నేపాల్‌లోని గోర్ఖా జిల్లాలో శనివారం సాయంత్రం జరిగిన భయానక రోడ్డు ప్రమాదంలో ఏడుగురు భారతీయ యాత్రికులు ప్రాణాలు కోల్పోయారు. మంకమ్నా ఆలయంలో దర్శనం ముగించుకుని తిరిగి వస్తుండగా ఈ విషాదం చోటుచేసుకుంది.
పోలీసుల సమాచారం ప్రకారం, సాహిద్ లఖన్ గ్రామీణ మునిసిపాలిటీ పరిధిలోని కాంతర్ ప్రాంతంలో భక్తులను తీసుకెళ్తున్న ఎలక్ట్రిక్ మైక్రోబస్ నియంత్రణ తప్పి కొండ రహదారి నుంచి లోతైన లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో మరో ఏడుగురు యాత్రికులు గాయపడగా, వారిని చికిత్స కోసం చిత్వాన్ జిల్లాలోని భరత్పూర్ పట్టణంలోని చిత్వాన్ మెడికల్ కాలేజీకి తరలించారు.
డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ రాజ్‌కుమార్ శ్రేష్ఠ తెలిపిన వివరాల ప్రకారం, ప్రమాద సమయంలో మైక్రోబస్‌లో డజనుకు పైగా ప్రయాణికులు ఉన్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని ఆయన తెలిపారు.
గోర్ఖా చీఫ్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ తులసి బహదూర్ శ్రేష్ఠ మాట్లాడుతూ, ఈ మైక్రోబస్ మంకమ్నా ఆలయం నుంచి పశ్చిమ దిశగా తనహు జిల్లాలోని అన్బుఖైరేని ప్రాంతానికి వెళ్తున్నట్లు తెలిపారు. అయితే దర్శనం అనంతరం యాత్రికులు అసలు ఏ ప్రాంతానికి వెళ్తున్నారన్నది ఇంకా స్పష్టంగా తెలియలేదన్నారు.
ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలు ఇంకా వెలుగులోకి రాలేదు. కొండ ప్రాంత రహదారిపై ప్రయాణిస్తుండగా మైక్రోబస్ అదుపు తప్పి లోయలో పడిపోయినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
ఇదే ప్రాంతంలో గతంలో కూడా ఇలాంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. ఆగస్టు 2024లో భారతీయ యాత్రికులతో వెళ్తున్న బస్సు అన్బుఖైరేని సమీపంలో ప్రమాదానికి గురై కనీసం 27 మంది మరణించిన విషయం తెలిసిందే.


