బెంగళూరు: కర్ణాటకలో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. ప్రముఖ బిల్డర్ ఇంట్లో పని మనుషులుగా చేరిన నేపాలీ జంట.. ఆ ఇంటికే కన్నం పెట్టారు. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి.. సుమారు రూ. 18 కోట్ల విలువైన ఆభరణాలు, నగదుతో ఉడాయించారు. నిందితులు నేపాల్ సరిహద్దు దాటి వెళ్లే అవకాశం ఉండటంతో బెంగళూరు పోలీసులు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. దీంతో, ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.
ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. బెంగళూరులోని మారతహళ్లి పరిధిలో యెమలూరు కెంపాపుర నివాసి, బిల్డర్ షిమంత్ అర్జున్ ఇంట్లో ఆదివారం దొంగతనం జరిగింది. దాదాపు రూ.18 కోట్ల విలువైన బంగారం, వజ్రాలు, వెండి నగలు ఎత్తుకెళ్లినట్లు గుర్తించారు. ఇంటి యజమాని షిమంత్ తన భార్య పిల్లలతో ఓ భూమి పూజ కార్యక్రామానికి వెళ్లగా అదే అదనుగా ఇంట్లో పనిమనుషులుగా ఉన్న నేపాలి జంట దినేష్, కమలా మరో నేపాలితో కలిసి చోరీకి పాల్పడ్డారు. షిమంత్ కుటుంబం బయటికి వెళ్లినప్పుడు మొదటి అంతస్తులోని బెడ్ రూంలో చొరబడి లాకర్ పగలగొట్టి 1.5 కిలోల బంగారం, దాదాపు 5 కిలోల వెండి ఆభరణాలు, రూ.11.5 లక్షల నగదును ఎత్తుకెళ్లారని పోలీసులు గుర్తించారు.
యజమానులు తిరిగి వచ్చేసరికి ఇల్లు గుల్లై ఉండటం చూసి షాక్ అయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో ఈ భారీ దోపిడీ వెలుగులోకి వచ్చింది. అయితే, వీరు గత కొంతకాలంగా సదరు బిల్డర్ ఇంట్లో పని మనుషులుగా ఉంటూ యజమానికి నమ్మకంగా ఉంటున్నారు. ఇంటి గురించి పూర్తి అవగాహన ఉండటంతో, వీరు అతి సులువుగా లాకర్లను గుర్తించి చోరీకి పాల్పడ్డారు. నేరం చేసిన వెంటనే వారు సాక్ష్యాలు దొరక్కుండా జాగ్రత్తపడి పారిపోయినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. సీసీ టీవీ కెమెరాల పరిశీలించి నిందితులకోసం గాలిస్తున్నారు. యజమానుల ఇంట్లో పనిమనుషులు చేసిన అతిపెద్ద దొంగతనాల్లో ఇదే పెద్దదని పోలీసులు అంటున్నారు.
కాగా, నిందితులు నేపాల్ సరిహద్దు దాటి వెళ్లే అవకాశం ఉండటంతో, బెంగళూరు పోలీసులు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాలు, సరిహద్దు ప్రాంతాల్లో నిఘా పెంచారు. పని మనుషులను పెట్టుకునే ముందు వారి నేపథ్యాన్ని తనిఖీ చేయాలని ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్త వహించాలని పోలీసులు ప్రజలకు సూచిస్తున్నారు.


