యుద్ధం ఎక్కడ జరిగినా, ఎవరెవరి మధ్య జరిగినా, యుద్ధ ప్రభావం ప్రపంచమంతటా ఉంటుంది. జరిగే యుద్ధంతో ఎలాంటి సంబంధం లేని దేశాలు సైతం ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు. ప్రస్తుతం ఇరాన్‌కు, అమెరికా, ఇజ్రాయెల్‌లకు జరుగుతున్న యుద్ధ ప్రభావం ప్రపంచవ్యాప్తంగా కనిపిస్తోంది. ఇప్పటి వరకు ఈ యుద్ధంలో భారీ స్థాయిలో ప్రాణనష్టం జరిగింది. ఉభయ పక్షాల సైనికులు సహా దాదాపు పదివేల మంది ఇప్పటికే మరణించార
చమురు కేంద్రాలు, విద్యుత్ కేంద్రాలు సహా భారీ ఆస్తినష్టం కూడా జరిగింది. అయినా, ఇది ఇప్పుడిప్పుడే ముగిసే సూచనలు కనిపించడం లేదు. యుద్ధంలో వినియోగిస్తున్న అధునాతన విధ్వంసక ఆయుధాలు విపరీతమైన ప్రాణనష్టాన్ని, ఆస్తినష్టాన్ని మాత్రమే కాదు, పర్యావరణానికి కూడా అంతులేని చేటు తెచ్చిపెడుతున్నాయి. ఈ యుద్ధం వల్ల తలెత్తే విపరిణామాల గురించి ఒక విహంగ వీక్షణం...
భారత్‌కు భారీ ఆర్థిక నష్టం
ప్రత్యక్షంగా గాని, పరోక్షంగా గాని అమెరికా–ఇరాన్ యుద్ధంతో భారత్‌కు ఎలాంటి సంబంధం లేదు. అయినా, ఈ యుద్ధం భారత్‌లో ఆర్థిక భూకంపాన్ని సృష్టించిందనే చెప్పుకోవచ్చు. యుద్ధం మొదలైన నాటి నుంచి ఇప్పటి వరకు భారత స్టాక్ మార్కెట్‌లో మదుపరుల సొమ్ము ఏకంగా రూ. 41 లక్షల కోట్లకు పైగా ఆవిరైపోయింది. ఫారిన్ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు రూ.89 వేల కోట్లకు పైగా పెట్టుబడులను వెనక్కు తీసుకున్నారు.
డాలరుతో పోలిస్తే రూపాయి విలువ 93.30 మేరకు పడిపోయింది. రూపాయి విలువను నిలకడగా ఉంచడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన నిల్వల నుంచి దాదాపు రూ.1.25 లక్షల కోట్లు ఖర్చు చేసింది. ఇక ముడి చమురు బ్యారెల్ ధర వంద డాలర్లకు పైబడటంతో భారత్ ప్రతినెలా దిగుమతి బిల్లు వేలాది కోట్ల రూపాయలు అదనంగా చెల్లించాల్సి వస్తోంది. యుద్ధం కారణంగా ‘ఇంధన’ సెగ భారత్‌నూ తాకుతోంది. దీనివల్ల వంటగ్యాస్, పెట్రోలు, డీజిల్ ధరలు గణనీయంగా పెరిగాయి. వీటి పర్యవసానంగా నిత్యావసరాల ధరలూ పెరిగి, సామాన్యుల జేబులకు చిల్లులు పడుతున్నాయి.
భారత్‌పై యుద్ధ ప్రభావం
⇒ డాలర్‌తో రూపాయి విలువ పతనం రూ. 93.30
⇒ రిజర్వ్ బ్యాంకు నిల్వల నుంచి ఖర్చు రూ. 1.25 లక్షల కోట్లు
⇒ స్టాక్ మార్కెట్ నష్టాలు రూ. 41.00 లక్షల కోట్లు

అమెరికా, ఇజ్రాయెల్‌ల సైనిక ఖర్చు
యుద్ధం మొదలైన మొదటి ఆరు రోజుల్లోనే అమెరికా ఏకంగా రూ.1.01 లక్షల కోట్లు ఖర్చు చేసింది. యుద్ధం ప్రభావం వల్ల అమెరికా ఆర్థిక వ్యవస్థపై ఇప్పటి వరకు పడిన భారం దాదాపు రూ.17.4 లక్షల కోట్లు ఉండవచ్చని ఆర్థిక నిపుణుల అంచనా. ఇరాన్‌పై దాడుల కోసం ఇజ్రాయెల్ వారానికి సగటున రూ. 27,000 కోట్లు ఖర్చు చేస్తోంది. ఇజ్రాయెల్ ఇప్పటి వరకు రూ.1.56 లక్షల కోట్లు ఖర్చు చేసినట్లు అంచనా. యుద్ధం కోసం అమెరికా రోజువారీగా సగటున రూ. 7,500 కోట్లు, ఇజ్రాయెల్ రోజువారీగా సగటున రూ. 2,700 కోట్లు చొప్పున ఖర్చు చేస్తున్నట్లు అంతర్జాతీయ నివేదికలు చెబుతున్నాయి.
