
హైదరాబాద్: రామంతాపూర్‌లోని గోకులేనగర్‌లో శ్రీకృష్ణాష్టమి వేడుకల్లో భాగంగా నిర్వహించిన ఊరేగింపు రథానికి విద్యుత్ తీగలు తగిలి ఆరుగురు మృతి చెందిన సంగతి తెలిసిందే. మృతుల కుటుంబాలను సోమవారం మంత్రి శ్రీధర్ బాబు పరామర్శించారు. 5 లక్షల రూపాయలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. గాయపడ్డ వారికి వైద్య ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుందని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు.
కృష్ణాష్టమి వేడుకల్లో భాగంగా ఆదివారం రాత్రి ఊరేగింపు చేపట్టారు. రథాన్ని లాగుతున్న వాహనం మరమ్మతుకు గురికావడంతో దాన్ని పక్కన నిలిపివేసిన యువకులు.. రథాన్ని చేతులతో లాగుతూ ముందుకు తీసుకెళ్లారు. ఈ క్రమంలో రథానికి విద్యుత్ తీగలు తగిలాయి. దీంతో రథాన్ని లాగుతున్న తొమ్మిది మందికి షాక్ కొట్టడంతో వారంతా ఒక్కసారిగా విసిరేసినట్లు దూరంగా పడిపోయారు. ఈ క్రమంలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందగా.. మరొకరు చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు.