
రాష్ట్ర రైతాంగానికి వాతావరణ ఆధారిత వ్యవసాయ సలహాలు
తేది: 20.08.2025 (బుధవారం) నుండి 24.08.2025 (ఆదివారం) వరకు
ఈ నెల 20 నుంచి 24 తేదీల మధ్యకాలంలో తెలంగాణలోని రెండు జిల్లాల్లో అతిభారీ వర్షాలు, ఆరు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని రాజేంద్రనగర్‌లోని పీజేటీఏయూ ప్రధాన శాస్త్రవేత్త, వ్యవసాయ వాతావరణ పరిశోధన విభాగం అధిపతి డాక్టర్ పి.లీలా రాణి తెలిపారు. బుధవారం నుంచి వచ్చే ఆదివారం వరకు ఉపయోగపడే వాతావరణ ఆధారిత వ్యవసాయ సలహాలను రైతాంగానికి ఆమె సూచిస్తున్నారు. ఉరుములు, మెరుపులతో కూడిన వర్ష సూచనలున్నందున రైతులు విద్యుత్ స్తంభాలు, విద్యుత్ తీగలు, చెరువులు, నీటికుంటలకు దూరంగా ఉండాలి. అధేవిధంగా రైతులు చెట్ల కింద నిలబడ కూడదు. పశువులు, గొర్రెలు, మేకలను చెట్ల కింద ఉంచరాదని ఆమె సూచిస్తున్నారు.
గత మూడు రోజుల వాతావరణం:
గడిచిన మూడు రోజుల్లో రాష్ట్రంలో కొన్ని చోట్ల భారీ, అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు, అనేక చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. పగటి ఉష్ణోగ్రతలు 25 నుంచి 31 డిగ్రీల సెల్సియస్, రాత్రి ఉష్ణోగ్రతలు 19 నుంచి 25 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదయ్యాయి.
వచ్చే ఐదు రోజుల వాతావరణ విశ్లేషణ:
హైదరాబాద్ వాతావరణ కేంద్రం అందించిన సమాచారం ప్రకారం. 20, 21 తేదీల్లో రాష్ట్రంలో చాలా చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే సూచనలున్నాయి. 21 నుంచి 24వ తేదీ ఉదయం వరకు కొన్ని చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురసే సూచనలున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు 24 నుంచి 34 డిగ్రీల సెల్సియస్ మధ్య, రాత్రి ఉష్ణోగ్రతలు 20 నుంచి 26 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదుకావచ్చు.
అత్యంత భారీ వర్షాల హెచ్చరిక:
20వ తేదీ: కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాల్లో అక్కడక్కడా అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆదిలాబాద్, మంచిర్యాల జిల్లాల్లో అక్కడక్కడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. నిర్మల్, జగిత్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూ΄ాలపల్లి, ములుగు, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులు (గంటకు 30–40 కి.మీ.)తో కూడిన వర్షాలు తెలంగాణ అన్ని జిల్లాల్లో కురిసే అవకాశం ఉంది.
21వ తేదీ: జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉరుములు, మెరుపులు మరియు ఈదురు గాలులు (గంటకు 30–40 కి.మీ.)తో కూడిన వర్షాలు తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో కురిసే అవకాశం ఉంది.
22వ తేదీ: ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులు (గంటకు 30–40 కి.మీ.)తో కూడిన వర్షాలు ఆదిలాబాద్, కొమరంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్ధిపేట, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాలలో అక్కడక్కడా కురిసే అవకాశం ఉంది.
23వ తేదీ: ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులు (గంటకు 30–40 కి.మీ.)తో కూడిన వర్షాలు ఆదిలాబాద్, కొమరంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో కురిసే అవకాశం ఉంది.
24వ తేదీ: ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులు (గంటకు 30–40 కి.మీ.)తో కూడిన వర్షాలు ఆదిలాబాద్, కొమరంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్ జిల్లాల్లో అక్కడక్కడా కురిసే అవకాశం ఉంది.
పొలాల్లో మురుగు కాలువలు ముఖ్యం
భారీవర్షాలు కురిసిన ప్రాంతాల్లో పొంలం నుండి మురుగునీటిని వీలైనంత వరకు త్వరగా పొలం నుండి తీసివేయాలి.
వచ్చే ఐదు రోజుల్లో అక్కడక్కడ భారీ వర్షాలు, అనేక చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున పంట పొలాల్లో మురుగు కాలువలు ఏర్పాటు చేసుకోవాలి.
ఆరుతడి పంటల్లో ఆఖరి అంతర కృషి తరువాత ప్రతీ 2 మీటర్లకు ఒక గొడ్డు చాలు వేసుకోవాలి.
నీటి ముంపునకు గురైన వర్షాధార పంటల్లో వర్షాలు ఆగిన తరువాత వీలైనంత త్వరగా అంతర కృషి చేసుకోవాలి.
ఇదీ చదవండి: ఇండియన్ వయాగ్రా రైస్ తెలుసా? దేశీ వరి ఔషధ గుణాలు
పశువులు జాగ్రత్త
ప్రస్తుత వాతావరణ పరిస్థితులు కోళ్ళలో కొక్కెర తెగులు సోకటానికి అనుకూలం. వీటి నివారణకు, టీకాలు వేయించాలి.
గొర్రెల్లో చిటుకు, పీపీఆర్ సోకే వీలుంది
ఆవులు, గేదేల్లో గొంతువాపు వ్యాధి సోకడానికి అనుకూలం. టీకాలు వేయించాలి ∙గొర్రెల్లో నట్టల నివారణకు డీవార్మింగ్ చెయ్యాలి.
– నిర్వహణ: పంతంగి రాంబాబు సాక్షి సాగుబడి డెస్క్
ఇదీ చదవండి: కేవలం రూ.3.5 లక్షలతో ఫ్యాషన్ బ్రాండ్..రూ. 500 కోట్ల దిశగా