చెవినొప్పి ఉండచ్చు. అందుకే... పాప అదేపనిగా ఏడుస్తుంటే ఒకసారి చిన్నపిల్లల డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లాలి. అంతేతప్ప జడ్జిమెంటల్‌గా కామెంట్స్ పాస్ చేయకూడదు. ‘‘ఏమిటీ...? పాలు పట్టడం అప్పుడే మానేశావా? మా కాలంలో బిడ్డకు మూడేళ్లు వచ్చే వరకూ పట్టేవాళ్లమమ్మా...’’– తమ కాలమైన గతమంతా గొప్పేనంటూ చెప్పే ఓ పెద్దావిడ మాటబిడ్డకు ఆర్నెల్లు వచ్చేవరకూ పాలు పట్టడం తప్పనిసరి. చిన్నారి పా పాయికి పాలే సరైన ఆహారం. ఆర్నెల్ల తర్వాత నెయ్యీ పప్పూతో గుజ్జుగుజ్జుగా కలిపిన అన్నం గోరుముద్దలతోనూ, గుజ్జుగా నలిపే పండ్ల బువ్వతో క్రమంగా ఘనాహారమంటూ అలవాటు చేయడాన్ని ఇంగ్లిష్‌లో ‘వీనింగ్’ అంటారు. ఇలా చేస్తూ కూడా ఏడాది ఏడాదిన్నర వరకూ పాలు పడుతూనే ఉండవచ్చు. డాక్టర్ చెప్పిన ఏ కారణాల వల్లనో లేదా బిడ్డకు సరిపడా పాలు తల్లికి పడకనో ఆపేయాల్సి వస్తే... అందుకు అనేక కారణాలుండవచ్చు. అందుకే అదేదో నిష్ఠూరంగా ఎలా పడితే అలా మాట్లాడాల్సిన మాట కాదు. ‘‘బిడ్డ బరువు సరిగా పెరుగుతున్నట్టుగా లేదు... పాలు సరిగా పట్టడం లేదా?’’– పెత్తనం చేస్తున్నట్టుగా పెదవి దాటించే ఓ పెద్దావిడ ఆరా!బిడ్డకు పాలు సరి పోయాయంటే... కడుపు నిండిన వెంటనే పా పాయి కనీసం గంటా గంటన్నర పాటు నిద్ర పోతుంది. పాలు తాగాక కనీసం గంటసేపైనా పా పాయి పడుకుందంటే చిన్నారికి కడుపు నిండినట్టే లెక్క. కొందరు బిడ్డలు కాస్త పీలగా ఉండొచ్చు. అందరూ బొద్దుగానే ఉండరు కదా. అలా చూసి... ఇలా నిష్టూరాలు ఆడకూడదు. మొదట్లో ఒకవైపు పాలు తాగడానికి బిడ్డకు 20 నిమిషాల నుంచి 25 నిమిషాలూ పట్టవచ్చు. పాలు తాగే నైపుణ్యం పెరుగుతున్నకొద్దీ పా పాయి 5 – 10 నిమిషాల్లోనే పాలు తాగేస్తుంటుంది. అయితే... పాలు పట్టేటప్పుడు మొదట వచ్చే పాలను ఫోర్ మిల్క్ అంటారు. అందులో నీటి మోతాదు ఎక్కువగా ఉంటుంది. అది తాగేశాకే హైండ్ మిల్క్ అనే పాలొస్తాయి. ఇందులో బిడ్డ పెరుగుదలకు కావాల్సిన కొవ్వులు ఎక్కువగా ఉంటాయి. అవన్నీ కొవ్వులే అయినా పాప ఒంటికి హాయిగా పట్టేలా చేస్తుంది ప్రకృతి.కొత్త తల్లితో కినుక మాటలు ఎందుకు మాట్లాడకూడదంటే... కొత్త తల్లికి అంతా కొత్తే. కొంగులో బంగారు బిడ్డతో కొత్త తల్లికి అసలే కంగారు. పాప పుట్టే సమయంలో అనుభవించే వేదనతో కొన్నిసార్లు పాపపై కోపం వచ్చేలాంటి ‘ పోస్ట్ పార్టమ్ బ్లూస్’ వర్కవుట్ అవుతూ ఉంటాయి. అవి క్రమంగా తగ్గుతుండే సమయంలో ఇలాంటి నిష్ఠూరాలతో అమ్మమనసుకు కష్టం కలిగిస్తాయి. అలాంటి వ్యాఖ్యలు ఆమెను మానసికంగా దెబ్బతీసి గిల్ట్‌ను నింపవచ్చు. మొదటే తెలియని తనం... అసలే అనుభవలేమి... పైగా ఇలాంటి మాటలు!! వీటితో ఆమెలో ఆత్మస్థైర్యం, ఆత్మవిశ్వాసం దెబ్బతింటే ఇంకా ఇంకా సమస్యలు రావచ్చు. అందుకే అలాంటిలాంటి అనుచిత వ్యాఖ్యలు వద్దంటూ సూచిస్తున్నారు సైకియాట్రిస్టులు, సైకాలజిస్టులు. -
