
‘నాకు ఏడేళ్లప్పడు మా అమ్మ నన్ను, నా ఇద్దరు చెల్లెళ్లను తీసుకుని నాన్న దగ్గర్నుంచి బయటకు వచ్చేసింది. ఆ ఇంట్లోంచి వెళ్లిపోతున్నప్పుడు ‘మనం ఊరెళ్లిపోతున్నాం’ అని చెప్పింది అమ్మ. ‘ఎందుకు?’ అడిగాను. ‘నేను కొడుకును కనివ్వలేను కాబట్టి’ అంది. నాన్న వాళ్లింట్లోంచి వచ్చేప్పుడు అనుకున్నాను ‘ఎప్పటికైనా ఆ ఇంటిని కొంటాను’ అని! అనుకోవడమే కాదు అమ్మతో చెప్పాను కూడా! చాలెంజెస్ ఫేస్ చేయడం ఆ రోజునుంచే మొదలైంది.
డబుల్, ట్రిబుల్ జాబ్స్ చేస్తూ డబ్బు సంపాదించాను. ఆ ఇంటిని కొనేంత కూడబెట్టాను. ఒకరోజు అక్కడికి వెళ్లి అమ్మకు ఫోన్ చేశాను. ‘చిన్నప్పుడు వదిలి వచ్చేసిన ఇంటి దగ్గరున్నానమ్మా’ అని! అప్పుడు అమ్మ ‘ప్రతీకారకాంక్ష మనల్ని దహించేస్తుంది.. విలువైన సమయాన్ని వృథా చేస్తుంది. మన ఎనర్జీని నిరుపయోగమైన వాటివైపు మళ్లిస్తుంది. అందుకే మనల్ని హర్ట్ చేసిన వాళ్లను క్షమించి, మరచిపోవాలి. మనకు కోపం తెప్పించే వాటిని ఇగ్నోర్ చేయాలి. మన ఎనర్జీని పదిమందికి ఉపయోగపడే విషయాలపై వెచ్చించాలి’ అని చెప్పింది. ఆ మాట నా దిశను మార్చేసింది. అందుకే మా అమ్మే నా ఇన్సిపిరేషన్, టీచర్, గైడ్, ఫిలాసఫర్!’