బడి తెరిచారోచ్‌..! స్కూల్‌ బ్యాగ్‌ సూత్రం ఇదే.. | Guidelines Regarding Children School And Instructions Bags And Water Bottles | Sakshi
Sakshi News home page

బడి తెరిచారోచ్‌..! స్కూల్‌ బ్యాగ్‌ సూత్రం ఇదే..

Jun 13 2026 11:06 AM | Updated on Jun 13 2026 11:40 AM

Guidelines Regarding Children School And Instructions Bags And Water Bottles

కిడ్స్‌ స్పెషల్‌

బడి తెరిచారోచ్‌..!

నీ బ్యాగ్‌ నీకు స్నేహితుడిలా ఉండాలి, శత్రువులా కాదు. అందుకే టైంటేబుల్‌ చూసి ఆ రోజుకి కావాల్సిన పుస్తకాలు, నోట్‌బుక్స్‌ మాత్రమే పెట్టుకో. లెక్కల పీరియడ్‌ లేనప్పుడు ఆ పెద్ద లెక్కల పుస్తకం ఎందుకు? ఒక పెన్సిల్‌ బాక్స్, అందులో 2 పెన్సిళ్లు, ఎరేజర్, షార్పనర్, ఒక  పెన్ను, ఒక స్కేల్‌ చాలు. నీళ్ల బాటిల్‌ తప్పనిసరి. డీహైడ్రేషన్‌ అయితే బుర్ర పనిచేయదు మరి.

లంచ్‌ బాక్స్, ఒక చిన్న కర్చీఫ్, వర్షాకాలం కాబట్టి చిన్న రెయిన్‌ కోట్‌ కూడా ఒక మూలన పెట్టుకో. సెల్‌ ఫోన్, ట్యాబ్‌ స్కూల్‌కి అస్సలు వద్దు. బ్యాగ్‌ని రెండు భుజాల మీద సరిగ్గా వేసుకో. బ్యాగ్‌ బెల్టులు వదులుగా కాకుండా బిగుతుగా పెట్టుకుంటే బరువు తెలియదు. గుర్తుంచుకో, మార్కులు తెచ్చేది బ్యాగ్‌లోని పుస్తకాలు కాదు, నీ బుర్రలోని ఆలోచనలు. కాబట్టి బ్యాగ్‌ తేలికగా ఉంచుకో, బుర్రని చురుగ్గా ఉంచుకో.

వాటర్‌ బాటిల్‌ శాస్త్రం
స్కూల్‌ బ్యాగ్‌లో అన్నింటికంటే ముఖ్యమైన ఫ్రెండ్‌ ఎవరో తెలుసా? వాటర్‌ బాటిల్‌. నీళ్లు తాగే బాటిల్‌ ఎలా ఉండాలో తెలుసా? నీ వాటర్‌ బాటిల్‌ స్టీల్‌తో కానీ, కాపర్‌తో కానీ ఉంటే బెస్ట్‌. లేదంటే ’BPA Free’ అని రాసున్న ప్లాస్టిక్‌ బాటిల్‌ అయినా ఓకే. BPA అంటే విషం లాంటిది, అది నీళ్లలో కలిసిపోతే కడుపునొప్పి, జ్వరం వస్తాయి. రంగురంగుల బొమ్మల బాటిళ్లు బాగుంటాయి కానీ లోపల ఏ మెటీరియల్‌ ఉందో అమ్మతో చెక్‌ చేయించుకో. బాటిల్‌ మూత గట్టిగా ఉండాలి. లేకపోతే పుస్తకాలన్నీ తడిసి ‘వాటర్‌ పార్క్‌’ అయిపోతాయి. 

సైజు ముఖ్యం..

  • 5వ క్లాస్‌ పిల్లాడివి అయితే 750 ఎంఎల్‌ బాటిల్‌ చాలు.

  • హైస్కూల్‌ హీరోవి అయితే 1 లీటర్‌ బాటిల్‌ ఉండాల్సిందే. నీ వయసుకి, నీ దాహానికి సరిపడే సైజు సెలెక్ట్‌ చేసుకో.

  • సిప్పర్‌ ఉన్న బాటిల్‌ అయితే ఇంకా మంచిది.

  • ‘కడగడం కంపల్సరీ’. రోజూ బాటిల్‌ కడగడం మర్చిపోవద్దు.

  • లోపల సబ్బు నీళ్లు పోసి బ్రష్‌తో తోమాలి. వారానికి ఒకసారి వేడి నీళ్లు, కాస్త ఉప్పు వేసి కడిగితే బ్యాక్టీరియా బైబై.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement