Benefits Of Eating Full Eggs: గుడ్డులోని పచ్చసొన మంచిదేనా? ఇన్నాళ్లకు సమాధానం దొరికింది

New Study Has Found That Adults Can Eat Whole Eggs Boost Overall Health - Sakshi

గుడ్డు ఆరోగ్యానికి ఎంత మంచిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చాలామందికి గుడ్డు రోజువారీ ఆహారంలో భాగం. అయితే చాలామంది గుడ్డులోని తెల్లసొన మాత్రం తిని పచ్చసొన వదిలేస్తుంటారు. ఎందుకంటే పచ్చసొన మంచిది కాదేమోనని కొందరి అనుమానం.గుడ్డులోని పచ్చసొన తీసుకోవటం వల్ల కొలెస్ట్రాల్‌ పెరుగుతుందని భ్రమ పడతారు.

అందుకే కేవలం ఎగ్‌వైట్‌ మాత్రమే తినడానికి ఇష్టపడుతుంటారు. ఇంతకీ కోడిగుడ్డు పచ్చసొన తినొచ్చా? తినకూడదా? ఎప్పటినుంచో ఉన్న ఈ సందేహానికి రీసెంట్‌గా యూనివర్శిటీ ఆఫ్ కనెక్టికట్ సైంటిస్టులు జరిపిన రీసెర్చ్‌తో ఫుల్‌స్టాప్‌ పడింది. ఇంతకీ ఆ అధ్యయనంలో ఏం తేలింది? అన్నది ఈ స్టోరీలో చదివేయండి. 
 

కామన్‌ పీపుల్‌ నుంచి సెలబ్రిటీల వరకు బ్రేక్‌ఫాస్ట్‌లో చాలామంది గుడ్డు తినడానికి ఇంట్రెస్ట్‌ చూపిస్తుంటారు. ఉడకబెట్టిన గుడ్లు. అమ్లెట్, ఫ్రై ఇలా అనేక రూపాల్లో తీసుకుంటారు. అయితే, మనలో చాలామంది పచ్చసొనను తీసుకోవటం అంతగా ఇష్టపడరు. ఎందుకంటే ఇది ఫ్యాట్‌ ఫుడ్‌ అని, దీనివల్ల కొలెస్ట్రాల్‌ స్థాయి పెరుగుతుందని భావిస్తారు.  తాజాగా ఇదే అంశంపై యూనివర్శిటీ ఆఫ్ కనెక్టికట్ (యుకాన్) సైంటిస్టులు జరిపిన అధ్యయనంలో ఇంట్రెస్టింగ్‌ విషయాలు వెల్లడయ్యాయి. 

ఇందుకోసం 18-35ఏళ్ల వయసున్న 28 మంది ఆరోగ్యవంతులను  ఈ రీసెర్చ్‌ కోసంఎంచుకున్నారు. వీళ్లలో కొందరిని కేవలం ఎగ్‌ వైట్‌ తినేలా, మరికొందరిని పచ్చసొనతో కలిపి గుడ్డు మొత్తం తినేలా, మిగిలిన వాళ్లకు గుడ్డు లేని ఆహారం అందించారు. నాలుగు వారాల తర్వాత వారి డైట్‌ను బట్టి జీవక్రియ, హెమటోలాజికల్ ప్రొఫైల్‌లపై గుడ్డు ప్రభావాన్ని పరిశీలించారు. వీరిలో మొత్తం గుడ్డు తిన్న వారి శరీరంలో కోలిన్‌ అనే పోషకం గణనీయమైన పెరుగుదలను చూపించిందని సైంటిస్టులు తెలిపారు.

కోలీన్‌.. మెదడు, నాడీ వ్యవస్థ, జ్ఞాపకశక్తి, మానసిక స్థితి, కండరాల నియంత్రించడానిక కోలిన్‌ సహాయపడుతుంది. అంతేకాకుండా ఇది  ట్రైమిథైలామైన్ N-ఆక్సైడ్ (TMAO) ను ఉత్పత్తి చేస్తుంది. సాధారణంగా గుడ్డు పచ్చసొన తింటే కొవ్వు పెరిగి గుండెపై ప్రభావం చూపిస్తుందని అనుకుంటారు. కానీ సైంటిస్టులు జరిపిన ప్రయోగం ప్రకారం.. పచ్చసొన కలిపిన గుడ్డు తిన్నవారిలో TMAO మారలేదని పరిశోధకులు గమనించారు. గుడ్డు మొత్తాన్నితినడం వల్ల మైక్రోన్యూట్రియెంట్ డైట్ క్వాలిటీ, కోలిన్, మంచి కొలెస్ట్రాల్‌లో పెరుగుదల కనిపించిందని సైంటిస్టుల పరిశోధనలో తేలింది. 

వాస్తవానికి గుడ్డు తెల్లసొనలో ప్రోటీన్ మరియు విటమిన్ B2 చాలా ఎక్కువ. కానీ గుడ్డు పచ్చసొనలో వివిధ విటమిన్లు మరియు ఖనిజాలు ఉన్నాయి, ఇవి మన శరీరానికి కూడా చాలా ముఖ్యమైనవి.ఒక కంప్లీట్‌ ఎగ్‌ తినడం వల్ల ప్రోటీన్లు, విటమిన్లు, మినరల్స్‌ సమతులంగా అందుతాయి  గుడ్డులోని పచ్చసొనలో విటమిన్ ఎ, విటమిన్ ఇ, విటమిన్ కె, ఒమేగా 3 వంటి కొవ్వు కరిగే విటమిన్లు ఉన్నాయి. గుడ్డు పచ్చసొనలో సెలీనియం పుష్కలంగా ఉంటుంది. ఇది జుట్టు పెరుగుదలను మెరుగుపరుస్తుంది.  

రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది. థైరాయిడ్ ఆరోగ్యంలో సెలీనియం కీలకపాత్ర పోషిస్తుంది. పచ్చసొనలో కేలరీలు కూడా తక్కువగా ఉన్నందున బరువు పెరిగే అవకాశాలు ఉండవని నిపుణులు చెబుతున్నారు. రక్తపోటును నియంత్రించి, గుండె పనితీరును మెరుగుపరచడంలో గుడ్లు ఎంతో ఉపయోగపడతాయని అధ్యయనంలో తేలింది.అసలు చెడు కొవ్వు శరీరంలోకి చేరడానికి ఆహారపు అలవాట్లే కారణమట.

జంక్ ఫుడ్స్, మధ్యపానం, ధూమపానం లాంటి వాటితో దీని పరిమాణం పెరుగుతుంది తప్ప గుడ్డులోని పచ్చసొన తీసుకుంటే కాదని తేలింది. ముఖ్యంగా బీపీ, షుగర్‌ ఉన్న పేషెంట్స్‌ మినహాయించి ఎవరైనా పచ్చసొనతో కలిపి గుడ్డును తీసుకోవచ్చు. కాబట్టి ఇప్పట్నుంచి నిక్షేపంగా గుడ్డులోని పచ్చసొనను కూడా తినొచ్చన్నమాట.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top