
విలక్షణత, వారసత్వ గుర్తింపు కలిగి ఉన్న విశిష్ట ఉత్పత్తులకు ప్రత్యేక గుర్తింపు ఉంటే బాగుంటుంది. ఆ గుర్తింపును బట్టి ఆ ఉత్పత్తి ఏ భౌగోళిక ప్రాంతానికి చెందినదో తెలుస్తుంది. తద్వారా ఆర్థిక, సాంస్కృతిక ప్రయోజనాలు చేకూరతాయి. ఇందు కోసమే భౌగోళిక సూచిక (జాగ్రఫికల్ ఇండికేషన్స్–జీఐ..Geographical Indication (GI)లు కేటాయించే ప్రక్రియ అంతర్జాతీయంగా అమల్లో ఉంది. జీఐ ఉన్న ఉత్పత్తులకు మార్కెట్‌లో మంచి ధర కూడా వస్తుంది. భారత్‌లో 2004 నుంచి జీఐల కేటాయింపు మొదలైంది. ఈ అంశంపై ప్రజల్లో అవగాహన ఎక్కువగా ఉన్న అధికాదాయ, ఉన్నత మధ్యతరహా ఆదాయ దేశాల్లో ఎక్కువ జీఐలు నమోదవుతున్నాయి. చైనా, యూరోపియన్ యూనియన్‌లో ఫ్రాన్స్ వంటి దేశాలు ఇప్పటికే వేల కొలదీ ఉత్పత్తులకు జీఐలు ఇచ్చాయి. జీఐ జాబితాలో వైన్స్, స్పిరిట్స్‌ది అగ్రస్థానం. తర్వాతే వ్యవసాయ, ఆహారోత్పత్తులు.
2024 నాటికి మన 643 ఉత్పత్తులకు మాత్రమే జీఐ గుర్తింపు ఉంది. తెలుగు రాష్ట్రాల్లో మరీ తక్కువ. చేతి వృత్తి కళాకారులు తయారు చేసే ఉత్పత్తులు, వ్యవసాయోత్పత్తులు మన దేశంలో ఎక్కువగా జీఐ గుర్తింపు ΄పొందాయి. ఇతర రంగాల్లో విలక్షణ ఉత్పత్తులపై మనం ఇంకా దృష్టి సారించాల్సి ఉందంటున్నారు నిపుణులు. ప్రాంతీయ వారసత్వ సుసంపన్నతను పరిరక్షించుకోవటానికి, తద్వారా ఆర్థికాభివృద్ధి సాధించడానికి జీఐ గుర్తింపును సోపానంగా మార్చుకోవాలి. జీఐ గుర్తింపు ΄ పొందిన ఉత్పత్తులను ప్రధాన మార్కెట్లలోకి అందుబాటులోకి తెచ్చే మౌలిక సదుపాయాల కల్పనపైనా ప్రత్యేక దృష్టి సారించాల్సి ఉంది.. ఈ ఏఐ యుగంలో జీఐ లోకంలో అభివృద్ధి మార్గాలేమిటో తొంగి చూద్దాం రండి..!
మేధో సంపత్తి (ఇంటల్లెక్చువల్ ప్రాపర్టీ– ఐపీ) హక్కులు అనేవి మానవ మేధస్సు నుంచి వెలువడే ఉత్పత్తులను, వాటి సృష్టికర్తల ప్రయోజనాలను కాపాడే ప్రపంచవ్యాప్త చట్టబద్ధత కలిగిన ఒక వ్యవస్థలో భాగం. ఈ మేధో ఆస్తులను ఉపయోగించుకునే హక్కు, నియంత్రించే హక్కు ఎవరికి ఉంది? ఎవరి నుంచి అనుమతి ఎలా పొందవచ్చో జీఐ తెలియజేస్తుంది. ట్రేడ్‌మార్క్‌లు, భౌగోళిక సూచికలు.. రెండూ ఐటెంటిఫయ్యర్లుగా, డిఫరెన్షియేషన్ టూల్స్‌గా పనిచేస్తాయి. ట్రేడ్‌మార్క్‌లు ఉత్పత్తి వ్యాపార మూలాన్ని సూచిస్తాయి. అయితే జీఐలు దాని భౌగోళిక మూలాన్ని సూచిస్తాయి.
