Children's Story: సహన రెండవ తరగతి చదువుతోంది.. ఒకరోజూ..! | Sakshi
Sakshi News home page

పిల్లల కథ: ఓర్పు నేర్చుకో! లేదంటే?

Published Sun, May 26 2024 12:44 PM

Learn Patience Is A Children's Story Written By Kaikala Venkata Sumalatha

సహన రెండవ తరగతి చదువుతోంది. ఆమె అన్నింటికీ తొందరపడుతుంది. ఏదయినా సరే తను అడిగిన వెంటనే నిమిషాల్లో జరిగిపోవాలి. లేదంటే గొడవ చేసి అమ్మ నాన్నలను విసిగిస్తుంది.‘అమ్మా! నా జడకు రబ్బర్‌ బ్యాండ్‌ వదులుగా ఉంది, సరిగ్గా పెట్టు’ వంట చేస్తున్న మానస దగ్గరకు వచ్చి అంది సహన.
      ‘పప్పు తాలింపు పెడుతున్నాను, ఐదు నిమిషాలు ఆగు’ అంది మానస. ‘అమ్మా! ప్లీజ్‌ అమ్మా, రామ్మా’ అంటూ నస పెట్టింది అమ్మాయి. దాంతో చేసే పని ఆపి సహన జడకి రబ్బర్‌ బ్యాండ్‌ సరిగ్గా పెట్టింది మానస.

‘డాడీ! నాకు సాయంత్రం రంగు పెన్సిళ్లు తీసుకురండి’ ఆఫీసుకు వెళ్తున్న తండ్రితో చెప్పింది సహన.
‘సరే అలాగే‘ అంటూ వెళ్ళిన ఆయన సాయంత్రం రంగు పెన్సిళ్లు మరచిపోయి వచ్చారు. అందుకు సహన మొండి పేచీ పెట్టింది. ఆ పేచీ భరించలేక ఆయన మళ్ళీ బజారుకి వెళ్ళి తీసుకువచ్చారు.
      ‘సహనా! నీకసలు ఓపిక లేదు. ఏదైనా అడిగిన వెంటనే దొరకదు. సమయం పడుతుంది. దానికోసం ఓర్పుగా ఎదురు చూడాలి. ఇలా తొందరపడితే.. తొందరపెడితే ముందు ముందు చాలా కష్టపడాల్సి వస్తుంది’ బాధపడుతూ కూతురితో అన్నారాయన. ఆ మాటలను సహన పెద్దగా పట్టించుకోలేదు.
ఒకరోజు స్కూల్‌ నుంచి ఇంటికి వస్తూనే అమ్మతో ‘స్కూల్‌ యాన్యువల్‌ డేకి నన్నో గ్రూప్‌ డాన్స్‌కి సెలెక్ట్‌ చేశారు టీచర్‌. గ్రూప్‌ డాన్స్‌ కాదు సోలో డాన్స్‌ చేస్తానని చెప్పాను’ అంది సహన.

‘మంచిదే.. కానీ గ్రూప్‌ డాన్స్‌ అంటే నువ్వెలా చేసినా అందరిలో కలసిపోతుంది. సోలో డాన్స్‌ అయితే చాలా శ్రద్ధపెట్టి నేర్చుకోవాలి! ఒక్కసారి ప్రాక్టీస్‌కే నాకంతా వచ్చేసిందని తొందరపడితే కుదరదు. రోజూ ఇంటి దగ్గర కూడా సాధన చేయాలి మరి!’ అంది మానస. ‘అలాగేలే అమ్మా’ అంటూ తల ఊపింది సహన నిర్లక్ష్యంగా! యాన్యువల్‌ డే కోసం స్కూల్లో డాన్స్‌ నేర్పించడం మొదలైంది. కానీ సహన ఇంటి దగ్గర ప్రాక్టీస్‌ చేయట్లేదు. అది గమనించి కూతురితో అన్నది మానస ‘ఇంటి దగ్గర నువ్వు సరిగా ప్రాక్టీస్‌ చేయడం లేదు. అలా అయితే స్టేజీ మీద బాగా చేయలేవు’ అని! ‘స్కూల్లోనే బాగా చేస్తున్నానమ్మా! అది చాల్లే’ అని జవాబిచ్చింది సహన ఎప్పటిలాగే నిర్లక్ష్యంగా.  ఇంక చెప్పినా వినేరకం కాదని వదిలేసింది మానస.

