
రక్షా బంధన్ అనగానే రకరకాల రాఖీలు అన్న లేదా తమ్ముడి చేతికి కట్టి సంబరంగా జరుపుకుంటుంటారు అక్క/చెల్లి. ఇద్దరిలో ఎవ్వరికీ ఏ కష్టం వచ్చినా తోడుంటానని, ధైర్యంగా ఉండు అని చెప్పే ఈ పండుగ రక్తసంబంధం మైత్రికి, తోబుట్టువుల గొప్పదనానికి ప్రతీక. అలాంటి ఈ సంబరానికి అర్థం పట్టే ఓ కథ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. రక్షా బంధన్ అసలైన అర్థం ఇదే కథ అనిపించేలాంటి గాథే ఇది.
గుజరాత్‌లోని గాంధీనగర్‌కి చెందిన 60 ఏళ్ల కిరణ్ భాయ్ పటేల్ రెండు కిడ్నీలుపాడైపోయాయని వైద్యులు చెప్పడంతో అతడి ప్రపంచం ఒక్కసారిగా తలకిందులైపోయింది. భరూచ్‌లోని ఓ ఎరువుల కంపెనీ పనిచేసే ఆయన దాత కోసం ఎదురుచూస్తున్నారు. అదీగాక సమస్య తీవ్రమై డయాలసిస్‌పై ఆధారపడాల్సిన పరిస్థితి ఎదురైంది ఆయనకు.
అతడి కుమారుడు, కుమార్తె, భార్య ఆయనను ఎలా రక్షించుకోవాలో తెలియక తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అయితే కుమార్దె కిడ్నీ దానం చేద్దామని ముందుకొచ్చినా..రక్తపోటు కారణంగా కిడ్నీలు దానం చేయలేదని తేల్చారు వైద్యులు. భార్య, కొడుకివి అతడికి మ్యాచ్ కాలేదు. ఇంకెలా ఆయన్ను రక్షించుకోవాలో తెలియని ఆందోళనలో సతమతమవుతుండగా ఆయన నలుగురు తోబుట్టువులు కిడ్నీలను దానం చేసేందుకు ముందుకు వచ్చారు.
మూడవ చెల్లికి పరీక్షల సమయంలో ఒకటే కిడ్నీ ఉందని తెలిసి వెనక్కి తగ్గాల్సి వచ్చింది. మరో చెల్లికి కాలులో పాక్షికంగా వైకల్యం ఉండటంతో ఆమె అనర్హురాలని చెప్పారు వైద్యులు. ఆఖరికి అక్క సుశీలాబెన్ కిడ్నీ కిరణ్ భాయ్‌కి మ్యాచ్ అవ్వడమేగాక ఆమె ఇచ్చేందుకు ముందుకు వచ్చారు కూడా. అందుకు ఆమె భర్త, అత్తమామలు కూడా సమ్మతించడం విశేషం. కిరణ్ బావ భూపేంద్రభాయ్ దగ్గరుండి అతడి సోదరి అని వైద్యపరీక్షలు చూసుకున్నారు.

అహ్మదాబాద్ ప్రభుత్వాస్పత్రిలో కిడ్నీ మార్పిడి జరిగింది. ఆ సర్జరీ జరిగి సరిగ్గా ఇప్పటికీ ఒకటిన్నర సంత్సరాలు. ప్రస్తుతం కిరణ్ ఆరోగ్యం మెరుగవ్వడమే గాక హాయిగా జీవితాన్ని గడుపుతున్నారు కూడా. ఈ మేరకు సుశీలాబెన్ మాట్లాడుతూ..సోదరుడు కష్టంలో ఉంటే ఏ అక్క చూస్తూ ఉండగలదు. కష్టాల్లో, కన్నీళ్లలో మేమున్నాం అంటూ అండగా ఉన్నప్పుడే కథ రక్తసంబంధానికి, తోబుట్టువుల బాంధవ్యానికి అసలైన అర్థం అంటుందామె. ఈ రక్షా బంధన్ పండుగను సంబంరంగా జరుపుకోవడమే కాదు..సంకటపరిస్థితుల్లో కూడా ఆ బంధానికి, విలువలకు ప్రాధాన్యత ఇచ్చి బాంధవ్యాన్ని బలోపేతం చేసుకోవాలని చెప్పకనే చెబుతోంది ఈ కథ.
(చదవండి: Plastic Man Of India: ప్లాస్టిక్ వ్యర్థాలతో ఏకంగా తారురోడ్డు కంటే..!)