నా వయస్సు 30 సంవత్సరాలు. నాకు 15 ఏళ్లకే పెళ్లి చేశారు. 16 ఏళ్లకు మొదటి సంతానం, ఆ తర్వాత రెండేళ్లకు మరో పాప పుట్టారు. నాకు 25 ఏళ్లన్నా రాకముందే నా భర్త నన్ను వదిలేసి ఇంకొకామెతో వెళ్లిపోయాడు. అయితే నేను మా పుట్టింటికి వెళ్లకుండా, కష్టపడిౖ టెలరింగ్ చేస్తూ పిల్లలను పెంచుతున్నాను. పిల్లలు బాగానే చదువుకుంటున్నారు. అయితే, పిల్లలకోసం నిరంతరం కష్టపడుతూ నేను చాలా అలసిపోయాను. మా ఇంట్లో వాళ్లు నన్ను మళ్లీ పెళ్లి చేసుకోమంటున్నారు. కానీ నాకు పెళ్లి అనే వ్యవస్థపై నమ్మకం పోయింది. అలాగని జీవితాంతం పూర్తిగా ఒంటరిగా ఉండటం కూడా కష్టం అనిపిస్తోంది. అందుకే ఒక మంచి స్నేహితుడిలా నా బాధలను అర్థం చేసుకునే వ్యక్తిలా, నాకు తోడుగా ఉండే వ్యక్తి కావాలనుకుంటున్నాను. ఈ విషయాన్ని నేను మా ఇంట్లో వాళ్లతో చెబితే, ‘నీకు బుద్ధిలేదా? ‘పెళ్లిచేసుకో, లేకపోతే ఇలాగే ఉండు’ అని అంటున్నారు. నేను ఆలోచిస్తున్నది తప్పే అయితే నాకు మంచి సలహా ఇవ్వగలరా?
– సీత, రాజమహేంద్రవరం.
మీరు పడుతున్న సంఘర్షణ నాకు అర్థమైంది. మొదటగా...15 ఏళ్ల వయసులోనే పెళ్లి... ఇద్దరు పిల్లలకు తల్లి కావడం, పాతికేళ్లు కూడా రాక ముందే భర్త వదిలేసి వెళ్ళిపోవడం... ఒక స్త్రీగా మీ మానసిక వేదన సామాన్యం కాదు. అయినా కుంగిపోకుండా, మీ కాళ్ళ మీద మీరు నిలబడి, ఇద్దరు పిల్లలని ఒంటరిగా పెంచి పెద్దచేసి చదివిస్తున్న మీలోని ఆత్మవిశ్వాసానికి, పట్టుదల అభినందనీయం. ఇక మీరు అడిగిన ప్రశ్నకు మీ వైపు నుంచి ఆలోచిస్తే మీరు కోరుకునేదాంట్లో తప్పేం లేదు. గతంలో పెళ్లి అనే వ్యవస్థ వల్ల మీరు చాలా వేదన అనుభవించారు.
కాబట్టి ఆ వ్యవస్థపై మీకు నమ్మకం లేకపోవడం, పెళ్లి అంటేనే భయపడటం పరిగణనీయం. అలాగే తనకంటూ ఒక తోడు కావాలని కోరుకోవడం సహజం. అయితే, మీ తల్లిదండ్రుల వైపు నుంచి, సామాజిక కోణం నుంచి ఆలోచిస్తే.. మన సమాజంలో ‘పెళ్లి’ అనే బంధానికి మాత్రమే సామాజిక, చట్టపరమైన గుర్తింపు ఉంది. పెళ్లి కాకుండా ఒక పురుషుడితో స్నేహం లేదా సహజీవనం చేస్తుంటే చుట్టుపక్కలవాళ్ళు, బంధువులు మాట్లాడే మాటలను తట్టుకునే ధైర్యం మీ అమ్మనాన్నలకు లేకపోవచ్చు. అలాగే మీ పిల్లలు సమాజం నుంచి వచ్చే ఇలాంటి మాటలను భరించగలుగుతారా? అంతేకాదు, చట్టబద్ధమైన బంధం లేనప్పుడు... మీరు స్నేహితుడు అనుకునే వ్యక్తి రేపు మిమ్మల్ని వదిలేసి వెళ్ళడానికి అవకాశాలు అధికంగా ఉంటాయి.
అందువల్ల మీరు కోరుకుంటున్నట్లుగా కేవలం నిస్వార్థంగా స్నేహితుడిగా ఉండే పురుషుడు దొరకడం అంత సులువు కాదు. ఎవరినైనా మీ జీవితంలోకి రానిచ్చే ముందు, వారిలో ఎలాంటి స్వార్థం లేదని నమ్మకం కుదిరే వరకు వేచి చూడండి. మీకు తోడు కావాలంటే మీ బంధువులు, అలాగే తోటి మహిళలతో కూడా మీ కష్టసుఖాలను పంచుకోవచ్చు. మీకంటూ ఒక నమ్మకమైన ‘స్నేహవలయాన్ని’ తయారు చేసుకొని, వాళ్లతో సమయం గడపడానికి ప్రయత్నించండి. ఇది మీ ఒంటరితనాన్ని కొంత తగ్గిస్తుంది.
భవిష్యత్తులో మీరు కోరుకున్న మంచి లక్షణాలతో ఎవరైనా పురుషుడు ఎదురైతే... ముందు కేవలం ఒక స్నేహితుడిగానే ఉండండి. కాలక్రమేణా ఆ బంధం పటిష్టంగా మారి, మీ ఇంట్లో వాళ్లకు, మీ పిల్లలకు కూడా అతనిపై నమ్మకం కుదిరితే... అప్పుడు సమాజం కోసం కాకపోయినా, మీ రక్షణ కోసం, మీ పిల్లల భవిష్యత్తు కోసం ఆ బంధాన్ని ఒక ‘రిజిస్టర్ మ్యారేజ్’ లాంటి చట్టపరమైన రూపంలోకి మార్చుకునే వీలుందేమో ఆలోచించండి. అప్పటి వరకు తొందర పడకుండా, ముందు మీ పిల్లల ఎదుగుదలపై, మీ టైలరింగ్ వృత్తిపైనే పూర్తి దృష్టిపెట్టండి. మీ ధైర్యమే మీకు తోడు! ఆల్ ది బెస్ట్!

డా. ఇండ్ల విశాల్ రెడ్డి,
సీనియర్ సైకియాట్రిస్ట్, విజయవాడ.


