Payal Kothari: టీబీ.. డిప్రెషన్‌.. సమస్యలు అధిగమించి.. లక్షలాది మందికి హెల్త్‌ కోచ్‌గా!

Payal Kothari: Gut Health Coach Her Inspirational Journey - Sakshi

గతాన్ని గెలిచిన.. గట్‌ కోచ్‌

‘‘జీవితంలో ఎదురయ్యే అనేక అనుభవాలు భవిష్యత్‌లో తమతోపాటు ఎంతోమంది జీవితాలను సరిదిద్దుకోవడానికి పాఠాలుగా మారతాయి. కష్టసమయాల్లో కిందపడి కెరటంలా పైకి లేచిన ప్రతిసారి మనకెదురయ్యే పరిష్కార మార్గాలు మన భవిష్యత్‌ను చక్కగా తీర్చిదిద్దుతాయి. నా జీవితంలో అది జరగబట్టే ఈ రోజు నేను సెలబ్రెటీ గట్‌ హెల్త్‌ కోచ్‌గా మారాను’’ అని చెబుతోంది పాయల్‌ కొఠారి.  

ముంబైకి చెందిన పాయల్‌ కొఠారి కోల్‌కతాలోని గుజరాతీ జైన్‌ కుటుంబంలో పుట్టింది. పాయల్‌కు రెండేళ్లు ఉన్నప్పుడు కుటుంబం ముంబైకి మకాం మార్చి అక్కడే స్థిరపడింది. అక్కడికి వచ్చిన కొద్దిరోజుల్లోనే పాయల్‌కు టీబీ వచ్చింది. చికిత్స తీసుకున్నాక నయమైంది కానీ జీర్ణవ్యవస్థ పనితీరు దెబ్బతింది. ఫలితంగా పోషకాహార లోపం ఏర్పడి, పదమూడేళ్లు వచ్చేవరకు బక్కపలుచగా ఉండేది తను.

ఫెయిలవడంతో...
ఆరోగ్యం సహకరించకపోయినప్పటికీ చదువులో చాలా చురుకుగా ఉండేది పాయల్‌. కానీ మన సులో ఎప్పుడూ తెలియని నిరాశ వెంటాడేది. ఇలా అనిపించిన ప్రతిసారి విపరీతంగా తింటుండేది. దీంతో తన బరువు అమాంతం పెరిగి ఒబెసిటీ వచ్చింది. ఉన్నట్టుండి బరువు పెరిగిన పాయల్‌ను మిగతా విద్యార్థులంతా హేళన చేస్తుండేవారు.

వారి కామెంట్లను భరించలేని పాయల్‌ తీవ్ర నిరాశకు లోనై  సరిగా చదవలేకపోయేది. దీంతో ఫెయిల్‌ అయ్యింది.  ‘‘ఎవరేమి మాట్లాడినా పట్టించుకోకు, నీ పని నువ్వు చూసుకో’’ అని ఆమె తల్లి పదేపదే చెప్పడంతో డిప్రెషన్‌ నుంచి బయటపడింది. 

కాస్త పర్వాలేదు అనుకునేలోపు...
మానసికంగా కాస్త పర్లేదు అనుకుంటుండగా..పదోతరగతి పూర్తై కాలేజీలో అడుగుపెట్టిన పాయల్‌ను పొట్ట ఆరోగ్యం తీవ్రంగా ఇబ్బంది పెట్టింది. దీంతో అనేక మ్యాగజీన్లు చదివి తన కడుపు సమస్యకు డాక్టర్‌ దగ్గర చికిత్స తీసుకుంటూనే కిచిడి, పెరుగన్నం, పండ్లు, నెయ్యి, సూప్‌లు తీసుకుంటూ పేగుల ఆరోగ్యాన్ని మెరుగు పరిచి పొట్ట, ఒబెసిటీ సమస్యలను తగ్గించి ఫిట్‌గా తయారైంది.  

