900 రకాల మొక్కలు, పక్షులతో ఆ ఇల్లు సస్యరాశుల పొదరిల్లు | haven for flora and fauna 900 species of plants and birds in davangere | Sakshi
Sakshi News home page

900 రకాల మొక్కలు, పక్షులతో ఆ ఇల్లు సస్యరాశుల పొదరిల్లు

Jul 25 2025 12:33 PM | Updated on Jul 25 2025 2:07 PM

haven for flora and fauna 900 species of plants and birds in davangere

ఇంటిలో వివిధ రకాల 900 మొక్కలు, చెట్ల పెంపకం 

ఆవరణ నుంచి మొదలుకొని ప్రతి గదిలోనూ పచ్చదనం 

హాయిని కలిగిస్తూ స్వర్గధామంగా ప్రొఫెసర్‌ శిశుపాల్‌ ఇల్లు  

సాక్షి,బళ్లారి: పర్యావరణాన్ని పరిరక్షించేందుకు ప్రతి ఒక్కరూ ఇంటింటా మొక్కలు నాటి చెట్లు పెంచాలని పర్యావరణ ప్రేమికులతో పాటు ప్రభుత్వం కూడా ఎన్నో ఏళ్లుగా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తోంది. అయితే నేటికీ ఇంటింటా చెట్ల పెంపకం మాట నోటి మాటలకే పరిమితం అవుతోండగా దావణగెరె నగరంలో ఓ వ్యక్తి ఏకంగా 900 వరకు వివిధ రకాల మొక్కలు, చెట్లు, పూలు, పండ్ల చెట్లు పెంచుతూ ఆ ఇంటిని నందనవనంగా, పచ్చదనం వెల్లివెరిసే స్వర్గసీమగా తీర్చిదిద్దాడు. ఆ ఇల్లు పూలు, పండ్ల మొక్కలుతో అలరాలుతున్న అద్భుతమైన పచ్చదనం, ఆహ్లాదం, వినోదం కలిగించే ఇల్లుగా కీర్తి పొందింది. రాష్ట్రంలోనే కాకుండా బహుశా దేశంలో ఓ ఇంట్లో ఇంత పెద్ద స్థాయిలో చెట్లు, మొక్కలు, పూలు, పక్షులు పెరుగుతున్న ఇల్లు ఇదే అన్నా ఆశ్చర్యపోనక్కర లేదేమో. 

ఇంటి ఆవరణలోకి అడుగుపెట్టిన వెంటనే ఎక్కడ చూసినా పచ్చదనమే కనిపిస్తుంది. ఇంటి ఆవరణ ఒకటే అనుకుంటే పొరపాటే. ఇంటి ఆవరణ నుంచి మొదలుకొని హాలులోకి అడుగుపెట్టిన తర్వాత తలుపు చుట్టూ పచ్చదనమే.   

ఎక్కడ చూసినా పచ్చదనమే 
హాలులో ఎక్కడ చూసినా పూలమొక్కలు, వివిధ రకాలైన చెట్లు ఉన్నాయి. హాలే కాదు వంట గదిలో కూడా పచ్చదనమే, వంటగదే కాదు, పడక గది, పై అంతస్తులోకి వెళ్లే మెట్లు ప్రతి అడుగు తీసి అడుగు వేసినప్పుడు ఒక్కో మెట్టు వద్ద వివిధ రకాలైన పూలకుండీలు, సువాసన వెదజల్లే పూలను తాకుకుంటూ పైగదికి వెళ్లాల్సిందే. అలాగే చివరకు వాష్‌రూం కూడా పచ్చదనంతో కనిపిస్తుందంటే ఆయన ఆ ఇంటిని ఎలా పచ్చదనంతో కాపాడుకుని వస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. దావణగెరె నగరంలోని ఎస్‌ఎస్‌ లేఅవుట్‌ ఏ బ్లాక్‌లో ప్రొఫెసర్‌ శిశుపాల్‌  ఇల్లు అంటే ఆ వీధిలోనే కాదు దావణగెరెలోనే పేరుగాంచింది. దావణగెరె బెణ్ణెదోసెకు కర్ణాటక వ్యాప్తంగా ఏవిధంగా పేరుగాంచిందో అదే తరహాలో కర్ణాటకలో ప్రొఫెసర్‌ శిశుపాల్‌ ఇల్లు కూడా పచ్చదనంతో వెల్లివిరుస్తోందనే చర్చ సాగుతోంది. ఇంటి బయట పెద్ద పెద్ద చెట్లను పెంచుతుండగా, ఇంటి ఆవరణ, లోపల వివిధ గదుల్లో ఆయా గదులకు అనుగుణంగా మొక్కలు, పూల చెట్లు పెంచుతున్నారు. పూల చెట్లు, వివిధ రకాల మొక్కలతో పాటు పక్షులు కూడా ఆ ఇంట్లో పెరుగుతున్నాయి.   