ప్రపంచానికి ఆర్థిక విఘాతం
ప్రస్తుతం కొనసాగుతున్న యుద్ధం ఫలితంగా యుద్ధంలో ప్రత్యక్షంగా పాల్గొంటున్న దేశాలే కాకుండా, ఇతర దేశాలకు కూడా ఆర్థిక విఘాతం తప్పని పరిస్థితులు ఉన్నాయి. ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్) అంచనాల ప్రకారం యుద్ధం కారణంగా ఈ ఏడాది పలు దేశాల స్థూల జాతీయోత్పత్తికి (జీడీపీ) గణనీయమైన నష్టం వాటిల్లనుంది. ప్రపంచ బ్యాంకు, ఐఎంఎఫ్ ప్రకటించిన తాజా అంచనాల ప్రకారం యుద్ధం వల్ల ఇరాన్ జీడీపీకి అత్య«ధికంగా సుమారు 20%–25% మేరకు నష్టం వాటిల్లనుంది. ఇజ్రాయెల్ జీడీపీకి సుమారు 5%, అమెరికా జీడీపీకి 1.2% నష్టం కలగనుంది. యుద్ధంతో సంబంధం లేకున్నా, దీని ప్రభావం భారత్ జీడీపీని 1.1% మేరకు దెబ్బతీసే అవకాశాలు ఉన్నాయి.
‘నాటో’ దేశాలు యుద్ధానికి దూరంగా ఉంటున్నా, చమురు ధరల భారం కారణంగా యూరోపియన్ యూనియన్, బ్రిటన్ సహా ‘నాటో’ దేశాల జీడీపీ 0.5% నుంచి 2% మేరకు దెబ్బతినే అవకాశాలు ఉన్నాయి. యుద్ధ పరిస్థితుల వల్ల యూరోపియన్ యూనియన్ సహా ‘నాటో’ దేశాలు రక్షణ వ్యయాన్ని మరింతగా పెంచాల్సిన పరిస్థితులు అనివార్యం కానున్నాయి. రష్యాతో తెగతెంపులు చేసుకున్నాక యూరోపియన్ యూనియన్ దేశాలు చమురు కోసం గల్ఫ్ దేశాలపై ఆధారపడుతున్నాయి. హర్ముజ్ జలసంధి మూసివేత ఫలితంగా యూరోపియన్ యూనియన్ దేశాలలో ఇంధన ధరలు మరింతగా పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి.
యుద్ధం ఇలాగే మరిన్ని రోజులు కొనసాగేటట్లయితే, యుద్ధంతో ప్రత్యక్ష సంబంధంలేని దేశాలకు కూడా ఆర్థిక ఇబ్బందులు తప్పవు. యుద్ధం ఫలితంగా పలు దేశాలలో వృద్ధి గణనీయంగా తగ్గిపోవడమే కాకుండా, ధరల పెరుగుదల ఎక్కువై ‘స్టాగ్‌ఫ్లేషన్’ పరిస్థితి నెలకొనే అవకాశాలు ఉన్నాయని ప్రపంచబ్యాంకు సహా పలు అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు అంచనా వేస్తున్నాయి. ‘స్టాగ్‌ఫ్లేషన్’ పరిస్థితుల్లో ఉత్పాదకత, ఉపాధి కుంటుపడతాయి. ఫలితంగా చాలా దేశాల్లో సామాన్యులపై పెనుభారం పడే అవకాశాలు ఉన్నాయి.
