
మూడు గంటల చార్జింగ్‌తో 80 కిలోమీటర్ల ప్రయాణం
∙జె.కొత్తవలస గ్రామ ఇంటర్ విద్యార్థి బ్యాటరీ సైకిల్ ఆవిష్కరణ
తెర్లాం: మండలంలోని పూనువలస పంచాయతీ పరిధిలోని జె.కొత్తవలస గ్రామానికి చెందిన రాజపు సిద్దూ రాజాంలోని ఓ ప్రైవేటు కళాశాలలో ఎంపీసీ గ్రూపులో ఇంటర్ సెకెండియర్ చదువుతున్నాడు. ప్రతిరోజూ ఇంటి నుంచి రాజాంలో తను చదువుతున్న కళాశాలకు వెళ్లేందుకు 17 కిలోమీటర్ల దూరం. మూడు కిలోమీటర్లు కాలినడకన వెళ్లి, అక్కడ నుంచి బస్సు, లేదంటే ఆటో ఎక్కివెళ్లాలి. బస్సు రావడం ఆలస్యమైతే కళాశాలకు సమయానికి చేరుకోలేని పరిస్థితి. రానుపోను చార్జీలకు రోజుకు రూ.60లు ఖర్చయ్యేది. ఈ సమస్యలను అధిగమించాలని సిద్దూ తలచాడు. రూ.30వేలు ఖర్చుచేసి ఆన్‌లైన్‌లో రాజస్థాన్, ఢిల్లీ నుంచి సామగ్రిని తెప్పించుకున్నాడు. పాఠశాల దశలో విజ్ఞాన ప్రదర్శనల్లో ప్రదిర్శంచేందుకు రూపొందించిన ప్రాజెక్టుల అనుభవాన్ని రంగరించి మరో స్నేహితుడితో కలిసి బ్యాటరీతో నడిచే సైకిల్‌ను తీర్చిదిద్దాడు. కేవలం 3 గంటల విద్యుత్ చార్జింగ్‌తో 80 కిలోమీటర్ల దూరం ప్రయాణించేందుకు వీలుగా మలిచాడు. కేవలం రూ.6 ఖర్చుతో కళాశాలకు వెళ్లి తిరిగొస్తున్నాడు. కుమారుడి ప్రతిభను చూసి కూలీలైన తల్లిదండ్రులు మురిసిపోతున్నారు. విద్యార్థి సృజనాత్మక ఆలోచనతో ముందుకు సాగుతున్న విద్యార్థిని గ్రామస్తులతో పాటు కళాశాల అధ్యాపకులు అభినందిస్తున్నారు.
ఇదీ చదవండి: కాపురానికి కమ్యూనికేషన్ : గ్యాప్ పెరిగిపోతోంది
ఆ విజ్ఞానంతోనే..
ఇంటి నుంచి తరగతులకు సమయానికి వెళ్లేలేకపోవడంతో చాలా ఇబ్బందికరంగా ఫీలయ్యేవాడిని. తన సమస్యకు పరిష్కారంకోసం నిరంతరం ఆలోచించేవాడిని. హైసూల్‌లో చదువుకొనే రోజుల్లో పాల్గొనే సైన్స్ విజ్ఞాన ప్రదర్శనల అనుభవంతో ఎలక్ట్రికల్ చార్జింగ్ సైకిల్ తయారు చేసేందుకు పూనుకున్నాను. దీనిని తయారు చేయడానికి అవసరమైన పరికరాలు రాజస్థాన్, ఢిల్లీ నుంచి ఆన్‌లైన్‌లో తెప్పించుకున్నాను. వీటిని స్నేహితుని సహాయంతో రెండు రోజుల్లో సైకిల్‌కు బిగించాను. ప్రస్తుతం ప్రతిరోజూ కళాశాలకు ఎలక్ట్రికల్ చార్జింగ్ సైకిల్‌పైనే వెళ్తున్నాను. నా సమస్య పరిష్కారం కావడం ఆనందంగా ఉంది. – సిద్దూ, జె.కొత్తవలస
చదవండి: బోయింగ్ విమానంలో కుదుపులు : ప్రయాణికులు హడల్, కడసారి సందేశాలు