
ఫ్యాషన్ రంగంపై ఇష్టంతో చేస్తున్న సాఫ్ట్‌వేర్ జాబ్‌ను వదిలేసి, తనదైన డిజైన్ శైలిని దుస్తులపైన చూపుతున్నారు మాదాపూర్‌లో ఉంటున్న కావ్యారెడ్డి. నేత కార్మికులతో కలిసి వింటేజ్, క్రియేటివ్ డిజైన్స్‌ని రూ పొందిస్తున్నారు. వారి జీవనశైలిపైన డాక్యుమెంటరీ రూ పొందించారు. చిత్రకారిణిగా, శాస్త్రీయ నృత్యకారిణిగా, యోగా ట్రైనర్‌గానూ రాణిస్తున్న కావ్య ఈ రంగంలో ఎదురయ్యే సవాళ్లనూ,వాటిని తాను ఎదుర్కొంటున్న తీరును ఇలా వివరించారు.
‘‘చిన్నప్పటి నుంచి ఫ్యాషన్ రంగం అంటే చాలా ఇష్టం. ఫ్యాషన్‌ని కెరీర్‌గా మార్చుకోవాలని చాలా ప్రయత్నించాను. కానీ, బీటెక్ అయ్యాక సాఫ్ట్‌వేర్ రంగంలో ఉద్యోగిగా మారి పోయాను. నా సొంత సం పాదనతో డిజైనింగ్ రంగంలోకి రావాలని ఆలోచన. దాంతో ఉద్యోగిగా ఉన్నా నాదైన సొంత డిజైన్స్‌ను ప్లాన్ చేస్తూనే ఉన్నాను. ఉద్యోగినిగా మంచి పొజిషన్‌లో ఉన్నా అది మానేసి, ఫ్యాషన్ కాలేజీలో స్టూడెంట్‌గా జాయిన్ అయ్యాను. కోర్సు పూర్తయ్యాక ఒక ఫ్యాషన్ కంపెనీలో ఉద్యోగినిగా చేరి, కమర్షియల్‌గా మన ఆలోచనలను ఎలా తీసుకువెళ్లాలో నేర్చుకున్నాను. కెమెరా, గ్రాఫిక్స్, డిజిటల్ మార్కెటింగ్.. ఇవన్నీ నేర్చుకొని మూడేళ్ల క్రితం ‘సఖ్య’ పేరుతో నా సొంత బ్రాండ్‌ను ప్రారంభించాను.
రీల్.. రియల్..
కాబోయే వధూవరుల డ్రెస్సింగ్‌కి మా డిజైన్ స్టూడియోకి వస్తారు. వారి స్కిన్ టోన్, హైట్.. దృష్టిలో పెట్టుకొని వివిధ రకాల మోడల్ డ్రెస్సులతో మా దగ్గరే ఒక ర్యాంప్‌వాక్ చేయిస్తాను. దానిని కెమెరాలో రికార్డ్ చేసి, ఇస్తాను. అదేవిధంగా రియల్‌గా ఎలా ఉన్నారో 3 మిర్రర్ కాన్సెప్ట్‌తో చూపిస్తాను. దీంతో సరైన ఫిటింగ్, డిజైన్, కలర్.. ఇవన్నీ చూసుకొని వారు సంతృప్తి చెందితేనే డిజైన్ చేసి ఇస్తాను.
మరిన్ని డిజైన్ల కోసం..
ఆర్గానిక్ వైట్ క్లాత్ తీసుకొని, ఆర్గానిక్ డైస్‌తో మా ప్రత్యేకమైన డిజైన్స్ వేయిస్తాను. వాటిని డెవలప్ చేసి, ఆ డిజైన్స్‌ని ఉపయోగిస్తాం. డిజైన్‌కి రెప్లికా లేకుండా చూడటమే మా ప్రత్యేకత. సినీతారలు, అవార్డు ఫంక్షన్లకు నా డిజైన్స్ వెళుతుంటాయి. ఫ్యాషన్ కాలేజీలలో గెస్ట్ లెక్చర్స్ ఇవ్వడం, ట్రైనింగ్ ఇవ్వడమూ చేస్తుంటాను. ఈ రంగంలో చూపుతున్న ప్రతిభకు అవార్డులూ అందుకున్నాను.
వచ్చిన ఆర్డర్‌ను టైమ్ ప్రకారం ఇవ్వడం ఒక పెద్ద టాస్క్. దీంట్లో మెటీరియల్, వర్కర్స్, డబ్బును తిరిగి రాబట్టుకోవడం, మెయింటెనెన్స్... ప్రతిదీ యుద్ధమే. స్త్రీ ఎదగాలని చేసే ప్రతి ప్రయత్నంలో అన్నింటా అడ్డంకులు ఉంటాయి. ఇన్నింటిలో నా సొంత ఆసక్తులను వదలుకోను. పెయింటింగ్స్ వేస్తుంటాను. శాస్త్రీయ నృత్యంలో సాధన చేస్తుంటాను. యోగా ట్రైనర్‌గా క్లాసులు తీసుకుంటాను’’ అంటూ ఈ జీవన యుద్ధంలో తన పోరాట పటిమను పెంచుకుంటున్న తీరును వివరించారు ఈ డిజైనర్.
– నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి
మన చేనేతలు
గద్వాల్, పోచంపల్లి, ధర్మవరం.. ఒక్కో హ్యాండ్లూమ్‌కి సంబంధించి పది చీరలు స్పెషల్‌గా డిజైన్ చేస్తాను. వాటి ప్రింట్లు, డిజైన్ ప్రత్యేకంగా క్రియేట్ చేస్తాను. చేనేత కారుల జీవన విధానంపైన డాక్యుమెంటరీ చేశాను. వారిలో ఎంతో సృజన ఉంది. అయితే వారు చెప్పేదేమంటే–‘మేం మా ప్రాణం పెట్టి రోజులు, నెలలు కష్టపడి ఒక చీర డిజైన్ చేస్తాం. అలాంటిదే నార్త్ నుంచి రెప్లికాలు తెచ్చి, మా జీవనో పాధిని దెబ్బతీస్తున్నారు’ అనే బాధను వ్యక్తం చేశారు.