
నవ్వినా ఏడ్చినా కన్నీరే వస్తాయి ఏ కన్నీరెనకాల ఏముందో తెలుసుకో అన్నారో సినీకవి. అయితే నగరవాసుల కంట్లో నీరున్నా...ఆ కన్నీరెనకాల క్వాలిటీ సున్నా అంటున్నారు నేత్ర వైద్యులు. అదేంటీ నవ్వలేక ఏడుస్తుంటే అందులో నాణ్యత కూడా ఉండాలా? అంటే...అవును ఉండాల్సిందే అని వైద్యులు అంటున్నారు. నవ్వే మనిషిని చూసి శభాష్ అంటాం...ఏడ్చే మనిషిని చూసి పాపం అనుకుంటాం... మానవ శరీరంలో కలిగే ప్రతీ మార్పూ భావోద్వేగాల ప్రతిరూపమే. మనం మంచిదని, చెడ్డదని మరొకటని అనుకున్నా..అవన్నీ మనకు అవసరమైనవే... అప్రధానం కానివే... ఈ నేపధ్యంలోనే కొన్ని రకాల భావోద్వేగాల ఫలితంగా పుట్టే కన్నీరు కూడా చాలా ముఖ్యమైనదే. అంత ముఖ్యమైన కన్నీటిలో ఇప్పుడు నాణ్యత లోపిస్తోందని వైద్యులు చెబుతున్నారు. ఆధునిక జీవనశైలే దీనికి కారణమని స్పష్టం చేస్తున్నారు.
టియర్స్...వండర్స్...
ఆపుకోలేక ఏడుస్తామేమో గానీ ఎవరూ చూడకూడదనుకుని తుడిచేస్తాం...ఎవరైనా చూస్తే సిగ్గుపడతాం.. కానీ తేలిగ్గా తీసుకోవద్దు... కన్నీటి తయారీ వెనుక పెద్ద తతంగమే ఉంది. కన్నీళ్లు కంటిలోపలి మూడు పొరల నుంచి తయారవుతాయి.
అందులో బయట ఉండేది ఆయిలీ పొర, మధ్యలో ఉండేది నీటి పొర, లోపల ఉండే మ్యూకస్ పొర...ఈ మూడింటిని కలిపి టియర్ ఫిల్మ్‌గా పేర్కొంటారు. కంట్లో ఉబికే కన్నీరు ఈ 3 పొరలు సక్రమంగా పనిచేసినప్పుడే ఆరోగ్యకరంగా ఉంటుంది. వీటిలో ఏ ఒక్కపొర దెబ్బతిన్నా కన్నీరు నాణ్యత కోల్పోతుంది.
పొరను కాటేస్తున్న తెర...
కంటి నీటి క్వాలిటిని దెబ్బతీస్తున్నవాటిలో స్క్రీన్ టైమ్ ప్రధానమైంది. కంప్యూటర్ కావచ్చు, ల్యాప్‌టాప్ లేదా మొబైల్... ఏదైనా సరే అతిగా అదే పనిగా చూడడం వల్ల కళ్లు పొడిబారుతాయి అనేది తెలిసిందే.. కళ్లు పొడిబారడం వల్ల వచ్చే సమస్యే కన్నీటి క్వాలిటీని దెబ్బ తీస్తోంది. అందుకే కళ్లు ఎర్రబారినా ఇంకే సమస్య వచ్చినా తొలుత కన్నీటి నాణ్యతను కూడా పరీక్షిస్తారు.
స్కాన్ చేసి టియర్ క్వాలిటీని నిర్ధారిస్తారు. ఈ సమస్య పరిష్కారంగా లిపి ఫ్లో ట్రీట్‌మెంట్ వంటివి చేస్తారు తద్వారా కంటి నీటి క్వాలిటీ పెరుగుతుంది. కన్నీటి క్వాలిటీ తగ్గినప్పుడు నీటిలో ఉప్పు శాతం కూడా పెరిగే అవకాశం కూడా ఉంది. దాన్ని శరీరం అంగీకరించదు. దాని వల్ల కళ్లు మరింత ఎర్రబారడం...వంటి సమస్యలు వస్తాయి. లాక్రిమల్ గ్రంథి అనుబంధ గ్రంథుల పనిచేయకపోవడం వల్ల తగినంత కన్నీటి ఉత్పత్తి సైతం జరగదు.
కన్నీటి క్వాలిటీ కోసం...