తల్లి పాల వారోత్సవం: ప్రాణదాతలకు వందనం
బిడ్డ ఆకలి తల్లికే తెలుస్తుంది. తల్లి మనసు గ్రహించే సూక్ష్మం అది. తల్లిపాలకు నోచుకోని బిడ్డలెందరో? ఆ బిడ్డల తల్లుల మనోవేదనకు అంతే ఉండదు. ఒక తల్లి మనసు మరో తల్లికే అర్థమవుతుంది. తన బిడ్డతోపాటు ఆ తల్లి బిడ్డకూ పాలిస్తుంది. మహోన్నతమైన ఆ తల్లి మనసుకు వందనం! ఒక తల్లి నుంచి మరో తల్లి బిడ్డకు... పాలు అందించే సేవ మహోత్కృష్టం. ఆ సేవలో తరిస్తున్నాయి పాలబ్యాంకులు. బిడ్డకు తల్లిపాలను మించిన ఆహారం మరొకటి ఉండదు. తల్లిపాలు ఆహారం మాత్రమే కాదు ఔషధం కూడా. బిడ్డలో వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది. అంటువ్యాధుల బారిన పడకుండా దేహం తనను తాను రక్షించుకునే శక్తిని పెంచుకుంటుంది. జీర్ణాశయ సమస్యలు తలెత్తకుండా బిడ్డ ఆరోగ్యంగా పెరగడానికి దోహదం చేస్తాయి. ఇన్ని మంచి లక్షణాలున్న తల్లిపాలను నిర్లక్ష్యం చేయరాదని దశాబ్దాలుగా చేస్తున్న ప్రచారం మంచి ప్రభావాన్నే చూపిస్తోంది. కొంతమంది తల్లులకు పాలు పడవు. అలాగే కొంతమందికి డెలివరీ సమయంలో ఇతర కారణాల రీత్యా వేరే హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకోవాల్సి వస్తుంది. నెలలు నిండకముందే పుట్టిన బిడ్డలను కొన్ని రోజులు, నెలలపాటు ప్రత్యేక సంరక్షణలో ఉంచాలి. ఇలాంటి బిడ్డల కోసమే తల్లిపాల బ్యాంకులు ఉద్భవించాయి. హైదరాబాద్ నగరంలో ధాత్రి మిల్క్ బ్యాంకు అలాంటిదే. ఈ బ్యాంకు ప్రధానంగా నీలోఫర్ హాస్పిటల్‌కు సేవలందిస్తోంది. ‘‘అక్కడ డెలివరీల్లో అల్పాదాయ కుటుంబాల వాళ్లే ఎక్కువ. నెలలు నిండక ముందే పుట్టిన పిల్లలు ఫార్ములా మిల్క్‌ను జీర్ణం చేసుకోలేరు, ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ కూడా కష్టమే. అందుకే మా సర్వీస్ ప్రధానంగా ఆ బిడ్డలకే’’ అన్నారు డాక్టర్ భవాని. చైతన్యప్ర‘దాత’లు... రక్తపరీక్ష చేసి హెచ్ఐవీ, హెపటైటిస్ వంటి మరికొన్ని అనారోగ్యాలు లేవని నిర్ధారించుకున్న తర్వాతనే మిల్క్ డొనేషన్‌ను ప్రోత్సహిస్తారు. డెలివరీ అయి హాస్పిటల్లో ఉన్న తల్లులతోపాటు డిశ్చార్జ్ అయి ఇంటికి వెళ్లిన తల్లుల నుంచి కూడా పాలను సేకరిస్తారు. ఇంట్లో ఉన్న తల్లులకు 250 మి.లీ, 500 మి.లీ. కెపాసిటీ కలిగిన ‘బ్రెస్ట్‌మిల్క్ స్టోరేజ్ పౌచ్’లను ఇస్తారు. తల్లులు తమ బిడ్డకు ఇవ్వగా మిగులు పాలను స్టెరిలైజ్ చేసిన పాత్రలోకి సేకరించి వాటిని పౌచ్‌లో పోసి ఇంట్లోనే డీప్‌ఫ్రీజర్‌లో పెడతారు. వారం లేదా పది రోజులకొకసారి మిల్క్ బ్యాంకు వాళ్లు వచ్చి ఆ పౌచ్‌లను కోల్డ్ స్టోరేజ్ బాక్స్‌లో పెట్టి బ్యాంకుకు చేరుస్తారు. బ్యాంకులో పాలను పాశ్చరైజ్ చేస్తారు. ఇన్ఫెక్షన్ కారకాలైమేనా ఉన్నాయేమోనని పరీక్ష చేస్తారు. ఆ తర్వాత పాలను చల్లబరిచి డీప్‌ఫ్రీజర్‌లో మైనస్ 20 డిగ్రీల ఉష్ణోగ్రతలో నిల్వ చేస్తారు. ఇలా మిల్క్ బ్యాంకులో నిల్వ చేసిన పాలను నాలుగు నుంచి ఆరునెలల వరకు ఉపయోగించవచ్చు. ‘పాలను సేకరించడం, మిల్క్ బ్యాంకుకు తరలించడం, ప్రాసెస్ చేయడం, నిల్వ చేయడం, అవసరమైన బిడ్డకు అందించడం’ ఇన్ని దశలుంటాయి. సాధారణంగా బ్లడ్‌బ్యాంకుల గురించి తెలిసినంతగా మిల్క్ బ్యాంకుల గురించి జనానికి పెద్దగా తెలియదు. కానీ చదువుకున్న మహిళల్లో చైతన్యం బాగా వచ్చిందని, హైదరాబాద్ నగరంలో 18వందలకు పైగా తల్లులు ధాత్రితో అనుసంధానమై పాలదానం చేస్తున్నారని తెలియచేశారు ధాత్రి నిర్వహకులు. పాలదాతలు తల్లి నుంచి పాలను సేకరించిన తర్వాత మామూలుగా నిల్వ ఉంచితే గంట లేదా రెండు గంటల్లో ఉపయోగించాలి. ఫ్రిజ్‌లో నిల్వ చేస్తే ఆరుగంటల వరకు వాడవచ్చు. ప్రసవం సెలవు పూర్తి చేసుకుని డ్యూటీలకు వెళ్లే తల్లులు ఇదే పద్ధతి పాటిస్తుంటారు. నెలల కొద్దీ నిల్వ ఉండేవి మిల్క్ బ్యాంకులో నిల్వ చేసినవి మాత్రమే. మిల్క్ డోనర్ మదర్లకు మేము పౌచ్ ఇచ్చేటప్పుడు కొన్ని జాగ్రత్తలు చెబుతాం. పౌచ్‌ను డీప్ ఫ్రీజర్‌లోనే పెట్టాలి. ఆ ఫ్రీజర్‌లో మరేదీ పెట్టకూడదు. ఇలా నిల్వ చేసిన పాలను వారం పది రోజుల్లో బ్యాంకుకు తెప్పించుకుంటాం. కరెంట్ పోతే అప్పటి వరకు ఇంట్లో నిల్వ చేసిన పాలను వెంటనే బ్యాంకుకు చేర్చాలి. మిగులు పాలు ఉన్న తల్లులనే ఎంపిక చేసుకుంటాం. కాబట్టి మిల్క్ డోనర్ల బిడ్డల ఆరోగ్యం గురించి ఆందోళన అక్కర్లేదు. ఒక తల్లి తన బిడ్డకు పాలిస్తూనే మరొక బిడ్డకు ప్రాణం పోయవచ్చు. డా. భవాని కలవలపల్లి పీడియాట్రీషియన్ , వైస్ ప్రెసిడెంట్, సుశేన హెల్త్ ఫౌండేషన్ సీఈవో, ఐడియా క్లినిక్స్ ఏడాదికి ఎనిమిది లక్షల మంది శిశువులు తల్లిపాలు లేని కారణంగా ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ మరణాలన్నీ బిడ్డకు ఆరు నెలలు నిండేలోపే సంభవిస్తున్నట్లు డబ్లు్యహెచ్‌వో లెక్కలు చెబుతున్నాయి. బిడ్డకు