టెక్నాలజీ దూకుడు ఎక్కువయ్యాక ప్రపంచం ‘జగమంత స్మార్ట్ కుటుంబం’ అయిపోయింది. ఇళ్లు, వాకిళ్లు, వంటిళ్లు ఇంటర్నెట్‌తో కనెక్ట్ అవుతున్నాయి. ఎయిర్ ఫ్రైయర్లు, స్మార్ట్ టీవీలు, వాషింగ్ మిషన్‌లు, ఆఖరికి టూత్‌బ్రష్‌లను కూడా ఇంట్లోని నెట్ నడిపిస్తోంది. కానీ, ఈ సౌకర్యాలు, సదుపాయాల వెనుక మనకు తెలియకుండానే ఒక పెద్ద ప్రమాదం పొంచి ఉందని బ్రిటన్‌కు చెందిన ‘ఇన్ఫర్మేషన్ కమిషనర్స్ ఆఫీస్’ (ఐసీవో), ‘విచ్’ అనే సంస్థ కలిసి ప్రత్యక్షంగా తమ దేశ పౌరులను, పరోక్షంగా ప్రపంచ దేశాలను హెచ్చరిస్తున్నాయి.
ఏమిటా ప్రమాదం?!
డీప్ ఫ్రయింగ్, తందూరీ రోస్టింగ్–గ్రిల్లింగ్, రీహీటింగ్, బేకింగ్, బంగాళా దుంపల చిప్స్.. వీటన్నిటి తయారీకి వంటగదుల్లో మనం వినియోగించే ఎయిర్ ఫ్రయర్‌లు మన లొకేషన్‌ను ట్రాక్ చేస్తున్నాయని, మన మాటలను రికార్డ్ చేస్తున్నాయని, ఆ సమాచారాన్ని చైనాలోని సర్వర్లకు పంపుతున్నాయని ఆ మధ్య కొన్ని వార్తలు కలకలం రేపాయి. అయితే అవి కేవలం వార్తలు కావని, వాస్తవాలేనని ఐసీవో, విచ్ ఇప్పుడు నిర్ధారణగా ప్రకటించాయి! అలాగే, మన ఇళ్లల్లో రాత్రింబవళ్లు నడిచే స్మార్ట్ టీవీలు మనం ఎప్పుడు, ఏమి వీక్షిస్తున్నామో గమనిస్తూ మన వ్యక్తిగత వివరాలను ప్రకటనల కంపెనీలకు విక్రయిస్తున్నాయట!
బ్రిటన్ లాంటి దేశాల్లోనే మూడింట ఒక వంతు ప్రజలు ఇంతకాలం తమ డేటా ఎలా చోరీ అవుతోందో కనిపెట్టలేకపోయారు. ఇక మన దేశంలోని పరిస్థితి ఎంత ప్రమాదకరంగా ఉంటుందో ఊహించవచ్చు! భారత్‌లో ‘డిజిటల్ ఇండియా’ విప్లవం తర్వాత కోట్లాది మంది ప్రజలు ఇంటర్నెట్ వాడుతున్నారు కనుక మనపై స్పయింగ్‌కు సహజంగానే ఎక్కువ అవకాశం ఉంటుంది.
మాటల్నీ రికార్డు చేస్తుంటాయి!
టోస్టర్లు, ఎయిర్ ఫ్రయర్ల వంటి స్మార్ట్ పరికరాలు వ్యక్తిగత సమాచారాన్ని సేకరిస్తూ ఉండవచ్చని ఐసీవో అప్రమత్తం చేశాక బ్రిటన్ ప్రజల్లో జాగ్రత్త మొదలైంది. అక్కడి జనాభాలో దాదాపు 97 శాతం మంది కనీసం ఒక స్మార్ట్ పరికరం వాడుతుండగా, అవసరమైన దానికంటే చాలా ఎక్కువ సమాచారాన్ని ఆ పరికరాలు వినియోగదారుల నుంచి సేకరిస్తున్నాయని ‘విచ్’ పరిశోధకులు వెల్లడించారు. ఇంటర్నెట్‌తో పనిచేసే కొన్ని ఎయిర్ ఫ్రయర్లు, ‘ఆన్’ చేయగానే వినియోగదారుల కచ్చితమైన లొకేషన్ అడుగుతాయి. అంతేకాదు వారి ఫోన్ల ద్వారా ఆడియోను (మాటలను) కూడా రికార్డ్ చేస్తుంటాయి. మరింతగా మెరుగైన సేవల్ని అందించటానికి వ్యక్తిగత వివరాలను సేకరిస్తుంటామని ఆ గాడ్జెట్‌లు చెబుతుంటాయి. అయితే అవి, తాము సేకరించిన సమాచారంలో కొంత భాగాన్ని చైనా సర్వర్లకు చేరవేస్తున్నట్లు ‘విచ్’ పరిశోధనలో బహిర్గతం అయింది.
దినచర్యల వివరాలు సైతం!!
‘విచ్’ బ్రిటన్‌లోని అతి పెద్ద వినియోగదారుల హక్కుల పరిరక్షక, పర్యవేక్షక స్వతంత్ర సంస్థ. ‘‘మీ ఇంట్లో ఉండే గాడ్జెట్‌లు అన్నింట్లోకీ స్మార్ట్ టీవీ మరీ ప్రమాదకరంగా మారుతోంది. మీరు ఏ సమయంలో ఏ కార్యక్రమాలు చూస్తున్నారనే పూర్తి సమాచారాన్ని ఇది సేకరిస్తుంది’’ అని విచ్ చెబుతోంది. ‘‘మీకు, మీ కుటుంబ సభ్యులకు నచ్చిన ప్రకటనలను చూపించడానికి మీ ఇంట్లోని టీవీలు మీ సమాచారాన్ని పూర్తిగాలాగేస్తుంటాయి’’ అని ఐసీవో రెగ్యులేటరీ రిస్క్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ విలయం మాల్కం అంటున్నారు. ‘‘స్మార్ట్ పరికరాలు మన ఆరోగ్యం, మన దినచర్యలు, మన కుటుంబ జీవితానికి సంబంధించిన అత్యంత సున్నితమైన వ్యక్తిగత సమాచారాన్ని సేకరిస్తున్నాయి’’ అని ఆయన ఘంటాపథంగా చెబుతున్నారు.

స్మార్ట్ పరికరాలను తయారుచేసే కంపెనీలు, డెవలపర్ల కోసం ఐసీవో ఇటీవల కొత్త మార్గదర్శకాలను విడుదల చేసిన సమయంలోనే ఈ తాజా హెచ్చరిక వెలువడింది. వినియోగదారుల సమాచారాన్ని ఎలా ఉపయోగించాలనే దానిపై కంపెనీలకు ఇందులో కొన్ని నియమాలను పొందుపరిచారు. వినియోగదారుల ఇష్టాయిష్టాలను తెలుసుకోవడం వంటి కొన్ని సరైన కారణాల కోసం కొంత సమాచారాన్ని సేకరించేందుకు మాత్రమే ఐసీవో అంగీకరించింది. అయితే స్మార్ట్ పరికరాలు వాటికి నిజంగా అవసరమైన సమాచారాన్ని మాత్రమే సేకరించాలని, ఆ సమాచారాన్ని ఎలా వాడుతున్నారనేది కూడా స్పష్టంగా చెప్పాలని, ఆ సమాచారంపై ప్రజలకే నియంత్రణ ఉండాలని తాజాగా స్పష్టం చేసింది.
కొనడం ఆపటం లేదు!
ఇంట్లోని స్మార్ట్ పరికరాలు తమ సమాచారాన్ని ఎలా సేకరిస్తున్నాయో అర్థం కాక తలలు పట్టుకుంటున్న లక్షలాది మంది బ్రిటన్ ప్రజలకే కాదు, మిగతా ప్రపంచదేశాలకూ ఈ నియమాల విధింపు మంచి పరిణామం. బ్రిటన్‌కి చెందిన 2,000 మందికి పైగా వయోజనులపై ఐసీవో చేసిన సర్వేలో... తమ పరికరాలు సమాచారాన్ని ఎలా సేకరిస్తాయో, ఆ సమాచారాన్ని ఎలా ఉపయోగిస్తాయో తమకు తెలియదని మూడింట ఒక వంతు మంది ప్రజలు చెప్పారు.
అలాగే, ఒక స్మార్ట్ టోస్టర్ (బ్రెడ్ కాల్చేది) లేదా స్మార్ట్ టూత్‌బ్రష్ కూడా తమ వ్యక్తిగత సమాచారాన్ని సేకరిస్తుందని తెలిసి ఆశ్చర్యపోయామని సర్వేలో పాల్గొన్నవారిలో ముప్పావు వంతు మంది చెప్పారు. ఈ సమాచార సేకరణ పట్ల తమకు ఆందోళన ఉందని 40 శాతం మంది బ్రిటన్ ప్రజలు చెబుతుండగా, మరికొందరు (15 శాతం మంది) ఇదే కారణంతో ఇలాంటి సాంకేతిక పరికరాలను అస్సలు కొనడం లేదు. అయినప్పటికీ, బ్రిటన్ ప్రజలు తమ ఇళ్లను ఇలాంటి నిఘా పెట్టే పరికరాలతో నింపేయడం మాత్రం ఆపలేదు.
పైగా ఈ డేటా సేకరణ వల్ల వచ్చే వినియోగ పరమైన లాభాల కోసం స్మార్ట్ పరికరాలను కొనడానికి సిద్ధంగా ఉన్నామని యూకేలోని దాదాపు సగం మంది వినియోగదారులు చెబుతున్నారు. దీనిపై మాల్కం మాట్లాడుతూ: ‘‘ఈ పరికరాలు మన జీవితాలను సులభతరం చేయడానికి తయారవుతాయి. అంతకు మించి వీటికి మన వ్యక్తిగత గోప్యతను పణంగా పెట్టకూడదు’’ అంటున్నారు.
డేటాను లాగి, ఏం చేస్తారు?
మనం టీవీలో ఏమేం చూస్తున్నామో పూర్తి వివరాలను తెలుసుకొని, మన అలవాట్లకు సంబంధించిన ఒక పెద్ద నివేదికను తయారు చేయడానికి గాడ్జెట్‌లు చాలా సమాచారాన్ని సేకరిస్తాయి. ఈ సమాచారాన్ని మనకు నచ్చే షోలు లేదా సినిమాలను సూచించడానికి ఉపయోగించవచ్చు, అలాగే మనకు నచ్చిన ప్రకటనలను చూపించడానికి కూడా వాడుకోవచ్చు. అయితే ఇలా ప్రకటనలు చూపించటం వరకు పర్వాలేదని, టీవీ తయారీ కంపెనీలు అంతకంటే ముందుగా వినియోగదారుల అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని ఐసీవో ఆదేశాలు జారీ చేసింది.
ఇక గాడ్జెట్ తయారీ కంపెనీలు చట్టాన్ని పాటిస్తున్నాయా లేదా, వినియోగదారులకు నిజమైన పారదర్శకతను అందిస్తున్నాయా లేదా, వారి అనుమతిని నిజంగానే తీసుకుంటున్నాయా లేదా అని పరిశీలించడానికి ‘విచ్’ సంస్థ ఈ ఏడాది చివర్లో ఆయా కంపెనీలతో మాట్లాడనుంది.
ఏమైనా, కన్జ్యూమర్ల డేటా చైనా వంటి ప్రమాదకర దేశాలకు చేరడం వల్ల ముఖ్యంగా గోప్యతా ప్రమాదాలు ఉంటాయి. చైనా చట్టాల ప్రకారం అక్కడ ఉండే కంపెనీలు తమ వద్ద ఉన్న డేటాను అక్కడి ప్రభుత్వానికి తప్పనిసరిగా అప్పగించాలి; దీనివల్ల మీ వై–ఫై నెట్‌వర్క్ వివరాలు, లొకేష¯Œ , డివైజ్ పాస్‌వర్డ్‌లు వేరే దేశం చేతికి వెళ్లే ప్రమాదం ఉంది. మీ వ్యక్తిగత ప్రొఫైల్‌ను బిల్డ్ చేసి, మీ ప్రమేయం లేకుండానే థర్డ్–పార్టీ సంస్థలకు ఆ డేటాను అమ్ముకోవడం లేదా ప్రకటనల కోసం వాడుకునే అవకాశం ఉంటుంది.
చైనా సర్వర్లకు మన వివరాలు!
విచ్ సంస్థ చేసిన పరిశోధనలో ఐగోస్టార్, షియోమి మి స్మార్ట్, కొసోరి అనే మూడు కంపెనీల ఎయిర్ ఫ్రయర్‌ల వినియోగదారుల కచ్చితమైన లొకేషన్ తెలుసుకుంటున్నాయని, యూజర్ల ఫోన్లలోని ఆడియోను రికార్డ్ చేయడానికి అనుమతి అడుగుతున్నాయని తేలింది.
షియోమి ఎయిర్ ఫ్రయర్‌కు సంబంధించిన యాప్... ఫేస్‌బుక్, పాంగిల్ (ఇది టిక్‌టాక్ బిజినెస్ ప్రకటనల నెట్‌వర్క్), చైనాకు చెందిన టెక్ దిగ్గజం టెన్సెంట్ వంటి వాటి ట్రాకర్లకు కనెక్ట్ అయి ఉంది. (ఇది వినియోగదారుడు ఉండే ప్రాంతంపై ఆధారపడి ఉంటుంది). మరోవైపు, ఐగోస్టార్ ఎయిర్ ఫ్రయర్ అకౌంట్ క్రియేట్ చేసేటప్పుడే వినియోగదారుల జెండర్, పుట్టిన తేదీని అడుగుతోంది. అంతేకాదు, ఐగోస్టార్, షియోమి ఎయిర్ ఫ్రయిర్‌లు రెండూ తమ వినియోగదారుల వ్యక్తిగత సమాచారాన్ని చైనాలోని సర్వర్లకు పంపించాయి.