టియర్ ఫిల్మ్ క్వాలిటీ తగ్గడం అనేది గతంలో పెద్ద వయసు లక్షణంగా భావంచేవాళ్లం. అయితే వయసులకు అతీతంగా ప్రస్తుతం సిటిజనుల్లో చాలా మందిలో కనపడుతున్న సమస్య. దీని చికిత్సలో భాగంగా స్నానం చేసేటప్పుడు తప్పనిసరిగా కళ్లు శుభ్రం చేసుకోవడం, గోరువెచ్చని నీటితో కంటిపై కాపడం పెట్టుకోవడం...వంటి చిట్కాలతో పాటు కొన్ని మందులు కూడా పనిచేస్తాయి. మరికొన్ని జాగ్రత్తలు...
తగినంత నీరు తాగుతుండాలి..
కంప్యూటర్స్, మొబైల్స్ తదితర డిజిటల్ స్క్రీన్స్‌ను చూస్తున్నప్పుడు తరచుగా కనురెప్పలు మూసి తెరుస్తుండాలి.
ఎయిర్ కండిషనింగ్, హీటింగ్ మిషన్లులతో పాటు కంటిని పొడిబార్చే గాలులకు దూరంగా ఉండాలి.
కన్నీటి ఉత్పత్తిని పెంచేందుకు తరచుగా సుతిమెత్తని వెచ్చని ఒత్తిడి వాటిపై కలిగిస్తుండాలి.
ఒమెగా–3 పుష్కలంగా కలిగి ఉన్న వాల్‌నట్స్, సాల్మన్ చేప, ఫ్లాక్స్ సీడ్స్ ఆహారంలో జత చేయాలి.
కళ్లను సున్నితంగా మాత్రమే తాకాలి..కార్నియాకు ఒత్తిడి కలిగించేలా రఫ్‌గా, తరచుగా నులమడం వంటివి చేయకూడదు.
రోజుకి తగినంత అంటే 7 నుంచి 8 గంటల పాటు నిద్రపోవాలి.
స్మోకింగ్, ఆల్కహాల్ వినియోగం కన్నీటి ఉత్పత్తిని దెబ్బతీయడంతో పాటు కంటి ఆరోగ్యానికి హాని చేస్తాయి.
కృత్రిమ కన్నీళ్లను ఉపయోగించడం వల్ల పొడి కన్నీటి పొర ఉన్న రోగులలో దృష్టి నాణ్యత కాంట్రాస్ట్ సున్నితత్వం మెరుగుపడతాయి,
అధునాతన నాన్–ఇన్వాసివ్ టియర్ ఫిల్మ్ ఇమేజర్స్ వంటి కొత్త సాంకేతికతలు, కన్నీటి పొర సబ్‌లేయర్‌ల వివరణాత్మక దృశ్యాన్ని అందిస్తాయి, నేత్ర వైద్యులు పరిస్థితిని నిర్ధారించడానికి పర్యవేక్షించడంలో సహాయపడతాయి.
కన్నీరు కూడా విలువైనదే...
తప్పకుండా ఉండాల్సిన శరీరధర్మాల్లో కన్నీరు కూడా ఒకటి. ఆ కన్నీరులో కూడా విభిన్న రకాలు మిళితమై ఉంటాయి. కంటి పనితీరు బాగుండడానికి అవన్నీ నాణ్యతతో ఉండాల్సిన అవసరం ఉంది.
వాటి నాణ్యత లోపం ఏర్పడినప్పుడు తప్పకుండా కంటి పనితీరు కూడా దెబ్బతింటుంది. సో.. చాలా సార్లు కంటికి సంబంధించిన పరీక్షలు నిర్వహించడంలో భాగంగా కన్నీరు కూడా పరీక్షించాల్సిన అవసరం ఏర్పడుతుంది. అవసరాన్ని బట్టి కృత్రిమ మార్గాల ద్వారా కూడా కన్నీటిని రప్పించి మరీ నాణ్యతా పరీక్షలు జరుపుతాం. పరీక్ష ఫలితాన్ని బట్టి కంటి సమస్యల పరిష్కారానికి చికిత్స అందిస్తాం.
–డా.రూపక్‌కుమార్ రెడ్డి, నేత్రవైద్య నిపుణులు
(చదవండి: యాక్షన్ సినిమాని తలపించే యాక్సిడెంట్..! వెంట్రుకవాసిలో తప్పిన ప్రమాదం)