అందరికీ ఎన్నో కలలు ఉంటాయి. కానీ ఏవో కారణాలతో చేరుకోలేకపోతారు. కానీ ఈ మహిళ ఒకపక్క కుటుంబ బాధ్యతలు మరోవైపు ప్రాణాంతక వ్యాధితో పోరాడుతూ కూడా తన కలను నెరవేర్చుకునేందుకు సన్నద్ధమైంది. అనుకున్నట్లుగానే విజయం అందుకుని..అనారోగ్యం వంటి కారణాలతో కలను నిజం చేసుకోలేకపోతున్నాం అని బాధపడే వాళ్లలో స్ఫూర్తిని నింపింది. ఇలా అనారోగ్యంతో ఇలాంటి సాహసం కృత్యం చేసిన మహిళగా ఘనత సృష్టించింది.
ఆ మహిళే రాజస్థాన్‌లోని జైపూర్‌కు చెందిన నీలిమ అరోరా. ఇద్దరు పిల్లల తల్లి, తలసేమియా బాధితురాలు అయినా కలల శిఖరాన్ని అధిరోహించాలనే కలను నిజం చేసుకోవాలని దృఢంగా నిశ్చయించుకుంది. సుమారు రెండున్నర సంవత్సరాల క్రితం వరకు ఆమెకు పర్వతారోహణతో ఎలాంటి సంబంధం లేదు. అప్పటి వరకు ఆమె కాలిఫోర్నియాలో సిలికాన్ వాలిడేషన్ ఇంజనీరింగ్ పనిచేస్తుండేది. అయితే ఆమెకు మెకాలి శస్త్ర చికిత్స తర్వాతనే శిఖరాలను అధిరోహించాలనే కోరిక కలగడం విశేషం.
ఆ క్రమంలోనే 8,849 మీటర్ల ఎత్తైన మౌంట్ ఎవరెస్ట్‌ను అధిరోహించి నీలిమ చరిత్ర సృష్టించింది. మొత్తం కఠినమైన 50 రోజుల యాత్రో ఆమె హై-ఆల్టిట్యూడ్ పల్మనరీ ఎడెమా (HAPE) అనే ప్రాణాంతకమైన పరిస్థితిని మూడుసార్లు ఎదుర్కొంది. నిజానికి ఇది ఊపిరితిత్తులలో ద్రవం చేరే ప్రాణాంతక పరిస్థితి. ఆఖరికి గుండె జబ్బులు లేని ఆరోగ్యకరమైన వ్యక్తులలో కూడా ఆక్సిజన్ స్థాయిలు పడిపోతే ఈ పరిస్థితే ఎదురవ్వుతుంది. అలాంటి ప్రాణాంతక పరిస్థితిని ఖాతరు చేయకుండా ఎవరెస్టు అధిరోహణకు సై అందామె. ఆఖరికి వైద్యులు వద్దని వారించినా..వెనక్కి తగ్గలేదామె.
మే 25, 2026న మధ్యాహ్నం సుమారు 1 గంటకు తాను ఎవరెస్ట్ శిఖరాన్ని చేరుకున్నప్పుడు, అక్కడ దాదాపు 30 నిమిషాల పాటు ఒంటరిగా ఉన్నానని నీలిమ ఆ అనుభవాన్ని పంచుకుంది. ఆ క్షణం తన జీవితంలోని అద్భుత క్షణంగా పేర్కొంది. ఇలా తలసేమియా మైనర్ ఉండి, ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన తొలి మహళగా చరిత్ర సృష్టించింది నీలిమ.
ఇక నీలిమ ఎవరెస్ట్‌కు ముందు అప్పటికే మాంట్ బ్లాంక్, మాటర్‌హార్న్ (ఫ్రాన్స్), కోటోపాక్సి (ఈక్వెడార్), అకోన్‌కాగ్వా (అర్జెంటీనా), అమా దబ్లామ్ (నేపాల్) వంటి సవాలుతో కూడిన శిఖరాలను అధిరోహించింది. అంతేగాదు గతేడాది 40 ఏళ్లు పైబడిన వారిలో అమా దబ్లామ్‌ను విజయవంతంగా అధిరోహించిన మొదటి భారతీయ మహిళగా నీలిమ నిలిచింది. కాగా, తన విజయాలన్నింటికి తన గైడ్ గస్మాన్ తమాంగ్, తన కుటుంబమే కారణమంటూ క్రెడిట్ అంతా వారికే ఇచ్చేసింది.
(చదవండి: అల్కా యాగ్నిక్‌కి అరుదైన వినికిడి సమస్య..ఎందువల్ల వస్తుందంటే..)


