
తల్లి తన బిడ్డల కోసం ఏ త్యాగం చేయడానికైనా సిద్ధపడుతుందనడానికి సిసలైన ఉదాహరణ ఇది. ఈ తల్లి ప్రమాదంలో చెంపలు కాలిపోయి అందవికారంగా తయారైన తన ఆరునెలల చిన్నారి కోసం తన చర్మాన్ని వొలిచి ఇచ్చింది. ఆ తల్లి త్యాగం ఫలించింది. ఇప్పుడా తల్లీ బిడ్డా ఇద్దరూ సంపూర్ణ ఆరోగ్యంతో చక్కగా ఉన్నారు. తనకేం జరిగిందో తెలియకున్నా అమాయకంగా నవ్వుతూ బిడ్డ ధ్యాన్ష్... తన చర్మాన్నిచ్చి కాపాడుకున్నానన్న సంతోషంతో తల్లి మనీషా ఇద్దరూ ఫొటోకు పోజులిచ్చారు.
గతనెల 12న అహమ్మదాబాద్‌లో జరిగిన విమాన ప్రమాదంలో విమానం కూలి మేఘనినగర్‌లోని బీజే మెడికల్ కాలేజీ హాస్టల్, నివాస గృహాలపై పడిన విషయం తెలిసిందే. ఆ ప్రమాదం జరిగిన సమయంలో సివిల్ హాస్పిటల్‌లో యూరాలజీ నిపుణుడైన డాక్టర్ కపిల్ కచ్చాడియా భార్య మనీషా, వాళ్ల ఆరు నెలల కుమారుడు ధ్యాన్ష్ ఇంట్లో ఉన్నారు.
విమాన శకలం నుంచి చెలరేగిన మంటల్లో మనీషా చేతులు ముఖంపై 25 శాతం కాలిన గాయాలు కాగా, ధ్యాన్ష్ ముఖం, రెండు చేతులు, ఉదరం, ఛాతీ కాలి, గాయాలు కావడంతో ఇద్దరినీ కేడీ ఆసుపత్రికి తరలించారు, అక్కడ ధ్యాన్ష్ ను పీడియాట్రిక్ ఐసియులో చేర్చి వెంటిలేటర్‌పై ఉంచారు. 36 శాతం కాలిన గాయాలతో బాధపడుతున్న ధ్యాన్స్‌కు అతని తల్లి ముప్ఫై ఏళ్ల మనీషా చర్మాన్ని తీసి స్కిన్ గ్రాఫ్టింగ్ ద్వారా అమర్చారు.
ఫలితంగా ఎనిమిది నెలల పసివాడు ధ్యాన్ష్ ఇప్పుడు చక్కగా నవ్వుతున్నాడు, ప్రాణాంతక కాలిన గాయాల నుండి బయటపడిన అతని బుగ్గలు ఇప్పుడు నునుపుతేలి ఆరోగ్యంతో మెరుస్తున్నాయి. తన నుంచి తీసిన చర్మాన్ని పిల్లాడికి అమర్చి, అతడు కోలుకున్న తర్వాత ఆ బోసి నవ్వులు చూస్తూ మనీషా కూడా త్వరలోనే కోలుకుంది. తల్లి, బిడ్డ ఇద్దరూ జూన్ 12న జరిగిన ఏఐ 171 విమాన ప్రమాదం తర్వాత తీవ్రమైన కాలిన గాయాలకు ఐదు వారాల చికిత్స తర్వాత ఇటీవల డిశ్చార్జ్ అయినట్లుగా టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదించింది.
‘ఒక్క క్షణం అంతా నల్లగా అయిపోయింది, ఆపై వేడి మా ఇంటిని చుట్టుముట్టింది. నేను ధ్యాన్ష్‌ను పట్టుకుని దట్టమైన పొగ, మంటల గుండా పరిగెత్తాను. మేము బయటకు వచ్చి ప్రాణాలతో బయటపడగలమని అనుకోలేదు కానీ దేవుడి దయవల్ల, కేడీ హాస్పిటల్ వైద్యులు సకాలంలో స్పందించి చేసిన చికిత్స వల్ల ఇద్దరం ఇప్పుడు పూర్తిగా కోలుకున్నాం. ఇప్పుడు నేను నా బిడ్డ అందమైన నవ్వును తిరిగి చూడగలుగుతున్నాను’’ అంటూ సంతోషం వెలిబుచ్చింది మనీషా.
కేడీ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ ఆదిత్ దేశాయ్ మాట్లాడుతూ, ‘ఆ తల్లి తన బిడ్డను కాపాడుకోవడానికి చూపిన ధైర్యాన్ని, వైద్యులకు అందించిన సహకారాన్ని మాటలలో వర్ణించలేం. మా హాస్పిటల్‌లో ప్రతి విభాగం సమన్వయంతో పనిచేసి సాధ్యమైనంత ఉత్తమమైన ఫలితాలనిచ్చింది’’ అని పత్రికలవారికి తెలిపారు. ఈ సంఘటనలో గాయపడిన ఆరుగురు ప్రమాద బాధితులకు తమ ఆస్పత్రి మానవతా దృక్పథంతో ఉచిత సేవలందించినట్లు తెలిపారు.
(చదవండి: రుచిని ఆస్వాదిస్తూనే హాయిగా తినొచ్చు ఇలా..! గ్యాస్, అధిక బరువు..)