రూ.1,500 ర్యాలీ
విదేశీ మార్కెట్లో డౌన్
న్యూఢిల్లీ: పసిడి ధరలు మళ్లీ పుంజుకున్నాయి. యూఎస్ డాలర్ బలహీనపడడంతో బులియన్ మార్కెట్‌లో సెంటిమెంట్ మెరుగుపడింది. వరుసగా మూడు రోజుల నష్టాల అనంతరం మంగళవారం ఢిల్లీ మార్కెట్లో 10 గ్రాముల బంగారం రూ.1,500 పెరిగి రూ.1,60,300కు చేరింది. వెండి ధర మాత్రం క్రితం రోజుతో పోలి్చతే ఎలాంటి మార్పు లేకుండా కిలోకి రూ.2,55,700 వద్ద కొనసాగింది.
ముడి చమురు ధరలు దిగిరావడం, అమెరికా యూఎస్ డాలర్, ట్రెజరీ బాండ్ ఈల్డ్స్ బలహీనపడడం బంగారం ధరల పెరుగుదలకు దారితీసినట్టు హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ కమోడిటీస్ సీనియర్ అనలిస్ట్ సౌమిల్ గాంధీ తెలిపారు.
ఇరాన్, ఇజ్రాయెల్ పరస్పర దాడులను విరమించుకోవాలన్న అంగీకారానికి రావడంతో సెంటిమెంట్ మెరుగుపడినట్టు చెప్పారు. అధికారిక కాల్పుల విరమణ దిశగా పురోగతి ఉందన్న అమెరికా అధ్యక్షుడి వ్యాఖ్యలతో ద్వైపాక్షిక పరిష్కారంపై అంచనాలు ఏర్పడినట్టు తెలిపారు. దీంతో ఇంధన ధరల ఆధారిత ద్రవ్యోల్బణంపై ఆందోళనలు తగ్గి బంగారం ధరలకు మద్దతిచ్చినట్టు చెప్పారు.
అంతర్జాతీయంగా భారీ పతనం
అంతర్జాతీయ మార్కెట్లో పసిడి 2 శాతం తగ్గి ఔన్స్‌కు 4,270 డాలర్ల వద్ద, వెండి ధర 5 శాతం పతనంతో ఔన్స్‌కు 65 డాలర్ల వద్ద ట్రేడవుతున్నాయి.


