
‘అద్దె కట్టాలి, కరెంట్ బిల్లు కట్టాలి, గ్యాస్ బిల్లు కట్టాలి, పాల బిల్లు కట్టాలి, రేషన్ ఖర్చు, మెడికల్ ఖర్చు– అబ్బా! ఎలారా ఫ్యామిలీ మన్ అందరూ మ్యానేజ్ చేస్తున్నారు’ అనే సినిమా డైలాగ్ మాదిరిగానే చాలామంది ఫ్యామిలీని రన్ చేయడానికి చాలా కష్టాలు పడుతుంటారు. అయితే, అమెరికాలోని లానెట్, జోహాన్ అనే దంపతులు ఈ కష్టాలన్నింటికీ దూరంగా బతికేయడానికి ఒక ఉపాయం ఆలోచించారు.
అదే నౌకాజీవితం. వారికున్న కార్లన్నీ ఆమ్మేసి, ప్రపంచయాత్ర చేసే నౌకలో యావజ్జీవిత యాత్రను ప్రారంభించారు. ఈ నౌక మూడున్నరేళ్లల్లో 147 దేశాలకు చెందిన 425 ఓడరేవులలో ఆగుతుంది. ఇప్పటికే ఈ దంపతులు 25 దేశాలను సందర్శించారు. ఇలానే తర్వాతి పదిహేనేళ్లు కూడా ఇందులోనే గడిపేయాలని నిర్ణయించుకున్నారు. అద్భుతమైన వారి నౌకాజీవితాన్ని ‘లివింగ్ లైఫ్ ఆఫ్ ఏ క్రూజ్’ పేరుతో యూట్యూబ్‌లో వీడియో పోస్ట్ చేసి, ‘ఇక్కడ మేము నెలకు రూ. 2.85 లక్షలు ఖర్చు చేస్తున్నాం.
ఇది మా సాధారణ ఖర్చుల కంటే చాలా తక్కువ. పైగా వంట వండటం, బట్టలు ఉతకడం, రూమ్ క్లీనింగ్ ఇలా ఏ పనీ చేయాల్సిన పనిలేదు. పడుకున్న దుప్పట్లు కూడా వారే మడతేసి పెడతారు. కేవలం ఏం కావాలంటే అది ఆర్డర్ పెట్టుకొని తినడం, ఎంజాయ్ చేయటమే మా పని. ఇదే మా అడ్రస్. అయితే, అప్పుడప్పుడు భూమి మీదకు వెళ్లినప్పుడు నడవడానికి కాస్త ఇబ్బంది పడుతున్నాం’ అని చెప్పారు.
(చదవండి: కళ్లు చెదిరే కాంతుల వేడుక..!)