
మహిళల ఆరోగ్యానికి, అంతర్గత ఆనందానికి మేలైన సాధనంగా యోగాసనాలు ఎంతగానో ఉపయోగపడతాయి. నేడు యోగా డే సందర్భంగా కొన్ని ఆసనాలు.
హెల్దీగా.. హ్యాపీగా...
కోణాసనం: సైడ్ యాంగిల్ పోజ్ గా పిలిచే ఈ ఆసనం వేస్తే.. శరీరం బాగా స్టెచ్ర్ అవుతుంది. కాళ్లు, చేతులకు బలం చేకూరుతుంది. వెన్ను నొప్పి, సయాటికా సమస్యకు పరిష్కారం లభిస్తుంది.
వృక్షాసనం: నిటారుగా నిల్చొని, ఒక పాదాన్ని రెండవ కాలు మధ్యకి తీసుకొచ్చి, రెండు చేతులు తలమీదుగా పూర్తిగా పైకి నమస్కారం భంగిమలో తీసుకోవాలి. ఈ ఆసనం వల్ల మానసిక సమతుల్యత ఏర్పడి ఏకాగ్రత పెరుగుతుంది.
పాద హస్తాసనం: నిటారుగా నిల్చొని, శరీరాన్ని ముందుకు వంచి, చేతులను పాదాలకు, తలను మోకాళ్లకు ఆనించాలి. దీనివల్ల నరాల వ్యవస్థ చురుకుగా మారి.. రక్త ప్రసరణ మెరుగవుతుంది.
అర్ధ మత్స్యేంద్రాసన: మ్యాట్ పైన కూర్చొని, ఎడమ కాలుని కుడి తొడ పక్కగా తీసుకొచ్చి, నేల మీద ఉంచాలి. ఎడమ చేతిని ఎడమ మోకాలు నుంచి తీసుకొచ్చి, పాదం పట్టుకోవాలి. కుడి చేతిని నిటారుగా నేల మీద ఉంచాలి. ఈ ఆసనం వల్ల ఆక్సిజన్ లెవెల్స్ పెరిగి ఊపిరితిత్తుల సామర్థ్యం పెరుగుతుంది.
సేతు బంధాసన: దీనిని బ్రిడ్జ్ పోజ్ అంటారు. ఇది కటి భాగం, గర్భాశయం, వెన్నుకి చాలా మంచిది. ఇది కటి కండరాలను బలోపేతం చేస్తుంది. పునరుత్పత్తి అవయవాలకు రక్త ప్రసరణను పెంచుతుంది.
మార్జాలాసనం: క్యాట్–కౌ పోజ్ గా పిలిచే ఈ ఆసనం వెన్నెముక బలానికి, ఒత్తిడిని తగ్గించడంలోనూ సహాయపడుతుంది కటి కండరాలను ఫ్లెక్సిబుల్‌గా చేస్తుంది.
బాలాసన: చైల్డ్ పోజ్ పెద్దలకు కూడా మేలు చేస్తుంది. ఇది ఒత్తిడిని తగ్గించడానికి, విశ్రాంతికి సహాయపడుతుంది. ఈ ఆసనం వెన్నునొప్పిని తగ్గించి, మానసిక ప్రశాంతతను కలిగిస్తుంది.
భుజంగాసన: కోబ్రా పోజ్ గా పిలిచే ఈ ఆసనం ఛాతీ, వెన్ను భాగాలను బలోపేతం చేస్తుంది. ఇది శ్వాసను మెరుగుపరుస్తుంది. శక్తిని పెంచుతుంది.
త్రికోణాసన: ట్రయాంగిల్‌పోజ్ వల్ల పాదాలు, కాళ్ళు, చేతులు, వెన్నును బలోపేతం అవుతాయి. శరీరానికి సమతుల్యతను అందిస్తుంది.
మాలాసన: దీనిని గార్లాండ్ పోజ్ అంటారు. రెండు కాళ్ళను వెడల్పుగా ఉంచి, మోకాళ్ళ వరకు వంగి, చేతులను నమస్కారం స్థితికి తీసుకురావాలి. ఈ ఆసనం సాధన చేయడం వల్ల రుతుక్రమమం, మలబద్ధకం సమస్యలు తగ్గుతాయి. తొడ కండరాల శక్తి పెరుగుతుంది.
ఈ ఆసనాలను రోజూ సాధన చేయడం వల్ల మానసిక ప్రశాంతత చేకూరి శారీరక ఆరోగ్యం అభివృద్ధి అవుతుంది ఫలితంగా జీవన శైలిలో మంచి మార్పులు కలుగుతాయి.
– అనూష రాకేష్,
యోగా ట్రైనర్, హైదరాబాద్