అవే మిధ్యా కర్మలు
బుద్ధుడు ఒకసారి మగధ రాజధాని రాజగృహలో ఉన్నాడు. వేణు వనంలో ఉడుతలకు మేత వేస్తున్నాడు. వాటిలో కొన్ని బుద్ధుని మీదకు ఎక్కాయి. ఇంకొన్ని మేత మేస్తున్నాయి. కొమ్మ మీద ఉన్న ఉడుతలు రెండు చకచకా వచ్చి బుద్ధుని ముందు నిలబడ్డాయి. అప్పుడు జయసేనుడు, భూమిజుడు ఇద్దరూ అక్కడికి వచ్చారు. వారూ ఉడుతలకు ఆహారం పెట్టారు. అప్పుడు జయసేనుడు ‘‘భగవాన్! సమ్యక్ దృష్టి, మిధ్యా దృష్టి గురించి చెప్పండి’’ అన్నాడు.
‘‘భిక్షువులారా! నూనె కావలసిన వాడు నూనె కోసం వెతుకుతున్నాడు. వాడు నూనె తొట్టిలో ఇసుక పోసినాడు. ఎంతసేపటికీ నూనె రాదు. అది మిధ్యా దృష్టి’’ ‘‘భగవాన్! ఔను. నూనె కావలసిన వాడు ఇసుక పోస్తే నూనె ఎలా వస్తుంది?’’ అన్నాడు భూమిజుడు. ‘‘అలాగే.. పాలు కావలసిన వాడు పాల కోసం వెతుకుతూ ఆవు కొమ్మును పితుకుతాడు. వాడూ పాలను పొందలేడు. అవే మిధ్యా కర్మలు’’
‘‘ఒకడు వెన్నను కావాలనుకుంటాడు. బానలో నీటిని పోసి కవ్వాన్ని వేసి తిప్పుతాడు. వాడికీ వెన్న లభించదు. ఇదే మిధ్యా ప్రయత్నం’’
‘‘భగవాన్! చాలా చక్కగా చెప్పారు’’ అన్నాడు జయసేనుడు. ‘‘అలాగే వేరొకడు... అగ్నిని కావాలని వెతుకుతూ ఉంటాడు. చేవగల పచ్చికట్టెను మధిస్తాడు. అప్పుడూ కూడా మంటను పొందలేడు. ఇదే మిధ్యా సంకల్పం’’ ‘‘కాని ఒకడు పాలు కావాలనుకుని చంటి దూడను పితుకుతాడు. ఆవు రొమ్మును పితకడు. ఇదే మిధ్యా వాక్కు’’
‘‘ఇంకొకడు... పెరుగును పోసి కవ్వంతో తిప్పుతాడు. వాడు వెన్నను పొందుతాడు. ఇదే సమ్యక్ దృష్టి... అలాగే మిగిలినవన్నీ... అన్నాడు బుద్ధుడు.
‘‘భగవాన్! నూనెను కావలసినవాడు ఆవనూనెతో, పాలు కావలసినవాడు ఆవు పొదుగుతో, వెన్న కావలసిన వాడు బానలోని వెన్నతో... ఇలా పొందాలి.’’అన్నాడు భూమిజుడు.
‘‘అవును.’’ అన్నాడు బుద్ధుడు. ఈ నాలుగు ఉపమానాలు చెప్పాడు. ఇద్దరూ ప్రసన్నలయ్యారు.
చెట్టు మీద ఉన్న ఒక ఉడుత కిందకు దిగలేదు. అటూ ఇటూ ఆలోచిస్తుంది. కొంచెం కిందకు కొంచెం పైకీ పోతుంది. వారిద్దరూ పిలిచారు. అది అలాగే చూస్తోంది. బుద్ధుడు చూశాడు. ఉడతను కిందికి రమ్మన్నాడు. అది కిందకు వచ్చింది.
‘‘ఇదిగో తిను... నీ మేత...’’ అంటూ మేత వేశాడు. అది నెమ్మదిగా వచ్చి బుద్ధుడి దగ్గర వాలింది. దాన్ని తీసుకుని దాని వీపుని నిమిరాడు. అది కొమ్మపైన వాలినట్టుగా ఆయన పాదాల మీద వాలిపోయింది. – డా. బొర్రా గోవర్ధన్