విధ్వంసకరమైన ఆయుధాలు
అమెరికా–ఇజ్రాయెల్ ఒకవైపు, ఇరాన్ మరోవైపు ఈ యుద్ధంలో విధ్వంసకరమైన ఆయుధాలతో తలపడుతున్నాయి. ఇప్పటి వరకు వినియోగించిన ఆయుధాలు అత్యంత ఖరీదైనవి, అధునాతనమైనవి. ఈ ఆయుధాలు ఎంత ఖరీదైనవో, ఇవి సృష్టించే విధ్వంసం వల్ల సంభవించే నష్టం అంతకంటే ఎన్నో రెట్లు ఎక్కువగా ఉంటుంది. ఇప్పటి వరకు ఉభయ పక్షాలూ ఈ యుద్ధంలో ఉపయోగిస్తున్న ప్రధానమైన ఆయుధాల వివరాలు
ఎఫ్ 35 లైటెనింగ్–2 విమానం
రాడార్లకు చిక్కకుండా లక్ష్యాలపై బాంబులను జారవిడవగల యుద్ధవిమానం ఇది. ఈ విమానాలను అమెరికా పదుల సంఖ్యలోనే ఇరాన్‌పై దాడుల కోసం రంగంలోకి దించింది. ఇరాన్ క్షిపణుల దెబ్బకు ఇప్పటి వరకు ఎఫ్35 లైటెనింగ్ విమానాలు రెండు నేలకూలాయి. వీటి ఖరీదు ఒక్కొక్కటి రూ.960 కోట్లు.
లూకాస్ డ్రోన్లు
శత్రు స్థావరాల మీద దాడుల కోసం రూపొందించిన డ్రోన్ ఇది. తక్కువ ఖరీదు చేసే ఈ డ్రోన్లను అమెరికా బలగాలు ఇరాన్‌పై దాడుల్లో ఇప్పటికే వందల సంఖ్యలో ప్రయోగించింది. వీటి ఖరీదు ఒక్కొక్కటి రూ.32 లక్షలు.
టొమాహాక్ క్రూజ్ మిసైల్స్
దాదాపు 1500 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగలిగిన క్షిపణి ఇది. ఇప్పటి వరకు జరిగిన దాడుల్లో అమెరికా బలగాలు దాదాపు
850 టొమాహాక్ క్షిపణులను ఉపయోగించింది. వీటి ఖరీదు ఒక్కొక్కటి రూ.23 కోట్లు.
ఎస్‌ఎం3 ఇంటర్సెప్టర్ క్షిపణులు
శత్రువుల క్షిపణులను మార్గమధ్యంలోనే ధ్వంసం చేయడానికి రూపొందించిన శక్తిమంతమైన ఆయుధం ఇది. ఇరాన్‌పై జరిగిన దాడుల్లో ఇప్పటి వరకు అమెరికా బలగాలు దాదాపు వంద వరకు ఈ క్షిపణులను ఉపయోగించాయి. వీటి ఖరీదు ఒక్కొక్కటి రూ. 116 కోట్లు.
యారో–3
ఇది శక్తిమంతమైన ఇంటర్సెప్టర్ క్షిపణి. శత్రు బలగాలు ప్రయోగించే క్షిపణులను 100 కిలోమీటర్ల ఎత్తులోనే నాశనం చేయగల సామర్థ్యం గల అధునాతన ఆయుధం ఇది. ఇరాన్‌పై జరుగుతున్న దాడుల్లో ఇజ్రాయెల్ బలగాలు ఇప్పటి వరకు దాదాపు 35 వరకు యారో–3 క్షిపణులను ఉపయోగించాయి. వీటి ఖరీదు ఒక్కొక్కటి సుమారు రూ.33 కోట్లు.
ఐరన్ డోమ్
ఇది కూడా ఇంటర్సెప్టర్ క్షిపణి. శత్రు బలగాలు ప్రయోగించే క్షిపణులను 70 కిలోమీటర్ల దూరంలోనే పడగొట్టగల సామర్థ్యం గల ఆయుధం ఇది. ఇరాన్‌పై దాడుల్లో ఇజ్రాయెల్ బలగాలు ఐరన్ డోమ్ క్షిపణులను ఇప్పటి వరకు వందల సంఖ్యలోనే ప్రయోగించినట్లు సమాచారం. వీటి ఖరీదు ఒక్కొక్కటి సుమారు రూ.42 లక్షలు.
