ప్రపంచవ్యాప్తంగా వస్త్ర రంగంలో అత్యున్నత నాణ్యతా ప్రమాణాలకు మారుపేరుగా నిలిచేందుకు భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ‘కస్తూరి కాటన్ భారత్’ కార్యక్రమం అంతర్జాతీయ మార్కెట్‌లో సరికొత్త గుర్తింపును సంతరించుకుంటోంది. కేంద్ర జౌళి మంత్రిత్వ శాఖ, కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ), వస్త్ర ఎగుమతుల ప్రోత్సాహక మండలి (టెక్స్‌ప్రోసిల్) సంయుక్త ఆధ్వర్యంలో రూపొందించిన www.kasturicotton.com పోర్టల్ ద్వారా భారతీయ పత్తికి అంతర్జాతీయ స్థాయిలో తిరుగులేని బ్రాండ్ ఇమేజ్‌ను కల్పిస్తున్నారు.
ప్రత్యేక దేశీయ బ్రాండ్ గుర్తింపు
భారతదేశం ప్రపంచంలోనే పత్తి ఉత్పత్తిలో అగ్రగామిగా ఉన్నప్పటికీ, అంతర్జాతీయంగా ఈజిప్షియన్ కాటన్, అమెరికాలోని సుపీమా కాటన్ తరహాలో భారతీయ బ్రాండ్ గతంలో లేదు. ఈ సమస్యను అధిగమించటానికి ‘కస్తూరి కాటన్ భారత్’ సర్టిఫికేషన్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. 28 మిల్లీమీటర్లకు పైబడిన పొడవైన పింజ కలిగిన, అత్యుత్తమ నాణ్యత కలిగిన పత్తికి ‘కస్తూరి కాటన్’ బ్రాండింగ్‌ను కేటాయిస్తున్నారు. ఇది వస్త్రాలకు మృదుత్వాన్ని మన్నికను, సహజ కాంతిని, అధిక బలాన్ని చేకూరుస్తుంది.
ఎన్.ఎ.బి.ఎల్. గుర్తింపు పొందిన ప్రయోగశాలల్లో కఠినమైన పరీక్షలు నిర్వహించిన అనంతరమే ఈ ధ్రువీకరణను మంజూరు చేస్తున్నారు. రైతులు పండించి విక్రయించిన తర్వాత జిన్నింగ్ మిల్లులకు చేరిన పత్తిలో ఈ ప్రమాణాలకు తగినవిధంగా ఉండే పత్తిని గుర్తించి ‘కస్తూరి కాటన్ భారత్’ సర్టిఫికేషన్‌ను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేస్తుంది. ఈ పత్తిని అంతర్జాతీయ వాణిజ్య సంస్థలు అధిక ధర చెల్లించి కొనుగోలు చేస్తున్నాయి. బ్లాక్‌చెయిన్ టెక్నాలజీతో పారదర్శకత
కస్తూరి కాటన్ ప్రత్యేకతల్లో అత్యంత కీలకమైనది ‘ట్రేసబిలిటీ’. అత్యాధునిక బ్లాక్‌చెయిన్ సాంకేతికత, క్యూఆర్ కోడ్ ఆధారంగా ఏ పొలంలో ఈ పత్తి పండించారు? నుంచి జిన్నింగ్, స్పిన్నింగ్ ఎక్కడ జరిగింది? నేత ద్వారా వస్త్రం ఎక్కడ తయారైంది? వరకు జరిగే ప్రయాణాన్ని ΄ారదర్శకంగా నమోదు చేస్తారు. దీన్నే ట్రేసబిలిటీ అంటారు.