భౌగోళిక సూచికలు (జీఐలు) నిర్దిష్ట ప్రాంతాలకు సంబంధించిన ఉత్పత్తులకు ప్రపంచ మేధో సంపత్తి సంస్థ (డబ్ల్యూఐపీఓ) మార్గదర్శకాలకు అనుగుణంగా చట్టపరమైన రక్షణను అందిస్తాయి. ఉత్పత్తుల ప్రత్యేక లక్షణాలను, వారసత్వాన్ని జీఐలు ఎత్తి చూపుతాయి. సాంప్రదాయ ఉత్పత్తులను రక్షించడానికి, ప్రాంతీయ ఆర్థికాభివృద్ధిని ప్రోత్సహించడానికి, మార్కెట్‌లో ఉత్పత్తి నాణ్యతను నిర్ధారించడానికి సాధనాలుగా పనిచేస్తున్నందున జీఐల ప్రాముఖ్యత పెరిగింది. ప్రపంచవ్యాప్తంగా వైన్‌లు, స్పిరిట్‌లు జీఐలలో అత్యధిక వాటాను కలిగి ఉన్నాయి. భారతదేశంలో జీఐ రంగంలో వ్యవసాయ వస్తువులు, హస్తకళల ఉత్పత్తులదే పైచేయి.
భారతదేశ మేధో సంపత్తి చట్టం నాలుగో షెడ్యూల్ ప్రకారం, వస్తువులను 34 తరగతులుగా వర్గీకరించారు. దీనిలో 31వ తరగతి వ్యవసాయ, ఉద్యానవన, అటవీ ఉత్పత్తులు, ఇతర తరగతులలో చేర్చని ధాన్యాలు, జంతువులు, తాజా పండ్లు, కూరగాయలు, విత్తనాలు, మొక్కలు, పువ్వులు, జంతువుల ఆహార పదార్థాలు, పులియబెట్టిన పదార్థాలు, మాల్ట్ ఉన్నాయి. పర్మిజియానో రెగ్జియానో, షాంపైన్ వంటి మద్యం ఉత్పత్తులతో యూరోపియన్ యూనియన్ (ఈయూ) జీఐ వ్యవస్థలో ముందంజలో ఉంది.
పూర్వం నుంచి ఫ్రాన్స్ ఇటలీ, స్పెయిన్ జీఐ ఉత్పత్తుల్లో ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. అయితే, చైనా, భారత్ వంటి దేశాలు జీఐలను ఆర్థిక అభివృద్ధి సాధనాలుగా గుర్తించటంలో, ఉపయోగించడంలో ఇటీవల కాలంలో గణనీయమైన పురోగతి సాధించాయి. పెద్దగా ప్రసిద్ధి చెందని వ్యవసాయ, ఆహార ఉత్పత్తులకు ప్రపంచ ఖ్యాతిని తేవటంలో, ΄ోటీని పెంచటంలో జీఐలు ఉపయోగపడతాయి. వియత్నాం, దక్షిణ కొరియా, ఇండోనేషియా వంటి దేశాలు ప్రపంచ మార్కెట్లలో తమ ఉత్పత్తుల విలక్షణతను చాటి చెప్పటానికి జీఐలను ఎక్కువగా ఉపయోగించుకున్నాయి. వియత్నాంలో స్థిరమైన గ్రామీణ అభివృద్ధికి జీఐలు సానుకూలంగా దోహదపడ్డాయి.
1999 చట్టంతో శ్రీకారం
ప్రపంచవ్యాప్తంగా సమాజాల సాంస్కృతిక పరిరక్షణ, ఆర్థిక వృద్ధికి జీఐలు కీలకమైన సాధనాలుగా మారాయి. మన దేశ జీఐ ప్రయాణం భౌగోళిక వస్తువుల సూచికలు (రిజిస్ట్రేషన్ మరియు రక్షణ) చట్టం– 1999తో ప్రారంభమైంది. ఇది 2004లో 20 ఏళ్ల క్రితం అమల్లోకి వచ్చింది. మొదటి జీఐ ట్యాగ్ డార్జిలింగ్ టీకి లభించింది. అప్పటి నుండి భారతదేశం జీఐ రిజిస్ట్రేషన్లలో వేగవంతమైన వృద్ధిని సాధించాం. ప్రధానంగా సాంప్రదాయ వస్తువులను రక్షించడం, గ్రామీణ ఆర్థిక వ్యవస్థలను పెం΄÷ందించడం జీఐ ట్యాగ్‌ల ద్వారా కొంతమేరకు సాధ్యపడుతోంది. స్థానిక సమాజాలు తరచుగా పర్యావరణ అనుకూలమైన సాంప్రదాయ పద్ధతులను పరిరక్షించటంపై దృష్టి సారించడంతో జీఐ గుర్తింపు అటువంటి ఉత్పత్తి పద్ధతులను వెలుగులోకి తెస్తోంది.
సవాళ్లెన్నో..
జీఐ వ్యవస్థకు ఈ సానుకూల పరిణామాలు ఉన్నప్పటికీ, భారతదేశంలో అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నది. ఉత్పత్తిదారులు, వినియోగదారులలో జీఐలపై అవగాహన, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో, తక్కువగా ఉంది. జీఐలను నమోదు చేయడం, అమలు చేయడం సంక్లిష్టంగా ఉండటంతో పాటు ఇది ఖరీదైన వ్యవహారంగా మారిపోవటం చిన్న ఉత్పత్తిదారులకు ప్రతిబంధకాలుగా మారాయి. అయితే, ఆశావహ భవిష్యత్తు కూడా కనిపిస్తోంది. స్థానిక ఆర్థిక వ్యవస్థలను, సుస్థిరతను ప్రోత్సహించడంలో జీఐ పాత్రకు గుర్తింపు పెరుగుతోంది. అంతేకాకుండా, భౌగోళిక గుర్తింపు ఉన్న ఉత్పత్తుల ట్రేసబిలిటీ, ధృవీకరణను పెంపొందించడానికి డిజిటల్ టెక్నాలజీలను వాడుకుంటే.. అది మార్కెట్ విస్తరణకు కొత్త అవకాశాలను తెరుస్తుంది.
వాణిజ్య ఒప్పందాల్లో రక్షణ అవసరం
మన దేశంలో ఉత్తరప్రదేశ్, తమిళనాడు, మహారాష్ట్ర ఉత్పత్తులకు జీఐ గుర్తింపు పొందటంలో ముందంజలో ఉన్నాయి. అయితే, ఇతర దేశాలతో పోల్చితే జీఐల నమోదు ప్రక్రియ మన దేశంలో ఊపందుకోలేదని చెప్పచ్చు. చిన్నస్థాయి ఉత్పత్తిదారులకు సులువుగా అర్థమై, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పుంజుకోగలిగేలా జీఐ ప్రక్రియను సరళీకృతం చేయాలన్న వాదన ఉంది. అయితే, జీఐ గుర్తింపు ఇవ్వటంతోనే రైతులకు ఒరిగేదేమీ ఉండదు. రిజిస్ట్రేషన్ తర్వాత మద్దతు అవసరం. అప్రమత్తంగా ఉండాల్సిన ఒక విషయమేమిటంటే.. జీఐ గుర్తింపులు ΄ పొందటగుత్తాధిపత్యానికి దారితీసే పరిస్థితులను ఒక కంట కనిపెట్టాలి. ఎందుకంటే, ఆ ధోరణి చిన్న, సన్నకారు రైతులకు తీవ్ర నష్టదాయక పరిస్థితులకు దారితీసే ముప్పు ఉంటుంది. అంతర్జాతీయ వాణిజ్య ఒప్పందాల్లో జీఐ ఉత్పత్తులకు తగిన రక్షణ ఉండేలా పాలకులు రక్షణాత్మక జాగ్రత్తలు తీసుకోవాలి. అప్పుడే అంతర్జాతీయ మార్కెట్లలో మన జీఐ ఉత్పత్తులు రాణించగలుగుతాయి. చిన్నస్థాయి ఉత్పత్తిదారుల సవాళ్లను అంతర్జాతీయ, జాతీయ శక్తులు పరిష్కరించి, సాంకేతిక అభివృద్ధిని జోడించినప్పుడే జీఐ ద్వారా ఆర్థికాభివృద్ధిని అందిపుచ్చుకోవటం సాధ్యమవుతుంది.
ఆర్థికాభివృద్ధితో నాటు ప్రాంతీయ విలక్షణ సాంస్కృతిక వారసత్వంతో ముడిపడిన మన సంప్రదాయ ఉత్పత్తులకు ప్రపంచవ్యాప్త గుర్తింపు, ప్రాభవం లభిస్తాయని నిపుణులు సూచిస్తున్నారు. సేంద్రియ/ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో పండించే ఔషధ గుణాలున్న దేశీ పంట ఉత్పత్తులకు జీఐ ఇచ్చి, వాటిని విదేశాలకు ఎగుమతి చేస్తే మన రైతులకు, దేశానికి మంచి ఆదాయం చేకూరుతుంది.

-పంతంగి రాంబాబు, సాక్షి, సాగుబడి డెస్క్.