న్యూస్‌మేకర్
ప్రతి పురుషుడి విజయం వెనుకా ఒక అమ్మ ఉంటుంది. న్యూయార్క్ మేయర్‌గా గెలిచి చరిత్ర సృష్టించిన జొహ్రాన్ మమ్దానీ తన ఆలోచనా విధానం, వ్యక్తిత్వం ద్వారానే ఓటర్లను ఆకట్టుకున్నాడు. ‘మా అమ్మ మీరా నాయర్ సినిమాలే నా ఆలోచనలను తీర్చిదిద్దాయి’ అన్నారాయన. మీరా నాయర్ ప్రపంచ సినిమాలో భారతీయ ప్రతిభను చాటిన దర్శకురాలు.
‘ఢిల్లీకి రాజైనా అమ్మకు కొడుకే’ అంటుంటారు. ఇప్పుడు కాస్త మార్చి ‘న్యూయార్క్‌కు మేయర్ అయినా..అమ్మకు కొడుకే’ అనాలేమో. అవును! 400 ఏళ్ల చరిత్ర ఉన్న న్యూయార్క్ మహా నగరానికి మేయర్‌గా ఎన్నికైన దక్షిణాసియా తొలి వ్యక్తిగా జోహ్రాన్ మమ్దానీ (34) తాను వార్తలలో ఉండటమే కాదు తల్లి మీరా నాయర్‌ను కూడా వార్తలలోకి ఎక్కించారు.
మేయర్‌గా గెలిచినందుకు మమ్దానీ ఎంత గర్వపడుతున్నారో అతణ్ణి చూసి మీరా నాయర్ కూడా అంతే గర్వపడుతున్నారు. మమ్దానీ కోసం ఆమె స్వయంగా ప్రచారం చేశారు కూడా. సంచలన సినీ దర్శకురాలిగా పేరు తెచ్చుకుని ఆస్కార్‌కు నామినేట్ అయిన మీరా ప్రత్యక్షంగా పరోక్షంగా కుమారుణ్ణి ప్రభావితం చేశారు. ప్రత్యక్షంగా పెంపకం ద్వారా అయితే పరోక్షంగా తన సినిమాల ద్వారా.
‘ఎల్ల లోకము ఒక్క ఇల్లై’
న్యూయార్క్ మేయర్ ఎలక్షన్ ప్రచారం మొదలైనప్పుడు గెలుపు అవకాశం ఉన్న వ్యక్తుల జాబితాలో పదవ స్థానంలో ఉన్న మమ్దానీ ఒకటవ స్థానానికి ఎగబాకి విజయం సాధించడం సినిమాటిక్‌గా అనిపించవచ్చు. కాని అతని గెలుపు సినిమాటిక్ కాదు. మమ్దాని ఇచ్చిన నినాదం ‘న్యూయార్క్ వలసవాదుల నగరంగానే ఉంటుంది’ అనేది యాదృచ్చికంగా రాలేదు. తల్లి మీరా నాయర్ సినిమాల ప్రభావంతో అంది పుచ్చుకున్నది.
మీరా నాయర్ తీసిన ‘సలాం బాంబే’, ‘మిసిసిపి మసాలా’ పరాయి దేశాల్లో, పరాయి నగరాల్లో తమ స్థాయి, స్థానం కోసం పెనుగులాడే వలసజీవుల కథలు. ‘మీరు మావాళ్లు కాదు వెళ్లిపోండి’ అంటే మానవ పరిణామక్రమం, వలసతో వికసించిన నాగరికతలను నిరాకరించడమే. అందుకే మమ్దాని వలసవాదుల కోసం గట్టిగా నిలబడ్డారు. అలాగే నగరంలో సగటు వ్యక్తి జీవించగలిగేలా, అన్ని సంస్కృతులను ఇనుమడించేలా చూస్తానని మమ్దాని హామీ ఇవ్వడం మీరా నాయర్ ప్రభావమే. యువకుడిగా ఉన్నప్పుడు ఆమె సినిమా సెట్‌లలో పని చేసేవారు మమ్దాని. స్వతహాగా అతను రాప్ సింగర్ కూడా.
