
రోజూ పండుగే.. ప్రతీ తిథి దివ్యముహూర్తమే
శ్రావణమాసం
చిన్నకోడూరు(సిద్దిపేట): శ్రావణ మాసంతోనే హిందూ సాంప్రదాయాల ప్రకారం పండుగలు ప్రారంభమవుతాయి. శ్రావణం శుభకరం అని కూడా అంటారు. ఈ మాసంలో రోజూ పండుగేనని ప్రతీ ఘడియ లక్ష్మి కటాక్షమే అని విశ్వసిస్తారు. ఈ మాసంలో చేసే అన్ని పూజల్లోకెల్లా వరలక్ష్మి వ్రతాన్ని ఉత్తమమైనదిగా పేర్కొంటారు. శుక్రవారం నుంచి శ్రావణమాసం ప్రారంభం కాగా, ఈ నెల 29న నాగుల పంచమి, వచ్చే నెల 8న వరలక్ష్మివ్రతం, 9న శ్రావణ పౌర్ణమి(రాఖీ పండుగ), 16న శ్రీకృష్ణాష్టమి వేడుకలు నిర్వహిస్తారు.
మంగళ, శుక్ర, శనివారాలకు ప్రాధాన్యత
శ్రావణమాసంలోని మంగళ, శుక్ర, శనివారాలు అత్యంత పుణ్యప్రదమైనవి భక్తులు నమ్ముతారు. మంగళవారాలు శ్రీగౌరీ, శుక్రవారాలు శ్రీలక్ష్మీ, శనివారాలు శ్రీమహావిష్ణువు పూజలకు ముఖ్యమైన రోజులు. వీటికి తోడు శ్రావణంలోని శుక్ల పక్షంలోని 15 రోజులు ఎంతో విశేషమైనవి. సకల ఉపచారాలతో నిష్ఠగా మహలక్షి్మవ్రతం నిర్వహిస్తారు. తొమ్మిది సంఖ్యకు ఈ వ్రతంలో ప్రాధాన్యత. అందుకే తొమ్మిది పోగులతో కూడిన తోరం ధరించి తొమ్మిద రకాల పిండి వంటలు లక్ష్మీదేవికి నివేదన చేసి ముత్తైదువులకు వాయినమిస్తారు.
మహిమాన్వితం శ్రావణ పున్నమి
శ్రావణ మాసం పౌర్ణమి ఎంతో మహిమ కలిగినదని చెబుతారు. గాయత్రీ ఉపాసన చేసే వారు నూతన యజ్ఞోపవీతాలను ఇదే రోజున ధరిస్తారు. సర్వ విద్యా స్వరూపుడైన హయగ్రీవుని జయంతి కూడా ఇదే రోజు. రక్షా బంధనం, రుషి తర్పణం వంటి వైదిక కర్మలు ఇదే రోజున ఆచరిస్తారు. ఎంతో మహిమాన్విమైన ఈ తిథినాడు పూజిస్తే సత్ఫలితాలుంటాయని పురాణాలు చెబుతున్నాయి.
ఇదీ చదవండి: 10 నెలల పాపను ఛాతీపై పడుకోబెట్టుకునే తండ్రికి వింత అనుభవం
పరమపవిత్రం శ్రావణం
హిందువుల పరమ పవిత్రం శ్రావణ మాసం. ఈ మాసం పండుగలకు ప్రత్యేకమైనదిగా చెప్పవచ్చు. ప్రతీ హైందవ ఇంట్లో ఈ నెలంతా పూజలు, వ్రతాలు నిర్వహిస్తుంటారు. దేవాలయాల్లో సామూహిక కుంకుమార్చనలు, తులసి అర్చనలు, పుష్పార్చనలు, రుద్రాభిషేకాలు వంటి పూజలు చేస్తారు. –సదాశివ శర్మ, పురోహితులు, చిన్నకోడూరు
చదవండి: జిమ్‌కెళ్లకుండానే 26 కిలోలు కరిగించాడట : బోనీ కపూర్‌లుక్ వైరల్