అయితే ఆ విషయాన్ని వారు తమ ప్రైవసీ నోటీసులో ముందే పేర్కొన్నారు. ఇక కొన్ని స్మార్ట్ స్పీకర్లలో కూడా ఫేస్‌బుక్, గూగుల్‌కు సంబంధించిన ఇలాంటి ట్రాకర్లు కిక్కిరిసినట్లుగా నిండి ఉన్నాయి! ‘‘మన లొకేషన్‌ను ట్రాక్ చేసే ఎయిర్ ఫ్రయర్‌ల నుండి, మన పుట్టిన తేదీని అడిగే స్మార్ట్ వాషింగ్ మెషీన్ల వరకు... ఈ స్మార్ట్ పరికరాలు వాటికి అవసరమైన దానికంటే లేదా మనం అంగీకరించదగిన దానికంటే చాలా ఎక్కువ వ్యక్తిగత సమాచారాన్ని సేకరిస్తున్నాయని మా గత పరిశోధనలు పదే పదే నిరూపించాయి’’ అని విచ్ సంస్థకు చెందిన టెక్ నిపుణుడు ఆండ్రూ లాఫ్లిన్ వెల్లడించారు.
‘‘అవసరం లేని సమాచార సేకరణను తగ్గించడం, పారదర్శకతను పెంచడం, వినియోగదారులకు వారి సమాచారంపై మరింత నియంత్రణను ఇవ్వడంపై నిఘా సంస్థ (రెగ్యులేటర్) కొత్త మార్గదర్శకాలు ఎక్కువ శ్రద్ధ పెట్టడం మంచి విషయం’’ అని ఆయన అంటున్నారు. ఇక, స్మార్ట్ టీవీలు సేకరిస్తున్న అత్యంత సున్నితమైన వ్యక్తిగత సమాచారంపై తమకు ప్రత్యేక ఆందోళనలు ఉన్నాయని కూడా ఐసీవో తెలిపింది.
స్మార్ట్ వలలో పడకుండా ఐదు చిట్కాలు
మీ స్మార్ట్ పరికరాలు మీపై నిఘా పెట్టకుండా కాపాడుకోవడానికి ‘ఇన్ఫర్మేషన్ కమిషనర్స్ ఆఫీస్’ 5 చిట్కాలు చెబుతోంది.
కొనడానికి ముందే రీసెర్చ్ (పరిశోధన) చేయండి: మీరు ఏదైనా పరికరాన్ని కొనే ముందే, అది ఎలాంటి సమాచారాన్ని సేకరిస్తుందో సరిచూసుకోండి. ఆ పరికరం అడిగే సమాచారాన్ని దానికి ఇవ్వడం మీకు ఇష్టమేనా కాదా అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి.
పర్మిషన్లపై (అనుమతులపై) నియంత్రణ కలిగి ఉండండి: పరికరాన్ని సెటప్ చేసేటప్పుడు, అది ఏయే విషయాలను యాక్సెస్ చేయాలో నియంత్రించడానికి ‘ప్రైవసీ కంట్రోల్స్’ ఉపయోగించండి. ఏదైనా అనుమతి అనవసరం అనిపిస్తే, దానికి అస్సలు అంగీకరించకండి.
మీ పరికరానికి భద్రత కల్పించండి: ఇతరులు మీ పరికరాన్ని వాడుకోకుండా ఉండటం కోసం ఒక బలమైన, విభిన్నమైన పాస్‌వర్డ్‌ను సెట్ చేసుకోండి. వీలైనప్పుడల్లా ‘టూ–స్టెప్ వెరిఫికేషన్’ ఆన్ చేసుకోండి.
అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఫాలో అవ్వండి: సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్‌ను క్రమం తప్పకుండా ఇన్‌స్టాల్ చేసుకోండి. ఇందులోని సెక్యూరిటీ ప్యాచెస్ కొత్త ముప్పుల నుండి మీ డేటాను రక్షిస్తాయి.
పరికరాన్ని వదిలించుకునే ముందు మీ డేటాను పూర్తిగా తుడిచేయండి: మీరు మీ స్మార్ట్ పరికరాన్ని ఎవరికైనా అమ్మేస్తున్నా లేదా పారేస్తున్నా... ముందుగా దాన్ని ‘ఫ్యాక్టరీ రీసెట్’ చేయండి. దీనివల్ల మీ వ్యక్తిగత సమాచారం మొత్తం డిలీట్ అయిపోతుంది. - సాక్షి స్పెషల్ డెస్క్