సహన వాళ్ల స్కూల్‌ వార్షిక దినం రానే వచ్చింది. సాంస్కృతిక కార్యక్రమాలు మొదలయ్యాయి. సహన వంతు వచ్చింది. పాట మొదలైంది. దానికి తగ్గ స్టెప్స్‌.. హావభావాలతో డాన్స్‌ చేయసాగింది సహన. అయితే హఠాత్తుగా తను వేయాల్సిన స్టెప్స్‌ని మరచిపోయి వేసిన స్టెప్స్‌నే మళ్లీ మళ్లీ వేయసాగింది. ‘అలా కాదు సహనా.. ఇలా చేయాలి’ అంటూ స్టేజీ పక్క నుంచి వాళ్ల డాన్స్‌ టీచర్‌ చిన్నగా హెచ్చరిస్తూ చేతులతో ఆ స్టెప్స్‌ని చూపించసాగింది. అర్థం చేసుకోలేక అయోమయానికి గురైంది సహన. దాంతో డాన్స్‌ ఆపేసి.. బిక్కమొహం వేసి నిలబడిపోయింది.

స్టేజీ మీదకు వెళ్లి ఆమెను కిందకు తీసుకొచ్చేసింది టీచర్‌. ప్రేక్షకుల్లో ఉన్న మానస లేచి.. గబగబా సహన దగ్గరకు వెళ్లింది. కూతురిని హత్తుకుంది. దానితో అప్పటివరకు ఉన్న భయం పోయి తల్లిని గట్టిగా వాటేసుకుంది. ‘అమ్మా! నేను డా¯Œ ్స మధ్యలో స్టెప్స్‌ మరచిపోయాను’ వస్తున్న దుఃఖాన్ని దిగమింగుతూ చెప్పింది సహన. ‘నీకు చాలాసార్లు చెప్పాను.. ఏదైనా పూర్తిగా నేర్చుకోనిదే రాదని! కొంచెం రాగానే అంతా వచ్చేసిందనుకుంటావు. ఇప్పుడు చూడు ఏమైందో! సాధన చేయకపోవడం వల్ల ఆందోళన పడ్డావు. అదే చక్కగా ప్రాక్టీస్‌ చేసుంటే ఈ కంగారు ఉండేది కాదు కదా! తొందరపాటు వల్ల ఇలాంటివి జరుగుతాయనే ఓర్పుగా ఉండాలని చెప్పేది’ అంది మానస.

అమ్మ మాటలనే వింటూ ఉండిపోయింది సహన. ‘చదువులోనూ అంతే! జవాబులో కొంత భాగం రాగానే వచ్చేసిందంటావు. ముక్కున పట్టి అప్పచెప్పి ఇక చదవడం ఆపేస్తావు. ముక్కున పట్టింది ఎంతసేపో గుర్తుండదు. అందుకే పరీక్షల్లో సరిగ్గా రాయలేక మార్కులు తెచ్చుకోలేకపోతున్నావు. అప్పటికప్పుడు ఏదీ వచ్చేయదు. నిదానంగా ఏ రోజు పాఠాలు ఆ రోజు చదివి అర్థం చేసుకోవాలి’ చెప్పింది మానస.

అలా అంతకుముందు అమ్మ  ఎన్నిసార్లు చెప్పినా సహనకు అర్థం కాలేదు. కానీ ఈసారి బాగా అర్థమయింది. తన పొరబాటును గ్రహించింది. ‘అమ్మా.. ఇప్పటి నుంచి తొందరపడను. నిదానంగా ఆలోచిస్తాను. దేన్నయినా పూర్తిగా నేర్చుకుంటాను’ అన్నది సహన .. అమ్మను చుట్టేసు కుంటూ! ‘మా మంచి సహన.. ఇక నుంచి పేరును సార్థకం చేసుకుంటుంది’ అంటూ.. కూతురు తల నిమిరింది మానస. – కైకాల వెంకట సుమలత

ఇవి చదవండి: మిస్టరీ.. 'ఆ వస్తువుల్ని ఎవరైనా తీసుకెళ్తే.. ఎందుకలా జరుగుతుంది'?

Advertisement
 
Advertisement
 
Advertisement