గురు పూర్ణిమ: షిర్డీ సాయినాథుడికి కళ్లు చెదిరే బంగారు వజ్రాభరణాల కానుకలు | Guru Purnima Gold Crown Worth Rs 59 Lakh Donated By Anonymous Donor At Shirdi Temple | Sakshi
Sakshi News home page

గురు పూర్ణిమ: షిర్డీ సాయినాథుడికి కళ్లు చెదిరే బంగారు వజ్రాభరణాల కానుకలు

Jul 11 2025 10:20 AM | Updated on Jul 11 2025 3:11 PM

Guru Purnima Gold Crown Worth Rs 59 Lakh Donated By Anonymous Donor At Shirdi Temple

ప్రత్యేకాలంకరణలో వెలుగులీనిన శిర్డీ సాయి సంస్థాన్‌  

బాబాను దర్శించుకున్నలక్షలాది భక్తులు 

సాక్షి,ముంబై: శిర్డీలో గురుపౌర్ణమి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. గురువారం ముఖ్యమైన రోజు కావడంతో లక్షలాది మంది భక్తులు సాయిబాబాను దర్శించుకున్నారు. గురుపూర్ణిమ సందర్భంగా మందిరాన్ని వివిధ రకాల పుష్పాలు, కళ్లు మిరుమిట్లుగొలిపే విద్యుత్‌ దీపాలతో అలంకరించారు. గురుపూర్ణిమతో ‘శ్రీ సాయిసచ్చరిత్ర’ పవిత్ర గ్రంథం అఖండపారాయణం సమాప్తి అయిన సందర్భంగా శ్రీసాయి చిత్రపటం, పోతిని ఊరేగించారు. ఈ ఊరేగింపులో సాయిబాబా సంస్థాన్‌ అధ్యక్షుడు, జిల్లా ప్రధాన న్యాయమూర్తి అంజు శెండే (సోనటక్కే) ‘పోతి’(ధాన్యపుసంచి)ని చేతబట్టుకోగా, మందిరం కార్యనిర్వాహణ అధికారి (ఈఓ) గోరక్ష గాడిల్కర్‌ వీణ, డిప్యూటీ ఈఓ భీమరాజ్‌ వరాడే, మెకానికల్‌ విభాగం ప్రముఖులు అతుల్‌ వాఘ్‌లు సాయిచిత్రపటం చేతబట్టుకుని ముందుకు నడిచారు. ఈ ఊరేగింపులో సంస్థాన్‌ పదాధికారులు, వారి కుటుంబ సభ్యులు, భక్తులు, స్థానిక ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఆలయానికి సమీపంలో నిర్మించిన భారీ వేదికపై వివిధ భక్త మండళ్ల బృందాల ఆధ్వర్యంలో రోజంతా భజనలు, ఆధ్యాత్మిక గీతాలు, కీర్తనల ఆలాపన కొనసాగింది.  

గురుస్థాన్‌లో నేడు రుద్రాభిషేకం
గురుపౌర్ణమి ఉత్సవాల ముగింపు సందర్భంగా నేడు గురుస్థాన్‌ ఆలయంలో రుద్రాభిషేకం నిర్వహించ నున్నారు. ఉట్టి ఉత్సవాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరపనున్నారు.  

