‘నీతో మాట్లాడాలని ఎంతో ఉంది. కాని, నా రీచార్జ్ ప్లాన్ అయిపోయింది’ అని ఫోన్ నోరు మూసేసే బాధ ఒకరిదిదైతే, ప్రతి నెలా మొబైల్ బిల్లుల రిమైండర్‌కి భయపడి ముందుగా చెల్లించే వారిది ఇంకోరకం బాధ. ఇలా రీచార్జ్ కష్టాల మాయలో మునిగిపోయినప్పుడు ఆఫ్రికాలోని ఒక అబ్బాయి నెట్‌వర్క్‌కే నేరుగా ‘గుడ్ బై’ చెప్పేశాడు. సిమ్ లేదు, టవర్ లేదు, డేటా అవసరం అసలే లేదు, అయినా కూడా ఫోన్ లో ‘హలో!’ అన్నాడు. అదే సైమన్ పీట్రస్ కనిపెట్టిన టెక్నాలజీ మ్యాజిక్!
ఆఫ్రికాలోని న మీబియాలో ఉండే ఓ చిన్న గ్రామం. అక్కడ గాలి, ఇసుక, నిశ్శబ్దం తప్ప పెద్దగా టెక్నాలజీకి హలో చెప్పేవారు తక్కువ. చాలామంది ఇళ్లలో విద్యుత్ కూడా ఉండదు. ఇక మొబైల్ సిగ్నల్ అంటే లాటరీ కొట్టడం లాంటిది. ఇలా నెట్‌వర్క్ కూడా లేని ఊరిలో పెరిగిన సైమన్ , అసలు సమస్య సిగ్నల్లో లేదని, టెక్నాలజీలో ఉందని నమ్మాడు. ఆ నమ్మకమే అతన్ని సిమ్ లేకుండా కాల్ చేసే ఫోన్ వైపు నడిపించింది.
చాలామంది ‘ఇది ఎలా సాధ్యం?’ అంటూ నవ్వుకున్నారు. కాని, అతను మాత్రం పాత రేడియోలు, టీవీలు, మొబైల్ స్క్రాప్స్ అన్నింటినీ కలిపి ఒక కొత్త ఫోన్ తయారు చేశాడు. రేడియో ఫ్రీక్వెన్సీతో రెండు దారులుగా మాట్లాడుకునే సిస్టమ్. వాకీ–టాకీలా కనిపిస్తుంది కాని, కాదు. పూర్తిగా ఫోన్ రూపంలోనే తయారుచేశాడు. ఈ ఫోన్‌లోనే టీవీ చూడొచ్చు, లైట్ ఆన్ చేయొచ్చు, ఒక ఇన్‌బిల్ట్ సోలార్ చార్జర్‌ని సెట్ చేశాడు. అతని ప్రతిభను మెచ్చి, స్కూల్ సైన్ ్స ఫెయిర్‌లో మొదటి బహుమతి ఇచ్చేశారు.
వార్తలు అంతర్జాతీయంగా పాకాయి. కాని, ఆ తర్వాత పెద్ద కంపెనీలు, పెట్టుబడిదారులు, పరిశోధన కేంద్రాలు ఎవరూ ముందుకు రాలేదు. ఇది కొంచెం బాధే. అయినప్పటికీ, చాలామంది ఇంజినీర్లు, శాస్త్రవేత్తలు, యువ ఆవిష్కర్తలు అతని ప్రయోగాన్ని అభినందిస్తున్నారు.
పునర్వినియోగ టెక్నాలజీలు, నూతన విద్యుత్ పనితీరులు, కమ్యూనికేషన్ రంగాల్లో సైమన్ ప్రయోగం ఒక మంచి ప్రేరణగా నిలుస్తోందని ప్రసంసిస్తున్నారు. కొన్నిసార్లు కోట్ల బడ్జెట్‌లు, భారీ లాబొరేటరీలు, పెద్ద పెద్ద కంపెనీలు తప్పనిసరి కాదు, కాని, భవిష్యత్తు ఆవిష్కరణలు ఒక చిన్న స్పార్క్‌తోనే మొదలవుతాయి అని సైమన్ అందరికీ రిమైండ్ చేస్తున్నాడు.


