'నారీ శక్తి'..'నారీ శక్తి' అంటారుగా!.. చేతల్లో చూపండి! | Sakshi
Sakshi News home page

'నారీ శక్తి'..'నారీ శక్తి' అంటారుగా!.. చేతల్లో చూపండి!

Published Tue, Feb 20 2024 11:57 AM

Indian Coast Guard: You Speak Of Women Power Now Show It  - Sakshi

మహిళలు సున్నితమైన వాళ్లు అంటూ కొన్ని రంగాలకే పరిమితం చేయొద్దని గొంతెత్తినా.. ప్రయోజనం లేకుండా పోతుంది. అక్కడకి మహిళ సాధికారత పేరుతో చైతన్యం తీసుకొచ్చి మహిళలు అన్ని రంగాల్లో పురుషులకు ధీటుగా చేయగలరని నిరూపించుకోవాల్సిన పరిస్థితి ఎదురవ్వుతోంది. పోనీ అంత కష్టపడ్డ లింగ సమానత్వపు హక్కు పూర్తి స్థాయిలో అమలుకు నోచుకోవడం లేదు. ఏదో ఒక పేరుతో వెనక్కిలాగేయడమే. ఆఖరికి ప్రభుత్వాలు కూడా 'నారీ శక్తి' అని మాటలు చెప్పడమే గానీ పదోన్నతుల విషయంలో నిబద్దతను చూపించడంలేదు. అందుకు ఉదహారణే కోస్ట్‌ గార్డ్‌లో మహిళకు శాశ్వత కమిషన్‌ ఏర్పాటు కేసు. ఈ విషయమే సర్వోన్నత న్యాయస్థానం కేంద్రానికి అక్షింతలు వేసింది. ఇంతకీ ఏంటా కేసు? ఎవరు దాఖలు చేశారంటే..?

కోస్ట్ గార్డ్‌లో అర్హులైన షార్ట్ సర్వీస్ కమిషన్డ్ (ఎస్ఎస్సీ) అధికారిణులతో పర్మినెంట్ కమిషన్ ఏర్పాటు చేయడానికి అనుమతి లభించకపోవడంతో ప్రియాంక త్యాగి అనే అధికారిణి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ మేరకు ప్రియాంక త్యాగి ఇండియన్ కోస్ట్‌గార్డ్‌‌లో మహిళా అధికారులకు శాశ్వత కమిషన్‌ను నిరాకరించడాన్ని సవాల్ చేస్తూ సుప్రీం కోర్టులో పిటిషన్‌ దాఖలు చేయడం జరిగింది. ఆ పిటిషన్‌పై సోమవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌, జస్టిస్‌ జె.బి.పార్దీవాలా, జస్టిస్‌ మనోజ్‌ మిశ్రలతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది.

మహిళా సాధికారికత గురించి మాట్లాడే మీరు దాన్ని ఇక్కడ చూపించాలని కేంద్ర ప్రభుత్వాన్ని సర్వోన్నత న్యాయస్థానం నిలదీసింది. అసలు కోస్ట్‌గార్డ్‌లో మహిళలకు శాశ్వత కమిషన్‌పై "పితృస్వామ్య" విధానాన్ని ఎందుకు అవలంబిస్తున్నారంటూ కేంద్రానికి అక్షింతలు వేసింది. "మాట్లాడితే 'నారీ శక్తి'..'నారీ శక్తి' అంటారు. ఇప్పడు ఇక్కడ ఎందుకు చూపించడం లేదు. ఈ విషయంలో నిబద్ధతను ప్రదర్శించాల్సిన తరుణం ఆసన్నమయ్యింది. అయితే ఆర్మీ, నేవీలో ఈ విధానం సాధ్యమయ్యినప్పుడు కోస్ట్‌గార్డ్‌లో ఎందుకీ వివక్ష?. అసలు కోస్ట్ గార్డ్ పట్ల ఎందుకంత ఉదాసీన వైఖరి.. ఈ విషయంలో మీరు చాలా అగాథంలో ఉన్నారు.. మహిళలను సముచితంగా పరిగణించే విధానాన్ని మీరు రూపొందించాల్సిందే" అని కేంద్రాన్ని ఉద్దేశించి వ్యాఖ్యానించింది ధర్మాసనం.

అంతేగాదు మహిళలు కోస్ట్‌గార్డ్‌లో ఉండలేరని చెప్పే రోజులు పోయాయని, వాళ్లు సరిహద్దులను రక్షించగలిగినప్పుడూ తీరాలను రక్షించగలరని సుప్రీం కోర్టు పేర్కొంది. కేంద్రం తరఫున వాదనలు వినిపించిన అదనపు సొలిసిటర్‌ జనరల్‌ విక్రమ్‌జీత్‌ బెనర్జీ సదరు అదికారిణి త్యాగి ఆర్మీ, నేవీ కాకు​ండా తీర రక్షక దళంలో వేరొక డొమైన్‌లో పనిచేస్తున్నందున ఇది వర్తించదని వాదన వినిపించడంతో జేబీ పార్దివాలా, మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం ఇలా వ్యాఖ్యానించింది. అలాగే అధికారిణులకు 10% శాశ్వత కమిషన్‌ మంజూరు చేయవచ్చన్న విక్రమ్‌జిత్‌ బెనర్జీ వాదనపై కూడా దర్మాసనం మండిపడింది.

అసలు మహిళలకు 10 శాతమే ఎందుకు?.. అంటే వారేమైనా తక్కువా? అని ధర్మాసనం చివాట్లు పెట్టింది. నేవీలో మహిళలకు శాశ్వత కమిషన్‌ ఉన్నప్పుడు కోస్ట్‌గార్డ్‌ అలా ఎందుకు చేయడం లేదని నిలదీసింది.  మహిళలను సముచితంగా పరిగణించే విధానాన్ని  రూపొందించాల్సిందే అని కేంద్రాన్ని ఉద్దేశించి స్పష్టం చేసింది. త్రివిధ దళాల్లో మహిళలకు శాశ్వత కమిషన్ల ఏర్పాటుపై సర్వోన్నత న్యాయస్థానం తీర్పులిచ్చినా ఇంకా పూర్వకాల ఆలోచనలతోనే ఉన్నారా? అని కేంద్రాన్ని ప్రశ్నించింది. ఈ విషయంలో కేంద్రం అనుసరించే విధానం సమానత్వ భావనకు విరుద్ధమని, లింగ సమానత్వాన్ని దెబ్బతీస్తుందని పేర్కొంది. అందువల్ల స్త్రీ పురుష సమానత్వం ఉన్న విధానాన్ని రూపొందించాలని కేంద్రాన్ని ఆదేశించింది సర్వోన్నత న్యాయస్థానం.

(చదవండి: నాడు జర్నలిస్ట్‌ నేడు ఉత్తరాఖండ్‌ తొలి మహిళా ప్రధాన కార్యదర్శిగా..!)

Advertisement
 
Advertisement