
చాలామంది కృష్ణుడంటే అల్లరి, చిలిపితనం, మాయలు, మహిమలు... అనే అనుకుంటారు. కానీ కృష్ణుడంటే ఒక చైతన్యం. ఒక స్ఫూర్తి. ఎందుకంటే తానో రాజు కొడుకైనా సామాన్య గోపబాలురతో చెలిమి చేశాడు. అల్లరి పనులతో బాల్యాన్ని ఎలా ఆస్వాదించాలో చెప్పాడు. అంతేకాదు, యవ్వనంలో ఉండే చిన్న చిన్న సరదాలనూ చూపించాడు.
బంధాలను నిలుపుకోవడంలో అందరికీ ఆదర్శంగా నిలిచాడు. ముఖ్యంగా ప్రేమ, పెళ్లి, స్నేహం... ఏదైనా సరే పది కాలాల పాటు సరిగ్గా ఉండాలంటే ఏం చేయాలో వివరించాడు. భగవద్గీత ద్వారా ఈ సారాన్ని ప్రపంచానికి అందించాడు. నేడు కృష్ణాష్టమి సందర్భంగా ఆయన చెప్పిన ఆ పాఠాలను అర్థం చేసుకుందాం...
స్నేహానికి ప్రాణం
చిన్నప్పుడు గోపబాలురతో అరమరికలు లేకుండా హాయిగా ఆడుకున్న శ్రీ కృష్ణుడు స్నేహితులకు, శరణార్థులకూ మాట ఇచ్చాడంటే తప్పడం అన్నది లేదు. ‘కురుక్షేత్రంలో ఆయుధం పట్టను’ అని చెప్పాడు. ఆ మాట మీదే నిలబడ్డాడు. అంతేకాదు. అర్జునుడితో చుట్టరికం ఉన్నప్పటికీ అంతకు మించి ఆప్యాయతను చూపించాడు. శ్రీ కృష్ణుడు, కుచేలుడి గురించి ఎలా చెప్పుకుంటారో అదే విధంగా శ్రీకృష్ణుడు, అర్జునుడి బంధం గురించి కూడా మాట్లాడతారు. పాండవులు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే అండగా నిలిచాడు. వారికి దిక్కుతోచనప్పుడు మార్గదర్శిగా మారాడు. యుద్ధంలో అర్జునుడికి రథసారథిగా ఉన్నాడు. ఇవన్నీ కేవలం స్నేహం కోసం చేసినవే.
ఒక భరోసా... ఒక నమ్మకం
నమ్మకం అనేది ఏ బంధంలో అయినా ముఖ్యం. నమ్మకం పోగొట్టుకోడానికి ఎంతోసేపు పట్టదు. కానీ సంపాదించుకోడానికి మాత్రం చాలా సమయం పడుతుంది. కృష్ణుడు చెప్పింది కూడా ఇదే. ‘నన్ను పూర్తిగా నమ్ము.. అంతా నేను చూసుకుంటాను’ అనే భరోసా ఇచ్చాడందరికీ. అందరికన్నా ముందుగా అర్జునుడికి. ఆ నమ్మకంతోనే యుద్ధంలో పోరాడాడు అర్జునుడు. అంగబలం, అర్థబలం, అధికార బలం, సైనిక బలం ఉన్న కౌరవులపై యుద్ధంలో పాండవులు పైచేయి సాధించగలిగారంటే అందుకు కృష్ణుడే కారణం.
స్థాయీ భేదాలు చూపలేదు...
అవతలి వాళ్ల స్థాయి ఏంటి... వారు ఎలాంటి హోదాలో ఉన్నారు అన్నది పక్కన పెట్టి అందరినీ సమానంగా చూడాలని బోధించాడు కృష్ణుడు. అందుకే సాయం కోసం వచ్చిన కుచేలుడి మనసు అర్థం చేసుకుని ఆనందాన్ని అందించాడు. అదే సమయంలో గౌరవం చూపించాడు. కేవలం స్నేహితులు అనే కాదు. ప్రేమికులు, భార్యా భర్తలు...ఇలా ఏ బంధంలో అయినా సరే అందరినీ సమానంగా చూస్తే ఎలాంటి చిక్కులూ రావని, పరస్పరం గౌరవించుకుంటే సమస్యలే ఉండవని నిరూపించాడు.
క్షమాగుణం
తప్పులు అందరూ చేస్తారు. కొన్నిసార్లు తెలియక, కొన్ని సార్లు తెలిసి అవి జరుగుతుంటాయి. అంత మాత్రాన ఆ వ్యక్తి పూర్తిగా చెడ్డవాడు అయిపోడు. వాళ్లపై ద్వేషం పెంచుకోవాల్సిన అవసరమూ లేదు. మిత్రులనే కాదు. శత్రువులను కూడా ఒకే రకంగా ఆదరించడంలో కృష్ణుడు ముందుండే వాడు. ఆ మాత్రం క్షమాగుణం లేకపోతే బంధం ఎలా నిలబడుతుంది? మేనత్తకు ఇచ్చిన మాట కోసం శిశుపాలుడు చేసిన వంద తప్పులను మన్నించాడు. ఎవరినైనా ఇష్టపడితే వాళ్ల నుంచి ఏవేవో ఆశించకుండా పూర్తిగా డిటాచ్‌డ్‌గా ఉండాలని బోధించాడు కృష్ణుడు.
పరిపూర్ణ జీవితం
కృష్ణుడంటే అన్ని బంధాలనూ ఆస్వాదించిన వాడని మరచిపోరాదు. బాల్యంలోనే కన్న తల్లిదండ్రులకు దూరమైనా, పెంచిన తల్లిదండ్రులను పరిపూర్ణంగా ప్రేమించాడు. ఆ తర్వాత కన్న తల్లిదండ్రులకూ సాంత్వన నిచ్చాడు. పదహారు వేలమంది గోపికలకూ తన ప్రేమను పంచాడు. అష్టమహిషులనూ అదేవిధంగా ఆదరించాడు. తనను నమ్మి వచ్చిన ఎవ్వరికీ ఏ లోటూ రానివ్వలేదు. తాను సంతోషంగా ఉన్నాడు. తనతో ఉన్న వారిని అదేరీతిలో ఉంచాడు.
వ్యక్తిత్వ వికాస గురువు
ఇప్పుడు వస్తున్న వ్యక్తిత్వ వికాస పుస్తకాలన్నింటికీ మూలాధారం రణరంగంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి బోధించిన గీతే! వ్యక్తిత్వ వికాస బోధకులకు కృష్ణుడే గాడ్ ఫాదర్. అందుకే కృష్ణుడు పరమాత్ముడే కాదు.. అందరికీ పరమ ఆప్తుడు... జగద్గురువు కూడా!
– డి.వి.ఆర్.