ఫతా–2
ధ్వని వేగాన్ని మించిన వేగంతో దూసుకుపోయి, సుమారు 1500 కిలోమీటర్ల దూరంలోని శత్రు స్థావరాలను ధ్వంసం చేయగల శక్తిమంతమైన ఆయుధం. దీని ఖరీదు ఒక్కొక్కటి సుమారు రూ.93 లక్షలు.
ఖైబర్ షెకాన్
ఇది దాదాపు రెండువేల కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ధ్వంసం చేయగల శక్తిమంతమైన ఆయుధం. అమెరికా బలగాలు ‘ఆపరేషన్ ఫ్యూరీ’ మొదలుపెట్టిన తర్వాత ఇరాన్ బలగాలు దాదాపు 180 వరకు ఖైబర్ షెకాన్ క్షిపణులను ప్రయోగించాయి. వీటి ఖరీదు ఒక్కొక్కటి సుమారు రూ.35 కోట్లు.
షాహెద్–136 డ్రోన్లు
శత్రు స్థావరాలపై దాడుల కోసం తక్కువ ఖరీదుతో రూపొందించిన డ్రోన్లు ఇవి. అమెరికా, ఇజ్రాయెల్ స్థావరాలపై ఇరాన్ బలగాలు ఇప్పటి వరకు దాదాపు రెండువేల వరకు ఈ డ్రోన్లను ఉపయోగించాయి. వీటి ఖరీదు ఒక్కొక్కటి రూ.27 లక్షలు.
ప్రపంచ దేశాలకు ఇక్కట్లు
ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ సాగిస్తున్న యుద్ధం ఫలితంగా ప్రపంచ దేశాలకు అనేక ప్రతికూల ఫలితాలు తప్పవని అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు హెచ్చరిస్తున్నాయి. మరికొన్నాళ్లు ఇదే పరిస్థితి దొరికితే చాలా దేశాలు చమురు సంక్షోభాన్ని ఎదుర్కోక తప్పదు. ముడి చమురు ధరలు మరో ముప్పయి శాతం పెరిగే అవకాశాలు కూడా లేకపోలేదని అంతర్జాతీయ నిపుణుల అంచనా. చమురు ధరల పెరుగుదల వల్ల నిత్యావసరాల ధరలు పెరిగి, సామాన్యులు గడ్డు పరిస్థితుల్లో పడే అవకాశాలు ఉన్నాయి.
ద్రవ్యోల్బణం, మాంద్యం ఏకకాలంలో ఆర్థిక వ్యవస్థలను తీవ్రంగా దెబ్బతీసే అవకాశాలు కూడా ఉన్నాయని ఐఎంఎఫ్ వంటి సంస్థలు హెచ్చరిస్తున్నాయి. దీనివల్ల పలు దేశాల జీడీపీ వృద్ధి తిరోగమనం చెందవచ్చని కూడా చెబుతున్నాయి. ఈ యుద్ధం వల్ల ఇరాన్‌తో పాటు పశ్చిమాసియా దేశాలకు తీవ్ర నష్టం ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. పరస్పర దాడుల్లో ఇరాన్ సరిహద్దుల్లోని సౌదీ అరేబియా, యూఏఈ తదితర దేశాలలో భారీ నిర్మాణాలకు ముప్పుతో పాటు, తీవ్ర జననష్టం జరిగే ప్రమాదాలు ఉన్నాయి.
చమురు రవాణాకు కీలకమైన హర్ముజ్ జలసంధి మూసివేత వల్ల అంతర్జాతీయ నౌకా వాణిజ్యానికి అవరోధాలు ఏర్పడి పశ్చిమాసియా దేశాలకు నిత్యావసరాల సరఫరా నిలిచిపోయే అవకాశాలు ఉన్నాయి. దీనివల్ల పశ్చిమాసియాలో ఆహార సంక్షోభం ఏర్పడే పరిస్థితులు తలెత్తవచ్చు. పశ్చిమాసియాకు వెలుపల చమురు ఉత్పాదనలో కీలకమైన రష్యా తనతో సానుకూల సంబంధాలు కలిగిన దేశాల చమురు లోటు తీర్చడానికి ముందుకు వచ్చి, బలమైన కూటమిని ఏర్పాటు చేసుకునే సూచనలు ఉన్నాయి. దీని పర్యవసానాలు ఎలా ఉంటాయో ఇప్పుడే అంచనా వేయడం కష్టమే!