పాలివ్వడం ద్వారా తల్లుల ఆరోగ్యం కూడా బాగుంటుంది. భవిష్యత్తులో టైప్ టూ డయాబెటిస్, ఒవేరియన్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్, గుండె జబ్బుల బారిన పడే ప్రమాదాన్ని నివారిస్తుంది. తల్లీబిడ్డల ఆరోగ్యానికి దోహదం చేసే బ్రెస్ట్ ఫీడింగ్ పట్ల అవేర్నెస్ కోసం ఏటా ఆగస్టు మొదటి వారం రోజులను కేటాయించింది డబ్లు్యహెచ్‌వో. ఈ ఏడాది ‘స్టెప్ అప్ ఫర్ బ్రెస్ట్ ఫీడింగ్–ఎడ్యుకేట్ అండ్ సపోర్ట్’ థీమ్‌తో ముందుకెళ్తోంది. – వాకా మంజులారెడ్డి -
తల్లి పాలతోనే ఆరోగ్యం
వేలూరు: పురిటి బిడ్డలకు తల్లిపాలతోనే ఆరోగ్యమని కలెక్టర్ నందగోపాల్ తెలిపారు. ప్రపంచ తల్లిపాల దినోత్సవాన్ని పురస్కరించుకొని వారోత్సవాలను కలెక్టర్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ ప్రతి తల్లి పురిటి బిడ్డలకు పిల్లలకు ఆరు నెలల వరకైనా తల్లిపాలను ఇవ్వాలని డాక్టర్లు తల్లులకు అవగాహన కల్పించాలన్నారు. తల్లి పాలతో చిన్నారులు మంచి పౌష్టికశక్తితో పాటు ఆరోగ్యంగాను ఉంటారన్నారు. ప్రస్తుతం కాలంలో పురుషులతో పాటు మహిళలు కూడా ఉద్యోగాలకు వెళ్లడంతో చిన్నారులకు తల్లి పాలను ఇవ్వడంతో కాస్త ఇబ్బందులున్నాయన్నారు. కొంత మంది తల్లులు తల్లి పాలు ఇవ్వడం ద్వారా అందం చెడిపోతుందని పాలు ఇవ్వడంలో నిర్లక్ష్యం చేస్తున్నారని అటువంటి భ్రమలన్నీ వదిలి పెట్టాలన్నారు. తల్లిపాలు ఎంతో శ్రేయస్కరం అన్నారు. దేశంలో తల్లి పాలు ఇచ్చేవారి సంఖ్య తగ్గుతుందని వీటిపై ప్రతి గ్రామీణ ప్రాంతాల్లోనే కాకుండా పట్టణ ప్రాంతాల్లో కూడా అవగాహన కల్పించాలన్నారు. పుట్టిన అరగంటలోనే తల్లి ముర్రుపాలను ఇవ్వడం ద్వారా పుట్టిన బిడ్డ ఆరోగ్యంగా పెరుగుతుందన్నారు. అనంతరం తల్లి పాలు ఇవ్వడంపై మెడికల్ కళాశాల విద్యార్థులు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ప్రభుత్వ ఆస్పత్రి డీన్ సిద్ధతియా మున్వర్, ఆరోగ్యశాఖ అసిస్టెంట్ డెరైక్టర్ పూంగొ డి, ప్రిన్సిపాల్ భాస్కర్, పెన్నాతూర్ సర్పంచ్ అరుల్దాసన్, వైద్య సిబ్బంది, నర్సింగ్ విద్యార్థులు పాల్గొన్నారు. కలె క్టర్ కారును అడ్డుకున్న రోగులు తల్లిపాల వారోత్సవాలను ముగించుకొని వస్తున్న కలెక్టర్ కారును ప్రసవ వార్డులోని రోగులు అడ్డుకుని నిరసన తెలిపారు. తమ వార్డులో తాగునీరు, మరుగుదొడ్లలో నీరు లేకుండా తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వీటిపై చర్యలు తీసుకోవాలని కోరారు. సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.