ఆంధ్ర భద్రావతి పేట్‌ ఆలయానికి భక్తుల తాకిడి 
సోలాపూర్‌: గురుపూర్ణిమను పురస్కరించుకుని పట్టణంలోని పలు ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. అక్కల్కోట్‌లో శ్రీ స్వామి సమర్థ మహారాజ్‌ను దర్శించుకునేందుకు భక్తులు తండోపతండాలుగా తరలివచ్చారు. ఈ సందర్భంగా ఆలయాలు, ఆశ్రమాల్లో ధార్మిక, ఆధ్యాత్మికక కార్యక్రమాలు ప్రవచనాలు, సత్సంగాలు జరిగాయి. వివిధ విద్యాసంస్థల ఆధ్వర్యంలో గురుపూర్ణిమ వేడుకలు ఘనంగా నిర్వహించారు. బాబా దర్శనం కోసం ఆంధ్ర భద్రావతి పేట్‌లోని శ్రీ సాయిబాబా ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఉచిత దర్శనంతోపాటు స్పెషల్‌ క్యూలైన్లలోనూ బారులు తీరారు. ఈ ఆలయంలో వారంరోజులుగా శ్రీ సాయి సచ్చరిత్ర పారాయణం నిర్వహిస్తున్నారు. పండుగ సందర్భంగా బుధవారం ఆలయంలో వివిధ పూజా కార్యక్రమాలు, సాయంత్రం సాయినాథ రథ ఊరేగింపు నిర్వహించారు. శ్రీ సాయి దర్బార్‌ నుంచి ప్రారంభమైన ఈ ఊరేగింపు దత్త నగర్‌, పద్మశాలీ చౌక్, జంకండి పూల్, జోడు బసవన్నచోక్, మార్కండేయ చౌక్, గుజ్జ నివాస్, వినాకర్‌ బాగ్, కన్నా చౌక్, రాజేంద్ర చౌక్‌ మార్గాల గుండా ఆంధ్ర బద్రావతి పేట్‌ వరకు కొనసాగింది.     

గణేశ్‌పురి ఆలయంలో గురుపూర్ణిమ పూజలు 
భివండీ: గురుపూర్ణిమ సందర్భంగా గణేశ్‌పురిలోని శ్రీ నిత్యానంద స్వామిని దర్శించు కునేందుకు భివండీ, ముంబై, కళ్యాణ్, ఠాణా, ముర్బాడ్‌ తదితర ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చారు. మాజీ కేంద్ర మంత్రి కపిల్‌ పాటిల్‌ స్వామిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వ్యాసపూరి్ణమ సందర్భంగా గురువారం తెలుగు సమాజ్‌ శిక్షణ్‌ సంస్థ ఆధ్వర్యంలో నడుస్తున్న పి.ఈ. ఎం. హైసూ్కల్, జూనియర్‌ అండ్‌ డిగ్రీ కళాశాల, వికాస్‌ ఇంగ్లీష్‌ మీడియం స్కూల్, విద్యానికేతన్‌ స్కూల్, వివేకానంద ఇంగ్లీశ్‌ మీడియం హైసూ్కల్, బాబా హైసూ్కల్‌ అండ్‌ జూనియర్‌ కాలేజీలోప్రత్యేక కార్యక్రమాలు, విద్యార్థులతో తల్లిదండ్రులకు–ఉపాధ్యాయులకు పాద సేవ నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో అఖిల పద్మశాలి సమాజ్‌ కోశాధికారి అవదూత బలరాం బాలె శ్రీనివాస్, భైరి నిష్కమ్, గాజెంగి కృష్ణ, చిటికెన్‌ వెంకటేశ్, గాజెంగి రాజు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. గురుపూర్ణిమ సందర్భంగా విద్యానందగిరి ఆశ్రమంలో ప్రత్యేక పూజ, పాదపూజ కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీపతి నారాయణ, మహేశుని భూమేశ్, యెన్నం శ్రీనివాస్, చెక్కరకోట మనోహర్, వేమున ఆనంద్, బాలె సత్యనారాయణతో పాటు భారీ సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.      

గురుపూర్ణిమ సందర్భంగా ఓ అజ్ఞాత భక్తుడు సాయిబాబాకు  బంగారు కిరీటం, వెండి హారం  సమర్పించారు. 566 గ్రాముల బరువున్న రూ.59 లక్షల విలువైన బంగారు కిరీటం, 54 గ్రాముల బరువున్న బంగారు పువ్వులు, 2 కిలోల బరువున్న వెండి హారం ఇందులో ఉన్నాయి.

గురుపూర్ణిమను పురస్కరించుకుని చెన్నైకి చెందిన లలితా మురళీధరన్,  కె. మురళీధరన్‌ దంపతులు బాబాకు రూ. 3.05 లక్షల విలువైన బ్రూచ్‌ సమర్పించారు.  బంగారం, వజ్రాలతో దీనిని తయారు చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement