Hari Prasad: పట్టుదలతో 'క్లైమెట్‌ యాక్షన్‌' వైపు పచ్చటి అడుగు.. | Hariprasad Success Story In Startup Beyond Sustainability | Sakshi
Sakshi News home page

Hari Prasad: పట్టుదలతో 'క్లైమెట్‌ యాక్షన్‌' వైపు పచ్చటి అడుగు..

Published Fri, May 3 2024 7:26 AM | Last Updated on Fri, May 3 2024 7:26 AM

Hariprasad Success Story In Startup Beyond Sustainability

సోషల్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌గా చిన్న వయసులోనే పెద్ద పేరు తెచ్చుకున్నాడు తమిళనాడులోని కోయంబత్తూరుకు చెందిన హరి ప్రసాద్‌. ఈఎస్‌జీ (ఎన్విరాన్‌మెంటల్, సోషల్‌ అండ్‌ గవర్నెన్స్‌) మేనేజ్‌మెంట్‌కు సంబంధించి మాన్యుఫాక్చరింగ్‌ కంపెనీలు, కార్పోరేషన్‌లకు సహాయపడడానికి ‘బియాండ్‌ సస్టెయినబిలిటీ’ అనే స్టార్టప్‌ను ప్రారంభించాడు.

పది మందికి మేలు చేసే వ్యక్తులు, స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాల గురించి విన్నప్పుడు, చదివినప్పుడు హరి ప్రసాద్‌ భావోద్వేగంతో కదిలిపోయేవాడు. ఫ్రీడమ్‌ ఫైటర్స్‌కు సంబంధించిన సినిమాలను చూసినప్పుడల్లా ‘నా వంతుగా సమాజానికి ఏదైనా చేయాలి’ అనుకునేవాడు.

జీవితానికి పరమార్థం ఉండాలనే భావన చిన్న వయసులోనే హరి ప్రసాద్‌లో మొలకెత్తింది. కాలేజీ సెకండ్‌ ఇయర్‌లో వాతావరణ మార్పులపై వచ్చిన ఎన్నో డాక్యుమెంటరీలను చూశాడు. ‘ఇలా చూస్తూ బాధ పడాల్సిందేనా! నా వంతుగా ఏమీ చేయలేనా’ అనుకుంటూ ‘తప్పకుండా ఏదైనా చేయాలి’ అనే పట్టుదలతో  క్లైమెట్‌ యాక్షన్‌ వైపు అడుగులు వేశాడు.

ఆ పచ్చటి అడుగులు ‘బియాండ్‌ సస్టెయినబిలిటీ’ అనే స్టార్టప్‌ మొదలు పెట్టేలా చేశాయి. ఈఎస్‌జీ (ఎన్విరాన్‌మెంటల్, సోషల్‌ అండ్‌ గవర్నెన్స్‌) ప్రకారం పర్యావరణానికి సంబంధించి ఉన్నతస్థాయి ప్రమాణాలను సాధించడానికి మాన్యుఫాక్చరింగ్‌ కంపెనీలు, పెద్ద సంస్థలకు ఈ స్టార్టప్‌ తోడ్పడుతోంది.

‘ఆర్గనైజేషన్స్‌కు నాలెడ్జి పార్ట్‌నర్స్‌గా వ్యవహరిస్తాం’ అంటున్నాడు హరి ప్రసాద్‌. సస్టెయినబిలిటీ, బాటమ్‌–లైన్‌ చాలెంజెస్‌కు సంబంధించి సంస్థల విజన్‌ని అర్థం చేసుకొని దానికి అనుగుణంగా కార్బన్‌ మేనేజ్‌మెంట్‌పై దృష్టి పెడుతోంది బియాండ్‌ సస్టెయినబిలిటీ.  కంపెనీల పర్యావరణ ప్రమాణాలకు సంబంధించి బేస్‌లైన్‌ స్టడీని నిర్వహిస్తోంది. కర్బన ఉద్గారాలు, వ్యర్థాల ఉత్పత్తి, మెటీరియల్‌ వినియోగం, కంపెనీ ఉద్యోగులలో వైవిధ్యం... మొదలైన అంశాలు ఇందులో ఉంటాయి.

రకరకాల విషయాను దృష్టిలో పెట్టుకొని యాక్షన్‌ ప్లాన్‌ను రూపొందిస్తారు. కంపెనీలకు సంబంధించి షార్‌–్ట టర్మ్, మిడ్‌–టర్మ్, లాంగ్‌–టర్మ్‌ టార్గెట్‌లను సెట్‌ చేస్తారు. కెపాసిటీ డెవలప్‌మెంట్, కార్బన్‌ మేనేజ్‌మెంట్, ఈఎస్‌జీ మేనేజ్‌మెంట్, క్లెమేట్‌ చేంజ్‌....మొదలైన వాటిపై ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లలో ఎన్నో అవగాహన సదస్సులు నిర్వహించింది బియాండ్‌ సస్టేనబిలిటీ.

అవగాహన సదస్సుల ద్వారా 65కు పైగా కంపెనీలకు, వందలాది మంది ప్రజలకు దగ్గరైంది. తయారీ ప్రక్రియలో వాతావరణ ప్రతికూల ప్రభావాలను తగ్గించడానికి ఈ సదస్సులు కంపెనీలకు ఉపయోగపడుతున్నాయి.

‘బియాండ్‌ సస్టెయినబిలిటీ వోఎస్‌’ పేరుతో టెక్‌ ప్లాట్‌ఫామ్‌ కూడా బిల్ట్‌ చేశారు. కంపెనీల పాస్ట్‌ పర్‌ఫార్‌మెన్స్‌తో పోల్చుతూ విశ్లేషణ చేయడమే కాదు సస్టెయినబిలిటీ పర్‌ఫార్‌మెన్స్‌ను మెరుగుపరుచుకోవడానికి ఈ ప్లాట్‌ఫామ్‌ ఉపయోగపడుతుంది. 
స్థూలంగా చెప్పాలంటే... కంపెనీల మైండ్‌సెట్‌ మార్చడంలో, పర్యావరణ స్పృహ వైపు నడిపించడానికి  
‘బియాండ్‌ సస్టేనబిలిటీ’ కీలక పాత్ర పోషి స్తోంది.

స్టార్టప్‌కు ముందు..
డిగ్రీ పూర్తి చేసిన తరువాత వాతావరణ మార్పుల గురించి లోతుగా తెలుసుకోవడానికి నెదర్‌ల్యాండ్స్‌లోని ‘యూనివర్శిటీ ఆఫ్‌ ట్వంటే’లో ఎన్విరాన్‌మెంటల్‌ ఇంజనీరింగ్‌ చేశాడు హరి ప్రసాద్‌. కర్బన ఉద్గారాలు తగ్గించడానికి సంబంధించిన ఎన్నో ప్రయోగాత్మక కార్యక్రమాల్లో పాల్గొన్నాడు. తన స్టార్టప్‌ మొదలు పెట్టడానికి ముందు ‘ఎస్పీ ఎడ్జ్‌’ అనే సోషల్‌ స్టార్టప్‌లో పనిచేసి ఎంతో అనుభవాన్ని సొంతం చేసుకున్నాడు. – హరి ప్రసాద్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement