జపాన్‌లోని నాగసాకి నగరంలో అక్టోబర్ 7 నుంచి 9 వరకు ‘నాగసాకి కుంచి’ ఉత్సవం జరగనుంది. అత్యంత వైభవోపేతంగా, జనసంరంభంతో కొనసాగే ఈ వేడుక కోసం ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ మూడు రోజుల వేడుకలో నాగసాకి నగరవీథుల్లో రంగురంగుల రథాలను ఊరేగిస్తారు. ఊరేగింపుల్లో జనాలు సంప్రదాయ గీతాలను పాడుతూ, నృత్యం చేస్తూ ముందుకు సాగుతారు. ఈ వేడుకను తిలకించడానికి ఇప్పటికే దేశవిదేశాలకు చెందిన పర్యాటకులు నాగసాకి నగరానికి క్యూ కట్టారు.
నాగసాకి నగరానికి సంరక్షక దేవతగా భావించే సువా ఆలయం కేంద్రంగా ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తారు. పురాతనమైన సువా ఆలయంలో 1634లో దయూ–మాచి ప్రాంతానికి చెందిన తకావో, ఒతోహా అనే ఇద్దరు కళాకారిణులు ‘కోమీ’ అనే నోహ్ నాట్య గీతాన్ని ప్రదర్శించారట! అప్పటి నుంచే ‘నాగసాకి కుంచి’ ఉత్సవం మొదలైందని చెబుతారు. ఈ ఉత్సవం మొదలైన కాలంలోనే ‘దేజిమా’ అనే కృత్రిమ ద్వీప నిర్మాణం, మెగానే వంతెన నిర్మాణం జరగడం నాగసాకి చరిత్రలో ముఖ్యమైన ఘట్టాలు.
వీథులే రంగస్థల వేదికలు
ఈ ఉత్సవంలో నగర వీథులే రంగస్థల ప్రదర్శన వేదికలుగా మారిపోతాయి. రంగురంగుల అలంకరణలతో రూపొందించిన రథాలు, డ్రాగన్ నృత్యాలు, సింహ నృత్యాలు, పడవ ఆకారంలోని రథాలు వీథుల్లో సందడి చేస్తాయి. తిమింగలం నీరు చిమ్మే ప్రదర్శన, కొక్కొడెషో వంటి ప్రత్యేక కళారూపాలు కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. నాగసాకిలోని పలు ప్రాంతాలకు చెందిన కళాకారుల బృందాలు ఈ ప్రదర్శనల్లో పాల్గొంటాయి. నగరంలో 58 ‘డాన్స్ టౌన్స్ ’ ఉండగా, వాటిని ఏడు బృందాలుగా విభజించారు.
ప్రతి బృందానికి తమ కళారూపాలను ప్రదర్శించే అవకాశం ఏడేళ్లకు ఒకసారి మాత్రమే వస్తుంది. అందుకే ప్రతి ప్రదర్శనకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంటుంది. సువా ఆలయం, ఒటాబిషో, యాసకా ఆలయం, చువో పార్క్ ప్రధాన ప్రదర్శన వేదికలుగా ఉంటాయి.
కుంచి పేరు వెనుక...
కుంచి అనే పేరుకు ప్రత్యేకమైన నేపథ్యం ఉంది. చైనా చాంద్రమాన కేలండర్‌లో తొమ్మిదో నెల తొమ్మిదో రోజుతో దీనికి సంబంధం ఉన్నట్లు చెబుతారు. జపనీస్‌లో తొమ్మిదో రోజును ‘కు–నిచి’ అని పిలుస్తారు. కాలక్రమంలో అదే ‘కుంచి’గా మారిందని భావిస్తారు.
సంస్కృతుల సంగమం
నాగసాకి ఓడరేవు నగరం కావడంతో కాలక్రమంలో అనేక దేశాలతో సంబంధాలు ఏర్పడ్డాయి. ఆ ప్రభావం కుంచి ఉత్సవంలోనూ కనిపిస్తుంది. జపాన్ సంప్రదాయ కళలతో పాటు చైనా, డచ్ సంస్కృతుల ప్రభావం కూడా కొన్ని ప్రదర్శనల్లో కనిపిస్తుంది. దీంతో ఈ ఉత్సవం నాగసాకి బహుళ సాంస్కృతిక చరిత్రకు ప్రతిబింబంగా నిలుస్తోంది. ‘నాగసాకి కుంచి’ దాదాపు నాలుగు శతాబ్దాల చరిత్రకు సాక్ష్యంగా నిలుస్తోంది. స్థానిక సంస్కృతిని కాపాడుకుంటూ, పర్యాటకులను ఆకట్టుకుంటూ నేటికీ అదే ఉత్సాహంతో కొనసాగుతోంది.
రమా జంబుల


