
దుస్తులు చెక్కిన చేతులు దృశ్యాలకు రూపమిస్తున్నాయి. మోడల్స్‌ని మెరిపించిన సృజన యాక్టర్స్‌ను కదిలిస్తోంది. ఫ్యాషన్ డిజైనర్లు సినిమా రంగం వైపు దృష్టి మళ్లిస్తున్నారు. కాదేదీ సృజనకు అనర్హం అనుకుంటూ తమ స్కిల్స్‌కు సాన పెడుతున్నారు. ఈ ట్రెండ్ దేశవ్యాప్తంగా ఇప్పటికే ప్రారంభం కాగా.. నగరంలో ఇప్పుడిప్పుడే ఊపందుకుంటోంది.
సినిమా రంగం వైపు డిజైనర్ల చూపు
‘అక్కడ ఎంబ్రాయిడరీ వర్క్ రావాలి.. ఆ షేడ్ ఇంకొంచెం మార్చాలి’.. వగైరా సూచనలు చేసిన వారే ‘లైట్స్, కెమెరా, యాక్షన్..’ అంటూ నిర్ధేశిస్తున్నారు. నగరంలో కొన్ని సినిమా షూటింగ్స్‌లో డైరెక్టర్లుగా మారిన ఫ్యాషన్ డిజైనర్లు చేస్తున్న సందడి ఇది.
బాలీవుడ్‌తో మొదలై..
ప్రముఖ భారతీయ ఫ్యాషన్ డిజైనర్లు అనగానే వెంటనే గుర్తుకు వచ్చే జాబితాలో ముందుంటాయి విక్రమ్ ఫడ్నిస్, మనీష్ మల్హోత్రా అనే పేర్లు. అయితే ఇప్పుడు వీరి పేర్లకు ముందు ఇప్పుడు డిజైనర్లతో పాటు డైరెక్టర్లు అనే కొత్త ప్రొఫెషన్ కూడా చేరింది. కొన్నేళ్ల క్రితమే సినిమా దర్శకత్వంలో అడుగుపెట్టి హృదయాంతర్(2017), స్మైల్ ప్లీజ్(2019) అనే రెండు మరాఠీ చిత్రాలకు విక్రమ్ ఫడ్నిస్ దర్శకత్వం వహించారు.
అదేవిధంగా ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్‌కు చెందిన ధర్మ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న హిందీ చిత్రం ద్వారా మనీష్ మల్హోత్రా దర్శకుడిగా అరంగేట్రం చేయబోతున్నారు. అయితే వీరు మాత్రమే కాకుండా గతంలో ఇతర డిజైనర్లు కూడా రంగుల లోకంలో భిన్న పాత్రలను పోషించారు.
కాంతార ద్వారా దేశవ్యాప్తంగా అటు దర్శకత్వం, ఇటు హీరోగానూ పేరు సాధించిన రిషబ్ శెట్టి తొలి దశలో తాను తీసిన రిక్కి అనే సినిమాకి కాస్ట్యూమ్ డిజైనర్‌గా కూడా పనిచేశారు. అదే విధంగా డిజైనర్‌గా సినిమా రంగంలో అడుగుపెట్టిన కేరళకు చెందిన స్టెఫీ జేవియర్ సైతం కొన్నేళ్ల తర్వాత మధుర మనోహర మోహం అనే సినిమా ద్వారా దర్శకురాలిగా మారారు.
నగరానికి వచ్చేసిన ట్రెండ్..
ఇప్పుడు అదే ట్రెండ్ నగరానికి కూడా విస్తరించినట్టు కనిపిస్తోంది. నగరానికి చెందిన ప్రముఖ డిజైనర్లు సినిమా రంగంపై తమ దృష్టి మళ్లించినట్టు స్పష్టమవుతోంది. డిజైనర్‌గా విజయవంతంగా కొనసాగుతున్న రామ్జ్.. పచ్చీస్ అనే సినిమా ద్వారా హీరోగా మారాడు. అలాగే ఫైటర్ రాజా పేరిట మరో సినిమాలో ఆయన నటిస్తున్నాడు.
ఇక డైరెక్టర్లుగా మెగాఫోన్ పడుతున్నవారూ క్రమక్రమంగా పెరుగుతున్నారు. వీరిలో సినీ స్టైలిస్ట్, డిజైనర్‌గా పేరొందిన నీరజ కోన త్వరలో విడుదల కానున్న తెలుసు కదా సినిమాతో దర్శకురాలిగా ఆరంగేట్రం చేస్తున్నారు. గోదావరి వంటి సినిమాలకు పనిచేయడం ద్వారా శేఖర్ కమ్ములకు సన్నిహితుడైన మరో ప్రముఖ డిజైనర్ అరవింద్ జాషువా కూడా పేషన్ పేరుతో ఒక సినిమా
తీస్తున్నారు.
డిజైనర్‌గా ఉన్నా కాబట్టే డైరెక్టర్‌గా మారా..
దాదాపు 12ఏళ్ల పాటు కాస్ట్యూమ్స్ డిజైనర్, స్టైలిస్ట్‌గా ఉన్నాను. అందువల్లే నేను డైరెక్టర్‌గా మారగలిగాను. సినిమా రంగంతో సన్నిహితంగా ఉంటూ తొలుత స్క్రిప్ట్ రాయడం మీద పట్టు సాధించి అలా అలా ఒక స్టోరీని రెడీ చేసుకుని ఇప్పుడు సినిమా డైరెక్షన్ చేశాను. ఖచ్చితంగా ప్రేక్షకుల మన్ననలు పొందుతుందని ఆశిస్తున్నాను.
– నీరజ కోన, ఫ్యాషన్ స్టైలిస్ట్, దర్శకురాలు
అదే ప్యాషన్‌తో.. సినిమా
సినిమాల్లో కాస్ట్యూమ్ డిజైనర్‌గా ఉన్నప్పుడు కూడా అసిస్టెంట్ డైరెక్టర్ తరహాలో కాస్త ఎక్కువగా ఇన్వాల్వ్ అయ్యేవాడిని. స్క్రిప్ట్ చదవడం దగ్గర నుంచి ప్రతీ అంశంపై నా ఆసక్తిని గమనించి శేఖర్ కమ్ముల బాగా నన్ను ప్రోత్సహించారు.
అణువణువునా సృజనాత్మకత నింపే ఫ్యాషన్ డిజైనింగ్ అనేది రెగ్యులర్ స్టడీస్ లాంటిది కాదు. నిఫ్ట్‌లో చదువుతున్నప్పుడు నాతో పాటు సహ విద్యార్థుల్లో కూడా గమనించిన ప్యాషన్‌ను బుక్‌గా రాశాను. అదే నా సినిమాకి ఇప్పుడు నేపథ్యం.
– అరవింద్ జాషువా, ఫ్యాషన్ డిజైనర్, దర్శకుడు
(చదవండి: హెయిర్‌కి బియ్యపిండి మాస్క్ మంచిదేనా..? నిపుణులు ఏమంటున్నారంటే..)