వాస్తవ ప్రపంచం
‘అమ్మ సినిమాలు చూడటం అంటే వాస్తవ ప్రపంచంలో ఉండటమే’ అంటారు మమ్దాని. వాస్తవికవాద సినిమాలనే మీరానాయర్ తీశారు. ఆమె తీసిన ‘మాన్‌సూన్ వెడ్డింగ్’ భారతీయ సంపన్న కుటుంబాల్లో చోటు చేసుకుంటున్న బోలుతనాన్ని చూపితే, ‘నేమ్‌సేక్’ వలస జీవనంతో భారతీయులు తమ సాంస్కృతిక అస్తిత్వం కోసం చేసే అన్వేషణను చూపుతుంది. మీరా చిత్రాల్లో స్త్రీవాదం ఉంటుంది.
అయితే ఆమె మహిళా కథానాయకులు బాధితులు కారు, ఆ బాధల్లోంచి బయటపడాలని భావించేవారు, అందుకు తగ్గ పోరాటాలు చేసేవారు. ఇప్పుడు మమ్దాని ఏ న్యూయార్క్ నగరానికైతే మేయర్ అయ్యారో అదే నగరంపై జరిగిన 9/11 దాడి నేపథ్యంలో మీరానాయర్ ‘ది రిలక్టెంట్ ఫండమెంటలిస్ట్’ సినిమా తీశారు. తల్లికి ఉన్న ఈ బలమైన దృష్టికోణం, వ్యక్తిత్వం, సత్యం వైపు నిలబడే ధీమత్వం తనకు దిశా నిర్దేశం చేసిందంటారు మమ్దాని. తండ్రి మహమూద్ మమ్దానీ కొలంబియా యూనివర్సిటీలో ్ర΄÷ఫెసర్ మాత్రమే కాదు సామ్రాజ్యవాద రాజకీయాల నిపుణుడు కావడం జొహ్రాన్ మమ్దానీకి లాభించింది.
మమ్దాని సలహా– మీరా ‘ది నేమ్‌సేక్’
తన జీవితంలోని అతి ముఖ్యమైన నిర్ణయాల్లో తన కుమారుడి సలహా ఉందని మీరా నాయర్ అంటారు. అందుకు ఒక ఉదాహరణ చెబుతారు. ‘ది నేమ్‌సేక్’ సినిమా తీద్దామనుకుంటున్న సమయంలో ‘హ్యారీ పోటర్–4’కు దర్శకత్వం వహించే అవకాశం మీరాకు వచ్చింది. వార్నర్ బ్రదర్స్ సంస్థ నుంచి వచ్చిన ఆఫర్, ప్రపంచ ప్రఖ్యాత నవల, బోలెడంత డబ్బు, పేరు. కానీ అప్పటికే ‘ది నేమ్‌సేక్’ పనుల్లో ఆమె నిమగ్నమయ్యారు. ఆ సమయంలో మమ్దానీకి 14 ఏళ్లు. ఇప్పుడేం చేయాలని కొడుకును అడగ్గా, ’అమ్మా! హ్యారీ పోటర్ తీయడానికి చాలామంది దర్శకులున్నారు. కానీ ‘ది నేమ్‌సేక్’ సినిమా నువ్వే తీయగలవు’ అని చె΄్పాడు. అది చాలా స్వేచ్ఛాయుతమైన, స్పష్టమైన ప్రకటన అని, అందుకే తాను ‘హ్యారీపోటర్’ అవకాశం వదులుకున్నానని ఆమె వివరించారు.
‘నేను ముగింపును నమ్మను, ప్రారంభాలను నమ్ముతాను.‘ అంటారు మీరా నాయర్. ఆ లెక్కన మమ్దానీకి ఇది ప్రారంభం. మేయర్‌గా ఆయన ఎదుర్కోవాల్సిన సమస్యలు బోలెడున్నాయి. ఎల్లప్పుడూ తల్లి పంచే స్ఫూర్తి ఆయనకు తోడుగా ఉంటుంది.


