
పరిశ్రమలు, పారిశ్రామిక రంగంలో మహిళకు వ్యవస్థాపకులుగా, ఆవిష్కర్తలుగా సాధికారత కల్పిస్తూ వారందరినీ అనుసంధానం చేసే వినూత్న వేదికగా డైనమిక్ ఎంటర్‌ప్రెన్యూర్స్ అండ్ ఉమెన్ ఇన్నోవేటర్స్ (డీఇడబ్ల్యూఐ) ప్రారంభమైంది. అంకుర సంస్థల ఔత్సాహిక మహిళల సమిష్టి ఉన్నతికి సహకారం, ప్రోత్సాహం అందించడమే లక్ష్యంగా నగరంలో డీఇడబ్ల్యూఐ ఆవిష్కృతమైంది. నగరంలోని హైటెక్స్ నోవోటెల్ కన్వెన్షన్ సెంటర్ వేదికగా బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో సంస్థ వ్యవస్థాపకురాలు, చైర్‌పర్సన్ డాక్టర్ నీలిమా వేములతో పాటు చైర్‌పర్సన్ డాక్టర్ కళ్యాణి గుడుగుంట్ల, వైస్ చైర్‌పర్సన్ – సహ వ్యవస్థాపకురాలు సత్యవతి ప్రసన్న మడిపడిగే, సహ వ్యవస్థాపకురాలు – బ్రాండ్ కస్టోడియన్ పల్లవి నాగళ్లతో పాటు ముఖ్య సలహాదారు రాజు మడిపడిగే డీఇడబ్ల్యూఐను ఆవిష్కరించారు. ఇందులో భాగంగా మహిళా దార్శనికులు, స్ఫూర్తిదాయక వ్యక్తులు, మహిళా ఆవిష్కర్తలను ఒక చోటికి చేర్చారు.
మహిళా శక్తికి లాంచ్‌ప్యాడ్..
ఈ సందర్భంగా డైనమిక్ ఎంటర్‌ప్రెన్యూర్స్ అండ్ ఉమెన్ ఇన్నోవేటర్స్ వ్యవస్థాపకురాలు డా.నీలిమా వేముల మాట్లాడుతూ.. డీఇడబ్ల్యూఐ కేవలం ఒక సంస్థ మాత్రమే కాదు, ఇదొక ఒక ఉద్యమం. ప్రధానంగా ఇండస్ట్రీ, ఇన్నోవేషన్‌లో బాధ్యతను కోరుకునే, ఒకరికొకరు ప్రోత్సాహం అందించుకునే ఔత్సాహిక మహిళలను ఒకే వేదికపైకి తీసుకురావడంతో పాటు మహిళా శక్తిని, విజయాన్ని పునర్ నిర్వచించడానికి సిద్ధంగా ఉన్న మహిళలను అనుసంధానం చేయడానికి కృషి చేస్తున్నామని అన్నారు. డీఇడబ్ల్యూఐ అనేది మహిళల వ్యవస్థాపకతను పెంపొందించేందుకు కమ్యూనిటీ సహకారంతో పాటు మూలధనంపై దృష్టి సారించి, ఆశావహులైన–స్థిరపడిన మహిళా వ్యవస్థాపకులకు ఒక లాంచ్‌ప్యాడ్‌గా సేవలందించనుందని, ఇలాంటి వారి అభివృద్ధికి అవకాశాలు కల్పించే సమాంతర వ్యవస్థగా రూపొందించనున్నామని పేర్కొన్నారు.
ఈ ప్రయాణంలో మహిళా నేతృత్వంలోని వెంచర్‌లను స్కేలింగ్ చేయాలనే సంస్థ లక్ష్యానికి భవిష్యత్తు పెట్టుబడిదారులు, నిధుల సేకరణదారులుగా విశిష్ట జ్యువెలరీ డైరెక్టర్ సింధుజా పలబట్ల, సురక్ష ఫార్మా డైరెక్టర్ పద్మజా మానేపల్లిని డీఇడబ్ల్యూఐ కుబేరులుగా ఎంపిక చేశారు. ఈ ప్రారంభోత్సవంలో ప్రముఖ కూచిపూడి నృత్యకారిణి అలేఖ్య పుంజాల, ప్రముఖ ఫిట్‌నెస్ నిపుణురాలు దినాజ్ వెర్వత్‌వాలా, సినీ నటుడు అలీ జీవిత భాగస్వామి జుబేదా అలీ, వైద్య నిపుణురాలు, మహిళా ఆరోగ్య న్యాయవాది డాక్టర్ సునీత రెడ్డి (వైఎస్), వకుళ సిల్స్ వ్యవస్థాపకురాలు మాధురి దువ్వాడ, టీజీ ఆర్య వైశ్య కార్పొరేషన్ చైర్మన్ కల్వ సుజాత ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
(చదవండి: దటీజ్ షెకావత్..! వృద్ధురాలైన తల్లితో కలిసి స్కైడైవింగ్‌కి సై)