కళ్లల్లో ఎర్రటి మచ్చలు కనిపిస్తున్నాయా? బీపీ చెక్‌ చేసుకున్నారా?

High Blood Pressure: Red Spots In Eyes Could Be Sign - Sakshi

హై బీపీ లేదా హైపర్‌ టెన్షన్‌... ఎక్కువ మందిని ఇబ్బంది పెడుతున్న ముఖ్య ఆరోగ్య సమస్య. ఒకరకంగా చెప్పాలంటే ఇది సైలెంట్‌ కిల్లర్‌ కూడా. ఎందుకంటే బీపీ అదుపులో లేకపోతే నేరుగా గుండెపైనే ప్రభావం పడుతుంది. గుండెపోటు, స్ట్రోక్, మూత్రపిండాల వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి బీపీని ఎప్పటికప్పుడు చెక్‌ చేసుకోవడం, హెచ్చు తగ్గులుంటే తగిన మందులు వాడటం అవసరం.

ఎందుకంటే ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా, ఇది చాప కింది నీరులా అంతర్గత అవయవాలపై తీవ్ర దుష్ప్రభావాన్ని కలిగిస్తుంది. రక్తపోటు ఉన్నవారు ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఉప్పు తగ్గించడం వాటిలో ముఖ్యమైనది. అధిక రక్తపోటును గుర్తించడానికి ఉత్తమ మార్గం క్రమం తప్పకుండా బీపీ చెక్‌ చేయించుకోవడం. రక్తపోటు ఎక్కువగా ఉంటే కొన్ని లక్షణాలు బయటపడతాయి. కళ్ళల్లో కూడా కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. 

ఎలాంటి లక్షణాలు?
రక్తపోటు అధికమైతే మీ కళ్ళల్లో ఎర్రటి మచ్చలు కనిపిస్తాయి. ఇది రక్తనాళాల విచ్ఛిన్నం వల్ల జరుగుతుంది. కళ్ళు ఎర్రగా కనిపిస్తే బీపీ చెక్‌ చేసుకోవడం చాలా అవసరం. అధిక రక్తపోటు వల్ల దృష్టి సమస్యలు కూడా వస్తాయి. అందువల్ల కళ్లు ఎర్రగా కనిపిస్తుంటే ఓసారి బీపీ చెక్‌ చేయించుకోవాలని గుర్తుంచుకోండి. 

కళ్ళల్లో కనిపించే ఈ సంకేతాలు కాకుండా బీపీ అధికమైనప్పుడు మరికొన్ని లక్షణాలు కనిపిస్తాయి. అవి ఏమిటంటే ...
ఛాతీలో నొప్పి పెట్టడం
► శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఏర్పడడం
► మూత్రంలో రక్తం కనిపించడం 
ఛాతీ, మెడ, చెవుల్లో ఇబ్బందిగా అనిపించడం
► తలనొప్పి తీవ్రంగా రావడం
► చిన్న చిన్న పనులు చేసినా తీవ్రమైన అలసట. 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top