వినియోగదారులు లేదా అంతర్జాతీయ కొనుగోలుదారులు క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయటం ద్వారా ఆ పత్తి మూలాలు నిర్థారణగా తెలుసుకుంటారు. ఇది 100% భారతీయ పత్తి అవునా కాదా అనేది తెలుసుకోవటంతో పాటు దాని నాణ్యతా వివరాలను క్యూఆర్ కోడ్‌ను స్కాన్ ద్వారా తక్షణమే తెలుసుకోవచ్చు. ఎలాంటి మానవ ప్రమేయం, తారుమారుకు తావులేకుండా నకిలీలను అరికట్టేలా ఈ వ్యవస్థను తీర్చిదిద్దారు.
రైతులకు, దేశీయ పరిశ్రమకు ఊతం
కస్తూరి కాటన్ కార్యక్రమం ద్వారా భారతీయ రైతులకు, జిన్నింగ్–స్పిన్నింగ్ మిల్లులకు అంతర్జాతీయ మార్కెట్‌లో ప్రీమియం ధరలు లభించే అవకాశం ఏర్పడుతోంది. నాణ్యమైన ముడిసరుకు లభించటం వల్ల వస్త్ర తయారీలో లోపాలు తగ్గి, వ్యర్థాలు గణనీయంగా తగ్గుతాయి. దేశీయ మార్కెట్‌తోపాటు అంతర్జాతీయ ఎగుమతులకు కూడా ఇది బలమైన చోదకశక్తిగా మారుతోంది.
‘మేక్ ఇన్ ఇండియా’ స్ఫూర్తితో, సుస్థిరత, విశ్వసనీయతలను కలగలిపి రూపుదిద్దుకున్న ‘కస్తూరి కాటన్ భారత్’... భారతీయ వస్త్ర పరిశ్రమను అంతర్జాతీయ వేదికపై అగ్రస్థానంలో నిలబెడుతోంది. అధీకృత సంస్థలు, తయారీదారులు అధికారిక పోర్టల్ ద్వారా ప్రమాణాలను పాటిస్తూ ఈ గ్లోబల్ బ్రాండింగ్‌లో భాగస్వాములవుతున్నారు.
రైతన్నకు ‘కస్తూరి కాటన్’ భరోసా!
భారతీయ పత్తి రైతులకు ‘కస్తూరి కాటన్’ బ్రాండింగ్ సరికొత్త ఆర్థిక భరోసాను కల్పిస్తోంది. సాంప్రదాయకంగా పత్తిని సాధారణ ధరకు విక్రయించి నష్ట΄ోతున్న రైతులకు, ఈ గుర్తింపు ద్వారా అంతర్జాతీయ స్థాయిలో ప్రీమియం మార్కెట్ అందుబాటులోకి వస్తోంది.
పంట తీసే సమయంలో సరైన యాజమాన్య పద్ధతులు పాటించి చెత్తాచెదారం, తేమ లేకుండా పొడవైన పింజ పత్తిని అందించే రైతులకు అదనపు లాభాలు చేకూరుతున్నాయి. బ్లాక్‌చెయిన్ ఆధారిత ట్రేసబిలిటీ ద్వారా మధ్యవర్తుల దోపిడీ అరికడుతున్నారు. నాణ్యమైన పంటను పండించిన అన్నదాత కృషికి ప్రపంచవ్యాప్త గుర్తింపుతో పాటు మార్కెట్ కన్నా మెరుగైన గిట్టుబాటు ధర లభిస్తోంది. పత్తి సాగును లాభసాటిగా మార్చేందుకు ఇది చక్కటి మార్గం.
‘కస్తూరి కాటన్’ సర్టిఫికేషన్ ఎలా?
‘కస్తూరి కాటన్’ అనేది ప్రత్యేకంగా విత్తే ఒక కొత్త వంగడం (విత్తనం) కాదు. ఇది నిర్దిష్ట నాణ్యతా ప్రమాణాలు కలిగిన భారతీయ పత్తికి ఇచ్చే ఒక ప్రీమియం ‘బ్రాండ్, ధ్రువీకరణ’. అందువల్ల దీనికి విడిగా ‘ఇంత మంది రైతులు మాత్రమే సాగు చేస్తున్నారు‘ లేదా ‘ఇన్ని ఎకరాల్లో ప్రత్యేకంగా పండిస్తున్నారు’ అనే గణాంకాలు ఉండవు.
