మన బలమేంటో మనమే నిరూపించాలి

Power Lifitng: Gold medal winner spoorthi yenugu success story - Sakshi

పవర్‌ లిఫ్టింగ్‌

క్రీడల పట్ల ఆసక్తితోపాటు చదువులోనూ రాణిస్తూ తనని తాను కొత్తగా ఆవిష్కరించుకుంటోంది హైదరాబాద్‌ వాసి, 28 ఏళ్ల స్ఫూర్తి ఏనుగు. లా చదువుతూ రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ క్రీడాపోటీల్లోనూ పాల్గొని పతకాలు సాధిస్తోంది. ఇటీవల కిర్గిజ్‌స్థాన్‌లో జరిగిన అంతర్జాతీయ పవర్‌ లిఫ్టింగ్‌ పోటీలో పాల్గొని బంగారు పతకాన్ని సాధించింది. ఈ సందర్భంగా పవర్‌ లిఫ్టర్‌ స్ఫూర్తి ఏనుగు పంచుకున్న విషయాలు ఇవి...

‘‘సహజంగా ఇళ్లలో బరువులెత్తే పనులు అమ్మాయిలకు చెప్పరు. అవి, కేవలం అబ్బాయిల పనే అన్నట్టు చూస్తారు. చిన్నప్పటి నుంచి శిక్షణ ఇవ్వడం లేదా టెక్నిక్స్‌ తెలుసుకుంటే బరువులు ఎత్తడం అమ్మాయిలకూ సులువే. ప్రొఫెషనల్‌ అవ్వాలన్నా, శారీరక బరువు, మానసిక సమతుల్యత సాధించాలన్నా వెయిట్‌ మానేజ్‌మెంట్‌ తెలుసుకోవడం చాలా ముఖ్యం.

ఛాలెంజెస్‌
అమ్మాయిలకు ఈ రంగంలో ప్రధాన సమస్య నెలసరి సమస్య. అది ఫేస్‌ చేయాల్సి వస్తుంది. ప్రతిసారి ఒకే బరువును మోయలేం. శక్తిలోనూ మార్పులు వస్తుంటాయి. ఇందుకు తీసుకునే ఆహారం  అబ్బాయిలతో పోల్చితే భిన్నంగా ఉంటుంది. బరువులు ఎత్తే సమయంలో కండరాలు పట్టేస్తుంటాయి. దెబ్బలు తగులుతుంటాయి. జాయింట్స్‌ దగ్గర సమస్యలు వస్తుంటాయి. బరువులు ఎత్తే సమయంలో ఊపిరిలో తేడాలు వస్తుంటాయి. కానీ, వీటన్నింటినీ సాధనతో అధిగమిస్తుంటాను. మంచి ఆహారం, సరైన నిద్రాసమయం, స్ట్రెస్‌ లెవల్స్‌ అన్నింటినీ బ్యాలెన్స్‌ చేసుకోవడానికి ప్రతిరోజూ ప్రయత్నిస్తుంటాను. ఈ విషయంలో మా అమ్మ సాధన, నాన్న రామారావు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు.

బరువును బ్యాలెన్స్‌ చేసుకోవడానికి...
సెకండ్‌ క్లాస్‌ నుంచి స్పోర్ట్స్‌లో ప్రవేశం ఉంది. డిస్క్‌ త్రో, జావలిన్‌ త్రో వంటి క్రీడల్లో పతకాలు సాధించాను. రెండేళ్ల నుంచి వెయిట్‌లిఫ్టింగ్‌ ప్రాక్టీస్‌ చేస్తున్నాను. కరోనా టైమ్‌లో బరువు పెరిగాను. పది కేజీల బరువు తగ్గాలనుకున్నాను. అందుకు డైట్‌లో మార్పులు చేసుకోవడానికి బదులు నాకు ఎలాగూ స్పోర్ట్స్‌ అంటే ఇష్టం కాబట్టి, బరువు తగ్గడానికి వెయిట్‌లిఫ్టింగ్‌ సాధన చేశాను. ప్రాక్టీస్‌ చేసేటప్పుడు మనల్ని మనం ఎలా క్రమశిక్షణగా మలచుకోవాలో నిపుణుల ఆధ్యర్వంలో తెలిసిపోతుంది. అందుకు అనుగుణంగా సరైన దినచర్యను అమలు చేసుకుంటూ, విజయం దిశగా నా ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాను.

ఆలోచనలో మార్పు..
అమ్మాయిలు చిన్నప్పటి నుంచే క్రీడలను ప్రాక్టీస్‌ చేస్తూ ఉంటే వారు ఎంచుకున్న రంగంలోనూ చాలా బాగా దూసుకుపోగలరు. ఇంట్లో వాటర్‌క్యాన్స్, గ్యాస్‌ సిలిండర్, సోఫా.. వంటి బరువులు ఎత్తడంలో  కూడా టెక్నిక్స్‌ ఉంటాయి. సాధారణంగా అమ్మాయిలు కూడా 50–60 కేజీల బరువు ఎత్తగలరు. కానీ, టెక్నిక్స్‌ తెలియకుండా ఎత్తి, నొప్పితో బాధపడుతుంటారు. దీంతో అమ్మాయిలు వెయిట్‌ లిఫ్టింగ్‌ చేయలేరు అనే అభిప్రాయం మనలో చాలా మందిలో పాతుకుపోయి ఉంది. మన ఆలోచనలో మార్పు రావాలంటే తల్లిదండ్రులు కూడా చిన్నప్పటి నుంచే స్పోర్ట్స్‌ దిశగా అమ్మాయిలను ప్రోత్సహించాలి.
 
క్రీడలతోపాటు ...
చదువునూ బ్యాలెన్స్‌ చేసుకోవాలి. ఎంబీయే పూర్తి చేశాను. సివిల్‌ సర్వీసెస్‌ కోసం ప్రిపేర్‌ అవుతూనే స్పోర్ట్స్‌లో సాధన చేస్తూ వచ్చాను. ఇప్పుడు లా చదువుతున్నాను. రాష్ట్ర, జాతీయస్థాయి పోటీల్లోనే కాదు, కిందటి నెలలో కిర్గిజ్‌స్థాన్‌లో జరిగిన ఏడబ్ల్యూసీ ఓపెన్‌ వరల్డ్‌ కప్‌లో పాల్గొని బంగారు పతకాన్ని సాధించాను. మా అమ్మనాన్నల ప్రోత్సాహంతో పాటు కోచ్‌ ఇచ్చే గైడెన్స్‌ ఎంతగానో తోడ్పడుతున్నాయి. మరిన్ని పోటీలు, అవకాశాలను అందిపుచ్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. ప్రతిచోటా ఎన్నో సవాళ్లు ఉంటాయి. వాటిని దృఢ సంకల్పంతో, పట్టుదలతో ఎదుర్కొన్నవారే విజేతలవుతారు.

‘వెయిట్‌ లిఫ్టింగ్‌ అంటే అబ్బాయిలదే. అమ్మాయిలకు ఏం సాధ్యమవుతుంది, సూటవదు’ అనే మాట ఇప్పటికీ ఈ రంగంలో మొదటగా వినిపిస్తుంది. కానీ, మనల్ని మనం గెలిచి చూపినప్పుడు అమ్మాయిలుగా మన బలం ఏంటో కూడా ప్రపంచానికి తెలుస్తుంది’’ అని వివరిస్తుంది స్ఫూర్తి.
– నిర్మలారెడ్డి

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top