రష్యా చమురుకు రిలయన్స్‌ గుడ్‌బై | Reliance Stops Russian Crude Imports As Global Restrictions ... | Sakshi
Sakshi News home page

రష్యా చమురుకు రిలయన్స్‌ గుడ్‌బై

Nov 22 2025 4:08 AM | Updated on Nov 22 2025 4:08 AM

Reliance Stops Russian Crude Imports As Global Restrictions ...

ఐరోపా సమాఖ్య ఆంక్షల ఫలితం 

జామ్‌నగర్‌ సెజ్‌ యూనిట్లో ఇకపై రష్యాయేతర చమురు వినియోగం

న్యూఢిల్లీ: రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో ఎగుమతులకు ఉద్దేశించిన రిఫైనరీ యూనిట్‌ కోసం రష్యా చమురు దిగుమతులను నిలిపివేసినట్టు ప్రకటించింది. ఐరోపా సమాఖ్య ఆంక్షలకు అనుగుణంగా ఈ చర్య తీసుకుంది. ఇప్పటి వరకు రష్యా చమురును పెద్ద మొత్తంలో కొనుగోలు చేస్తున్న సంస్థల్లో రిలయన్స్‌ ముందుండడం గమనార్హం. 

జామ్‌నగర్‌ కాంప్లెక్స్‌లో రిలయన్స్‌కు రెండు రిఫైనరీ యూనిట్లు ఉన్నాయి. అందులో ఒకటి ప్రత్యేక ఆర్థిక మండలి రిఫైనరీ యూనిట్‌. ఇందులో రష్యా చమురును రిఫైనరీ చేసి యూరప్, యూఎస్, ఇతర మార్కెట్లకు ఎగుమతి చేస్తోంది. రోజువారీ 1.7–1.8 మిలియన్‌ బ్యారెళ్ల చమురును రష్యా నుంచి తక్కువ ధరలపై కొనుగోలు చేస్తూ వచి్చంది. జామ్‌ నగర్‌లోనే ఉన్న మరొక యూనిట్‌ను దేశీ మార్కెట్‌ అవసరాల కోసం వినియోగిస్తోంది. 

అయితే, రష్యా చమురు దిగుమతి, దాంతో పెట్రోలియం ఉత్పత్తుల తయారీపై ఐరోపా సమాఖ్య ఆంక్షలు విధించడం గమనార్హం. వీటిని అనుసరిస్తూ రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ రష్యా చమురు కొనుగోళ్లను నవంబర్‌ 20 నుంచి నిలిపివేసినట్టు కంపెనీ అధికార ప్రతినిధి ప్రకటించారు. గతంలో కొనుగోలు చేసిన చమురు నిల్వల రిఫైనరీ పూర్తయిన అనంతరం, రష్యాయేతర దేశాల చమురునే ఇక్కడ వినియోగించనున్నట్టు తెలిపారు. 

డిసెంబర్‌ 1 నుంచి ప్రత్యేక ఆర్థిక మండలి యూనిట్‌ ద్వారా ఎగుమతి చేసే ఉత్పత్తులు రష్యాయేతర చమురుతో తయారైనవే ఉంటాయని స్పష్టం చేశారు. 2026 జనవరి 1 నుంచి ఐరోపా ఆంక్షలు అమల్లోకి రానుండగా, దీనికంటే ముందుగానే రష్యాయేతర చమురుకు మారిపోవడం పూర్తవుతుందన్నారు. తద్వారా ఐరోపా సమాఖ్య మార్గదర్శకాలను పాటిస్తామన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement