
హైదరాబాద్ : హైదరాబాద్ వేదికగా ఇటీవలే నిర్వహించిన మిస్ అండ్ మిసెస్ స్ట్రాంగ్ అండ్ బ్యూటీఫుల్ ఈవెంట్ విజయవంతం కావడంతో సక్సెస్ మీట్ నిర్వహించారు. దీనిలో భాగంగా మిస్ అండ్ మిసెస్ స్ట్రాంగ్ అండ్ బ్యూటీఫుల్ సీజన్ 2ను ప్రకటించారు. రెండో సీజన్ కు సంబంధించిన పోస్టర్ ను ఫౌండర్ కిరణ్మయి అలివేలు , సీజన్ 1 విజేతలతో కలిసి ఆవిష్కరించారు.
ఔత్సాహిక యువతులకు ఇది మంచి వేదికని కిరణ్మయి చెప్పారు. నిత్య జీవితంలోని ఆలోచనలు, ఆశయాలకు పెళ్లి ముగింపు కాదనీ, మరో అద్భుత ఆరంభమన్నారు. మగువ సౌందర్యాన్ని మరింత గ్రాండ్ గా ప్రదర్శించడానికి ఈ ఈవెంట్ ను నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇప్పటి వరకు జాతీయ స్థాయిలో పలు ఫ్యాషన్ షోలు, బ్యూటీ కాంటెస్ట్స్ లో పాల్గొన్న అనుభవంతో, ఔత్సాహికులకు అవకాశాన్ని కల్పించాలనే లక్ష్యంతో ఈ వేదికను ఏర్పాటు చేశామన్నారు. వయసుతో సంబంధం లేకుండా మహిళలను ఫ్యాషన్ వేదికపై ప్రోత్సహించడమే లక్ష్యమన్నారు. అలాగే క్యాన్సర్ వంటి వ్యాధులపై అవగాహన కల్పించడంతో పాటు సామాజిక బాధ్యతతో కొన్ని సేవా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నట్టు మిస్ అండ్ మిసెస్ స్ట్రాంగ్ అండ్ బ్యూటీఫుల్ ఫౌండర్ కిరణ్మయి అలివేలు చెప్పారు.
ఈ సందర్బంగా తమ విజయంలో భాగమైన కుటుంబాలు, స్పాన్సర్లు, పాల్గొనేవారు, నిర్వాహక బృందానికి, మీడియాకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. ఈ లక్ష్యంలో కలిసి నడిచినందుకు ధన్యవాదాలన్నారు. సీజన్ 2 ప్రకటన సందర్భంగా మొదటి సీజన్ లో విజేతలుగా నిలిచిన వారంతా ర్యాంప్ వ్యాక్ తో అలరించారు.