వివిధ రకాల పక్షులకూ ఆవాసం 
వివిధ రకాలైన 20కి పైగా జాతుల పక్షులు నివాసాలు ఏర్పాటు చేసుకుని అక్కడే మకాం వేశాయి. పక్షులకు కావాల్సిన పండ్లు, పూలు, ఆహారం ఇంటి ఆవరణ, లోపల దొరుకుతుండటంతో పక్షులు కూడా ఎంతో ఆనందంగా ఉంటూ చూపరులకు ఆహ్లాదాన్ని కలిగిస్తుండం విశేషం. సువాసలు వెదజల్లే లిల్లి, మల్లెపూలు, గులాబీ, సంపంగి, పారిజాత, చామంతి, చెండుపూలు తదితర 120కి పైగా పూల మొక్కలను పెంచుతున్నారు. పూజ గదిలో దేవుడి ఫోటోలతో పాటు అక్కడే పూల తోట కూడా పెరుగుతుండటంతో వాటితోనే పూజలు చేస్తున్నారు. ఆ ఇంట్లో చెట్లు, మొక్కలను కాపాడుకునేందుకు నీటి సమస్య తలెత్తకుండా ఉండేందుకు వర్షం వచ్చినప్పుడు వర్షపు నీరు వృథాగా పోకుండా పెద్ద ట్యాంకు ఏర్పాటు చేసి వాటిని నిల్వ చేసి మొక్కలకు సరఫరా చేస్తుండటం ద్వారా పచ్చదనాన్ని సంరక్షిస్తున్నారు. పనివేళలు ముగిసిన తర్వాత ఆయన ఆ ఇంటి పచ్చదనాన్ని కాపాడు కోవడానికి పూర్తి సమయం కేటాయిస్తారు. ప్రొఫెసర్‌ శిశుపాల్‌తో పాటు ఆయన సతీమణి పద్మలత కూడా పూర్తి సహకారం అందించడంతో ఆ ఇంటిని స్వర్గధామంగా మలిచారు.   

చదవండి : Sravana Masam 2025 రోజూ పండుగే.. ప్రతీ తిథి దివ్యముహూర్తమే 

పర్యాటక కేంద్రంగా మారిన వైనం 
ఆ ఇంట్లో వారికే కాకుండా విద్యార్థులకు, సందర్శకులకు పర్యాటక కేంద్రంగా విరాజిల్లుతోంది. ప్రతి రోజు వివిధ ప్రాంతాల నుంచి జనం పెద్ద ఎత్తున వచ్చి వీక్షించి వెళుతుంటారు. జనంతోపాటు విద్యార్థులకు అదొక మంచి సందర్శన, పర్యాటక ప్రాంతంగా పేరుగాంచింది. సెలవు రోజుల్లో వివిధ ప్రాంతాల నుంచి 100 మందికి పైగా విద్యార్థులు అక్కడికి వచ్చి గంటల తరబడి ఆ చెట్లు, మొక్కలు, పూలతోటలను వీక్షించి వాటి పేర్లు రాసుకుని, ఎక్కడ నుంచి తెప్పించుకుని ఇలా పెంచారన్న సమాచారాన్ని తెలుసుకుంటున్నారు. ప్రకృతి ప్రేమికుడుగా గుర్తింపు పొందిన శిశుపాల్‌ ఎంతో శ్రమించి తీర్చిదిద్దిన ఇల్లు దావణగెరెకే వన్నె తెస్తోంది. ఈసందర్భంగా స్థానికులు, విద్యార్థులు మాట్లాడుతూ శిశుపాల్‌ ఇంటిని చూసిన తర్వాత తాము కూడా తమ ఇంటి వద్ద కనీసం అందులో ఒక శాతమైన పచ్చదనం పెంపొందించు కోవాలని భావిస్తున్నామన్నారు. ఆ దిశగా అడుగులు వేస్తే ఇంటింటా చెట్లు కాదు, ఊరంతా నందనవనంగా మారుతుందనడంలో అతిశయోక్తి లేదని చెప్పవచ్చు.

చదవండి: 10 నెలల పాపను ఛాతీపై పడుకోబెట్టుకునే తండ్రికి వింత అనుభవం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement