
ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరాల అందాలను చూడటం కోసం ప్రపంచం నలుమూలల నుంచి పర్యాటకులు ఎగబడుతుంటారు. పారమాట నది ఒడ్డునున్న సిడ్నీ అందాలు చూడటానికి సుమనోహరంగా ఉంటాయి. అయితే, సిడ్నీ అందాలను మరింత ప్రత్యేకంగా చూడాలంటే, వివిడ్ సిడ్నీ ఫెస్టివల్‌కి వెళ్లాల్సిందే! ఈ వేడుకలు మే 23 నుంచి ప్రారంభమై జూన్ 14 వరకు దాదాపు మూడు వారాల పాటు కొనసాగుతాయి.
ఇక్కడ కనిపించే ప్రతి కట్టడం, చీకటిపడితే విద్యుత్ వెలుగులతో మిరుమిట్లు గొలుపుతాయి. సిడ్నీ ఒపెరా హౌస్, హార్బర్ బ్రిడ్జ్ వంటి ప్రదేశాలు అద్భుతమైన కాంతి ప్రదర్శనలతో కళ్లుచెదిరే కళాఖండాలుగా మారుతాయి. అంతేకాదు, నగరమంతా ఏర్పాటు చేసే విద్యుద్దీపాలంకరణ మంత్రముగ్ధుల్ని చేస్తుంది.
ఈ వేడుక కేవలం కాంతులకే పరిమితం కాదు. ఇక్కడ ప్రపంచ ప్రఖ్యాత కళాకారులు, సంగీత విద్వాంసుల ప్రదర్శనలుంటాయి. వినూత్న ఆలోచనలు పంచుకునే చర్చలు, చవులూరించే ఆహార వేదికలు కూడా ఈ ఉత్సవంలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. కొన్నిసార్లు ప్రత్యేకంగా నీటిపై విజువల్ ఎఫెక్ట్‌లు కూడా ఉంటాయి.
హార్బర్‌లో ప్రయాణించే పడవలు కూడా లైట్లతో అలంకరించడంతో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ఈ వేడుకకు స్థానికులతో పాటు దేశ విదేశాల నుంచి కూడా పర్యాటకులు పెద్దసంఖ్యలో సిడ్నీకి విచ్చేస్తుంటారు. ఈ వేడుకకు 2023లో రికార్డు స్థాయిలో 32.8 లక్షలమంది హాజరయ్యారు. దాంతో ఈ ఏడాది కూడా అదే స్థాయి అంచనాలున్నాయి.
(చదవండి: డ్రాగన్స్ సృష్టించిన అద్భుతం!)