
హైదరాబాద్‌కు చెందిన నిఖిల్‌కు డ్రాయింగ్ అంటే ఇష్టం. ఆర్కిటెక్చర్‌లో చేరాలనుకున్నా తల్లిదండ్రుల ఒత్తిడితో ఐటీలో చేరాడు. కాని, రెండో సంవత్సరంలో తీవ్రమైన డిప్రెషన్ వల్ల డ్రాపవుట్ అయ్యాడు. విజయవాడకు చెందిన నందినికి ఫ్యాషన్ డిజైనింగ్ అంటే పిచ్చి. కాని, పేరెంట్స్ ఒత్తిడి చేసి ఎంబీబీఎస్‌లో చేర్పించారు. ఫైనలియర్‌లో బర్నవుట్‌తో సైకియాట్రిక్ ట్రీట్మెంట్ అవసరమైంది.
ఇది నిఖిల్, నందినిల సమస్య మాత్రమే కాదు. వేలాదిమంది విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్య. తల్లిదండ్రులు తమ ఆశలు, కలలను పిల్లలపై రుద్దడం వల్ల, నచ్చిన కోర్సు చదవలేని పిల్లలు మానసిక సమస్యల పాలవుతున్నారు. దీనికి కారణం పేరెంట్ ప్రొజెక్షన్ ట్రాప్. ఏమిటీ ఉచ్చు? ‘‘నేను ఐఏఎస్ కాలేకపోయా, నా కుమారుడు ఐఏఎస్ కావాలి.’’ ‘‘నాకు డాక్టర్ సీటు రాలేదు, నా కూతురు డాక్టర్ అవ్వాలి.’’
‘‘నా బిజినెస్ ఫెయిల్ అయింది, నా పిల్లాడు దానిని మళ్లీ నిలబెట్టాలి.’’చాలామంది తల్లిదండ్రులు ఇలా ఆలోచిస్తుంటారు. తమ నెరవేరని కోరికలు, అసంపూర్ణ కలలు, గుదిబండలా లోపల మిగిలిన ఆశలను పిల్లలపై బలవంతంగా మోపుతుంటారు. దీన్నే సైకాలజీలో ప్రొజెక్షన్ అంటారు. ఇది ఇండియన్ పేరెంట్స్‌లో ఎక్కువగా కనిపిస్తోంది.
అయితే ఏంటి నష్టం?
తల్లిదండ్రులు తమ కలలను పిల్లల మీద మోపినప్పుడు, పిల్లల్లో ఆందోళన, డిప్రెషన్, సెల్ఫ్ వర్త్ సమస్యలు పెరిగినట్లు హార్వర్డ్ చైల్డ్ డెవలప్‌మెంట్ స్టడీలో వెల్లడైంది.
భారతదేశంలో విద్యార్థుల్లో కనిపిస్తున్న అకడమిక్ బర్నవుట్‌కు ప్రధాణ కారణం తల్లిదండ్రుల అసాధారణ ఆశలు, కంపేరిజన్ ప్రెజర్ అని ఇండియన్ జర్నల్ ఆఫ్ సైకాలజీ అధ్యయనంలో స్పష్టమైంది.
15–19 ఏళ్ల వయసులో ఆత్మహత్యలకు ప్రధాన కారణం విద్యాపరమైన ఒత్తిడేనని ప్రపంచ ఆరోగ్యసంస్థ కూడా 2022 నివేదికలో స్పష్టంగా పేర్కొంది.
ఎలాంటి ప్రభావం పడుతుందంటే...
పిల్లల్లో ‘‘నేను ఎవరు? నాకు కావలసింది ఏమిటి?’’ అనే గందరగోళం మొదలవుతుంది.
తల్లిదండ్రుల కల కోసం బతికేవాడు తన సొంత అస్తిత్వాన్ని కోల్పోతాడు.
‘‘నాన్న నిరాశ చెందకూడదు... అమ్మ మాట వినకపోతే తప్పవుతుంది’’ అనే అపరాధభావం, భయం పిల్లల్లో ఆందోళన పెంచుతుంది.
అతి ఒత్తిడి ఏకాగ్రతను తగ్గిస్తుంది. అందుకే తల్లిదండ్రులు అధిక అంచనాలు పెడితే పిల్లల పెర్ఫార్మెన్స్ తగ్గుతుంది.
‘‘నా పేరెంట్స్ నా మనసు వినరు. వాళ్లకేం కావాలో అదే ముఖ్యం’’ అనే భావన పిల్లల్లో ఏర్పడుతుంది. దీంతో తల్లిదండ్రులకు ఎమోషనల్‌గా దూరమవుతారు.
కొందరు పిల్లలు తిరుగుబాటు చేసి చదువు మానేస్తారు. మరికొందరు పేరెంట్స్ చెప్పిన దారిలో నడుస్తారు, కానీ జీవితాంతం అసంతృప్తితో ఉంటారు.
సరే, ఏం చేయమంటారు?
నిర్ణయం తీసుకునే ముందు మీ బిడ్డ మనసు వినండి. ‘నీకు ఏది ఇష్టం’ అనే ప్రశ్నను జెన్యూన్‌గా అడగండి.
మీ కల, మీ బిడ్డ సహజమైన టేలెంట్ తో మ్యాచ్ అవుతుందా? అనే విషయమై ఆలోచించండి.
స్పోర్ట్స్, ఆర్ట్స్, కోడింగ్, మెకానిక్స్, మ్యూజిక్... ఏది సహజంగా సూటవుతుందో తెలుసుకునేందుకు పిల్లలను ప్రయత్నించనివ్వండి.
మార్కులు, ర్యాంకుల కన్నా కూడా వెల్ బీయింగ్ ముఖ్యం. ఎమోషనల్‌గా ఆరోగ్యంగా ఉన్న బిడ్డే దీర్ఘకాలంలో విజయం సాధించగల వయోజనుడిగా ఎదుగుతాడు.
మీ బిడ్డకు ఏ కెరీర్ సరిపడుతుందో తెలుసుకునేందుకు సైకలాజికల్ అసెస్మెంట్, ఆప్టిట్యూడ్ టెస్టింగ్ తో కెరీర్ కౌన్సెలింగ్ చేయించండి.
పేరెంటింగ్ ఒక అద్దం లాంటిది. మీరు పిల్లలపై మీ ప్రతిబింబం మోపితే, వాళ్ల అసలు రూపం కనిపించదు. కానీ మీరు అద్దం శుభ్రం చేసి వాళ్లను వాళ్లుగానే చూసే ప్రయత్నం చేస్తే... మీ పిల్లల్లోని జీనియస్ ఆటోమేటిగ్గా వెలుగుతుంది.
ప్రాక్టికల్ పేరెంటింగ్ టిప్స్
రోజుకు 15 నిమిషాలైనా చదువుకు సంబంధంలేని విషయాలపై మాట్లాడండి.
‘‘నువ్వు ఫస్ట్ రాలేదు’’ అని చిన్నబుచ్చేకంటే, ‘‘నువ్వు ఎంత శ్రద్ధగా ప్రయత్నించావో చూశా, నాకు గర్వంగా ఉంది’’ అని చెప్పండి.
‘‘నీ కజిన్ ఎంత బాగా చదువుతున్నాడో చూడు’’ అని పోల్చవద్దు. అది ఆత్మన్యూనతను పెంచుతుంది.
పిల్లల చిన్న చిన్న విజయాలను కూడా గుర్తించి ప్రశంసించండి. అది వారికి ప్రోత్సాహాన్నిస్తుంది.
సైకాలజిస్ట్ విశేష్
www.psyvisesh.com