Precision Oncology: ఆరోగ్యకరమైన కణాలకు నష్టం కలగకుండా.. క్యాన్సర్‌ కణానికే తగిలేంత కచ్చితత్త్వంతో..

Health: What Is Precision Oncology And Its Significance Facts All Need To Know - Sakshi

జీనోమ్‌ సీక్వెన్సింగ్‌తో ‘ప్రెసిషన్‌ ఆంకాలజీ’!

అత్యంత కచ్చితత్త్వంతో క్యాన్సర్‌ కణంపైనే గురి..! 

క్యాన్సర్‌ కణాన్ని తుదముట్టించడానికి సర్జరీ, కీమో, రేడియేషన్‌ లాంటి ఎన్నో ప్రక్రియలున్నాయి. ఈ ప్రక్రియలన్నింటిలోనూ ఆరోగ్యకరమైన కణాలకు ఎంతోకొంత నష్టం జరిగే అవకాశముంది. మరీ ముఖ్యంగా కీమోలో. అదే క్యాన్సర్‌ను చంపేసే అదే రసాయనాన్ని చాలా కచ్చితత్త్వంతో కేవలం క్యాన్సర్‌ కణంపైనే ప్రయోగించేలా చూడగలిగితే...?

అదే ‘ప్రెసిషన్‌ ఆంకాలజీ’!! అంటే క్యాన్సర్‌ కణానికే తగిలేంత కచ్చితత్త్వంతో రసాయనాన్ని గురిపెట్టి కొట్టడమనే ఆ ‘ప్రెసిషన్‌ ఆంకాలజీ’ అంటే ఏమిటో తెలుసుకుందాం. 

క్యాన్సర్‌ కణాలను తొలగించడానికి సర్జరీలు, రేడియేషన్, కిమో చికిత్సలు అందుబాటులో ఉన్నప్పటికీ... వాటిల్లో ఆరోగ్యవంతమైన కణాలకు ఎంతకొంత ముప్పు ఉంది కాబట్టి... ఆ అనర్థాలను తప్పిస్తూ... సరిగ్గా క్యాన్సర్‌ కణాన్నే గురిపెట్టేలాంటి (టార్గెట్‌ చేసేలాంటి) మందుల పైనా, చికిత్స ప్రక్రియలపైనా మొదట్నుంచీ ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి.

కచ్చితంగా క్యాన్సర్‌ కణాన్నే దెబ్బతీసేలాంటి చికిత్స కాబట్టి... దీన్ని ‘ప్రెసిషన్‌ ఆంకాలజీ’ అంటారు. కేవలం క్యాన్సర్‌ కణాన్నే లక్ష్యంగా చేసుకుంటుంది కాబట్టి టార్గెటెడ్‌ థెరపీ అంటున్నారు. భవిష్యత్తులో ఆరోగ్యకరమైన కణానికి ఏమాత్రం దెబ్బతగలకుండానో లేదా అత్యంత తక్కువగా నష్టం జరిగేలాగానో జరిగే మందులు రానున్నాయి.

అది కూడా కొంత బాధాకరమైన కీమోలోలా రక్తనాళంలోకి ఎక్కించడం కాకుండా... సింపుల్‌గా నోటి ద్వారా తీసుకునే మాత్ర రూపంలో అందుబాటుకి ఇప్పటికే వచ్చాయి, ఇంకా రానున్నాయి. 

దెబ్బతిన్న జన్యువుకు గురిపెట్టి, క్యాన్సర్‌ను మొగ్గలోనే తుంచేయడం ఎలా? 
ఈ సహస్రాబ్దం మొదట్లో అంటే 2001లో మానవ జన్యుపటలాన్ని పూర్తిగా నిర్మించడం సాధ్యమైంది. ఈ జన్యుపటలంలో ని ఏ కణమైతే దెబ్బతిన్నదో, అది ఇష్టం వచ్చినట్లుగా అపరిమితంగా అనారోగ్యకరంగా పెరిగి క్యాన్సర్‌ గడ్డలకు కారణమవుతుంటుంది.

ఇప్పుడు మొత్తం మానవ జన్యుపటలంలో సరిగ్గా నిర్దిష్టంగా ఏ కణం తాలూకు జన్యువు దెబ్బతిని, అక్కడ్నుంచి అది క్యాన్సర్‌గా మారుతుందో తెలుసుకుని, సరిగ్గా అపరిమితమైన కచ్చితత్త్వంతో దాన్ని మాత్రమే తుదముట్టించేలా ఔషధాన్ని ప్రయోగించామనుకోండి. అప్పుడు పెరగబోయే క్యాన్సర్‌ గడ్డను సమూలంగా నాశనం చేయడం సాధ్యమవుతుంది. దాంతో క్యాన్సర్‌ గడ్డ పెరగదు. ఇది స్థూలంగా ‘టార్గెటెడ్‌ థెరపీ’ తాలూకు సిద్ధాంతం.  

ఇందుకు ఉపయోగపడేదే ‘నెక్స్‌ట్‌ జనరేషన్‌ సీక్వెన్సింగ్‌’ 
తల్లిదండ్రుల తాలూకు వీర్యకణం, అండం కలిసి పిండం ఏర్పడి... అదే తర్వాత బిడ్డగా ఎదుగుతుంది. ఓ జీవరాశి కలిగి ఉన్న వ్యక్తికి కణం ఎలా మూలమో, ఓ కణానికి దాని తాలూకు జన్యువులు అలా మూలం.

ఆ జన్యుపటలంలో ఏదైనా జన్యువు దెబ్బతిని ఉంటే... ఆ తర్వాతి తరం వ్యక్తిలో అది క్యాన్సర్‌కు కారణం కావచ్చు. అందుకే తర్వాతి తరం బిడ్డకు ఎలాంటి జీవకణాలు రాబోతున్నాయో తెలుసుకునేందుకు ఓ పరీక్ష ఉపయోగపడుతుంది. అదే ‘నెక్స్‌ట్‌ జనరేషన్‌ సీక్వెన్సింగ్‌’ పరీక్ష. దీన్నే సంక్షిప్తంగా ‘ఎన్‌జీఎస్‌’ అంటారు.

దీనితో భవిష్యత్తులో బిడ్డపై క్యాన్సర్‌ వచ్చే అవకాశం ఎంతగా ఉందో తెలుస్తుంది. అలా క్యాన్సర్‌ గనకా వస్తే అది భారమే కదా. అందుకే ఆ భారాన్ని ‘ఎన్‌జీఎస్‌ ట్యూమర్‌ మ్యుటేషనల్‌ బర్డెన్‌’గా పేర్కొంటారు. ఇలా రాబోయే తరాల్లో ఎవరెవరికి క్యాన్సర్‌ రానుందో తెలుసుకుని... సరిగ్గా క్యాన్సర్‌ను కలగజేయబోయే ఆ నిర్దిష్ట జన్యువుకు తగిలేలా చికిత్స అందించడం అన్నదే ఈ ప్రక్రియ వెనకనున్న సిద్ధాంతం. 

ఈ ప్రెసిషన్‌ ఆంకాలజీ అన్నది కేవలం ఆరంభం మాత్రమే. భవిష్యత్తులో జన్యువు తీరును బట్టి ప్రత్యేకమైన చికిత్స (టైలర్‌ మేడ్‌) చికిత్సలూ సాధ్యం కానున్నాయి. అప్పుడు నొప్పి, బాధాలేని అనేక దీర్ఘకాలిక క్యాన్సర్లను తేలిగ్గా తగ్గించే రోజు త్వరలోనే రానుంది. 

‘ప్రెసిషన్‌ ఆంకాలజీ’కి మంచి ఉదాహరణ ఊపిరితిత్తుల, రొమ్ము క్యాన్సర్‌ 
పదేళ్ల కిందట నాలుగో దశలోని లంగ్‌ క్యాన్సర్‌  అంటే ఇక అది మరణంతో సమానం. కేవలం 7 శాతం మంది మాత్రమే బతికేందుకు అవకాశం ఉండేది. కానీ ఇప్పడు ‘ప్రెసిషన్‌ ఆంకాలజీ’ ప్రక్రియ ద్వారా ఏ జన్యువులు దెబ్బతిన్నాయో వాటిని మార్చడం వల్ల బతికి బయటపడే వారు 40 శాతానికి పెరిగారు.

పూర్తిగా ఆశవదిలేసుకున్న బాధితులు సైతం కనీసం ఐదేళ్లకు మించి ఆయుష్షు పొందారు. అంతేకాదు... వీళ్లు సాధారణ కీమోతో మిగతా అవయవాలకూ, కణాలకూ జరిగే నష్టాన్ని, తద్వారా వాళ్లకు కలిగే అమితమైన బాధనుంచి విముక్తమయ్యారు. 

రొమ్యు క్యాన్సర్‌ నుంచి విముక్తం కావడం కూడా ప్రెసిషన్‌ ఆంకాలజీకి ఓ మంచి  ఉదాహరణ. ఈ క్యాన్సర్‌లో ‘హర్‌ 2’ అనేది ఓ రకం. దీనికి గురైనవారిలో తొలిదశలో క్యాన్సర్‌ కణాలు చాలా చురుగ్గా, దూకుడుగా పెరుగుతాయి. వేగంగా ఇతర కణాలకు వ్యాపిస్తాయి.

అయితే అమితమైన కచ్చితత్త్వంతో మంచి కణాలను వదిలేసి, కేవలం క్యాన్సర్‌ కణాలను మాత్రమే దెబ్బతీసే టార్గెట్‌ థెరపీ మందులు రొమ్ముక్యాన్సర్‌ చికిత్సలో ఓ విప్లవాన్నే తీసుకొచ్చాయి. 
-డాక్టర్‌ సాద్విక్‌ రఘురామ్‌ వై. సీనియర్‌ కన్సల్టెంట్‌ మెడికల్‌ –హెమటో ఆంకాలజిస్ట్‌
 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top