రైతులు పండించే సాధారణ పొడవైన పింజ పత్తి (Long Staple Cotton & 29mm లేదా 30mm అంతకంటే ఎక్కువ పొడవు) నాణ్యతా పరీక్షల్లో నెగ్గితే దానికి ‘కస్తూరి కాటన్’ గుర్తింపు లభిస్తుంది.
పంటలో తేమ శాతం తక్కువగా ఉండటం, వ్యర్థాలు 1.5% నుంచి 2% లోపు ఉండటం వంటి నిబంధనలు పాటించే రైతుల పంటను జిన్నింగ్ మిల్లుల ద్వారా సేకరించి కస్తూరి కాటన్‌గా ధ్రువీకరిస్తారు.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా కస్తూరి కాటన్ భారత్ కింద సర్టిఫై అయిన పత్తి పరిమాణం ఏటా గణనీయంగా పెరుగుతూ లక్షలాది బేళ్లకు చేరుకుంటోంది. నాణ్యమైన పద్ధతులు పాటించే భారతీయ పత్తి రైతులందరూ పరోక్షంగా ఈ బ్రాండ్ పరిధిలోకి వస్తారు.
2.1 లక్షల బేళ్ల ‘కస్తూరి’ పత్తి!
వస్త్ర పరిశ్రమలో నాణ్యత, పారదర్శకతకు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో ‘కస్తూరి కాటన్ భారత్’ బ్రాండింగ్ వేగంగా ఊపందుకుంటోంది. 2026 సెప్టెంబర్ 30తో ముగిసిన మార్కెటింగ్ సీజన్ నాటికి దాదాపు 2.1 లక్షల బేళ్ల భారతీయ పత్తికి ‘కస్తూరి కాటన్ భారత్’ సర్టిఫికేషన్ లభించింది.
2023–24 సీజన్‌లో సర్టిఫై అయిన పత్తి 47,100 బేళ్లు మాత్రమే ఉండగా, 2025–26 నాటికి అది ఏకంగా 2.13 లక్షల బేళ్లకు చేరింది.
ఇప్పటివరకు 10 లక్షలకు పైగా బేళ్లను బ్లాక్‌చెయిన్ వ్యవస్థ పరిధిలోకి తీసుకొచ్చారు. దీనివల్ల పత్తి పొలం నుంచి తుది వస్త్రం తయారయ్యే వరకు నాణ్యత, మూలాలను ఖచ్చితంగా గుర్తించే సాంకేతిక వీలు ఏర్పడింది.
అమెరికా, యూరప్ వంటి దేశాల్లోని అంతర్జాతీయ కొనుగోలుదారులు పత్తి నాణ్యత, సరఫరా గొలుసులో పారదర్శకతను కోరుకుంటున్నారు. ఈ సర్టిఫికేషన్ భారతీయ పత్తిపై విదేశీ బయ్యర్లలో పూర్తి విశ్వాసాన్ని పెంచుతోంది.
2031–32 నాటికి దేశంలో అంచనా వేస్తున్న మొత్తం 498 లక్షల బేళ్ల పత్తి ఉత్పత్తిలో, సుమారు 132 లక్షల బేళ్లు కస్తూరి కాటన్ ప్రమాణాలను అందుకుంటాయని అంచనా.
పత్తిలో నాణ్యత ప్రమాణాలు పాటించి, మచ్చలు లేని శుభ్రమైన పత్తిని ఉత్పత్తి చేస్తే ‘కస్తూరి కాటన్’ బ్రాండ్ కింద అంతర్జాతీయ స్థాయి గుర్తింపుతో ΄ాటు మార్కెట్లో మెరుగైన ప్రీమియం ధర దక్కే అవకాశాలు విస్తృతం అవుతున్నాయి.


