జుట్టు పొడవుగా ఉండటం మాత్రమే కాదు, ఆరోగ్యంగా మెరుస్తూ కనిపించడమూ ముఖ్యమే. అలా ఉండాలంటే ఖరీదైన ఉత్పత్తులను వాడాల్సిన అవసరం లేదు. రోజువారీ జుట్టు సంరక్షణలో కొన్ని చిన్న మార్పులు చేసుకుంటే సరిపోతుంది. వారానికి ఒకటి లేదా రెండుసార్లు కొబ్బరి నూనెతో తలకు, జుట్టుకు మృదువుగా మసాజ్ చేసి, కొద్దిసేపటి తర్వాత తలస్నానం చేయడం వల్ల పొడిబారిన జుట్టుకు తేమ అందుతుంది.
అలాగే జుట్టు శుభ్రంగా ఉండేందుకు షాంపూ కూడా అవసరమే. షాంపూ చేసిన ప్రతిసారీ కండిషనర్‌ను జుట్టు మధ్య నుంచి చివర్ల వరకు రాయడం మంచిది. తలస్నానం చేసిన వెంటనే జుట్టును గట్టిగా రుద్దడం వల్ల జుట్టు దెబ్బతినొచ్చు. బదులుగా మెత్తని టవల్‌తో మెల్లగా నీటిని పీల్చేలా చేయాలి. అయితే జుట్టు అందంగా, ఆరోగ్యంగా ఉండాలంటే బయటి నుంచి చేసే సంరక్షణతో పాటు గుడ్లు, పప్పులు, చేపలు, పెరుగు, గింజలు వంటి ప్రొటీన్ పుష్కలంగా ఉండే ఆహారాన్ని కూడా తీసుకుంటూ, రోజూ తగినంత నీరు తాగడం కూడా ముఖ్యం.