డిగ్రీ పూర్తయ్యాక ప్రపంచంలోనే అతిపెద్ద న్యూట్రిషన్‌ స్కూల్‌ అయిన న్యూయార్క్‌లోని ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ ఇంట్రాగేటివ్‌ న్యూట్రిషన్‌(ఐఐఎన్‌) లో క్లినికల్‌ న్యూట్రిషన్‌లో సర్టిఫికెట్‌ కోర్సులు చేసింది. 

పదిహేనేళ్ల తరువాత..
కోర్సు పూర్తయ్యాక పాయల్‌కు ఓ వ్యాపారవేత్తతో వివాహం జరగడంతో భర్తతో హాంగ్‌కాంగ్‌ వెళ్లిపోయింది. పదిహేనేళ్లపాటు గృహిణిగా ఉన్న పాయల్‌ భర్తకు వ్యాపారంలో నష్టం రావడంతో 2016లో ఇండియాకి తిరిగి వచ్చేసింది. ఆర్థిక ఇబ్బందులతో అద్దె ఇంట్లో ఉంటోన్న పాయల్‌ను చూసిన కొంతమంది ‘‘అధిక బరువు నుంచి ఇంత ఫిట్‌గా ఎలా తయారయ్యావు? నీ చర్మం కూడా కాంతిమంతంగా ఉంది’’ మాకు కొన్ని టిప్స్‌ చెప్పు అని అడిగేవారు.

దీంతో క్లినికల్‌ స్టడీ సర్టిఫికెట్‌ కోర్సు చేయడం, స్వయంగా తను కూడా ఒకప్పుడు ఒబెసిటీ బాధితురాలి నుంచి ఫిట్‌గా మారిన అనుభవంతో ‘గట్‌ హెల్త్‌ కోచ్‌’ గా మారాలనుకుంది. కోచ్‌గా పనిచేయడం వల్ల కుటుంబానికి ఆర్థికంగా సాయపడవచ్చన్న ఉద్దేశ్యంతో వెంటనే గట్‌ చోచ్‌గా మారింది. ప్రారంభంలో చుట్టూ ఉన్నవాళ్లకు, ఆ తరువాత ప్రత్యేక తరగతులు నిర్వహిస్తూ బాగా పాపులర్‌ అయ్యింది.

ఇప్పటిదాకా రెండు లక్షలమందికి కోచ్‌గా
బాలీవుడ్‌ సెలబ్రెటీల నుంచి పెద్ద కంపెనీల సీఈఓల వరకు కోచ్‌గా పనిచేసింది. ఇలా ఇప్పటిదాకా రెండు లక్షలమందికి కోచ్‌గా పనిచేసి వారి ఆరోగ్యస్థితిగతులను మెరుగుపరిచింది. పెద్దవాళ్లకేగాక స్కూళ్లకు వెళ్లి పిల్లలకు మహిళా క్లబ్బులు, ఎన్జీవోలను సందర్శించి గట్‌ హెల్త్‌పై అవగాహన కల్పిస్తోంది. ద గట్‌ పేరిట బుక్‌ కూడా రాసింది.

ఆన్‌లైన్‌ న్యూట్రిషన్‌ స్కూల్‌ ప్రారంభించి గట్‌ ఆరోగ్యం గురించి వివరించడంతోపాటు.. కాలేజీలు, యూనివర్శిటీల్లో సెమినార్లు నిర్వహిస్తోంది. వివిధ ఆర్టికల్స్‌ రాస్తూ ఫిట్‌నెస్‌ పట్ల అనేకమందిలో అవగాహన కల్పిస్తోంది. జాతీయ అంతర్జాతీయ న్యూట్రిషన్‌ సంస్థలతో కలిసి పనిచేస్తూ పదిమంది మెప్పూ పొందుతోంది పాయల్‌.  

చదవండి: Precision Oncology: ఆరోగ్యకరమైన కణాలకు నష్టం కలగకుండా.. క్యాన్సర్‌ కణానికే తగిలేంత కచ్చితత్త్వంతో..             

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top