
స్టూడెంట్ నంబర్ వన్
రాములవారి తలంబ్రాలూ, పట్టువస్త్రాలను తలపై పెట్టుకుంటారు... అది భక్తి.
రాయలవారు తనకు తోడుగా కవులను ఏనుగు మీదకు ఎక్కించుకుంటారు. అది గౌరవం.
శ్రవణకుమారుడు తన తల్లిదండ్రులను కావడిలో మోస్తాడు... అవి ప్రేమాభిమానాలు.
అలాంటి భక్తి, గౌరవం, ప్రేమ ప్రపత్తులను తమ ఉ పాధ్యాయినుల పట్ల చూ పారు కొందరు విద్యార్థులు.
హిమాచల్ ప్రదేశ్‌లో చోటుచేసుకుని... లోకమంతటా వైరలైన ఈ సంఘటన వివరాలివి...
ఇటీవల హిమాచల్‌ప్రదేశ్‌లోని అనేక ప్రాంతాల్లో క్లౌడ్ బరస్ట్ కారణంగా కుండ పోత వానలు కురుస్తుండటం... దాంతో చండప్రచండంగా నదులు ప్రవహిస్తుండటం... ఫలితంగా ఎంతోమంది కొట్టుకు పోతున్న సంఘటనల వార్తలు తరచూ వినిపిస్తున్నాయి. కొద్దికాలంలోనే అలాంటి వరస సంఘటనలు అక్కడ చాలానే చోటు చేసుకున్నాయి.
అచ్చం అలాగే ఆరోజున కూడా హిమాచల్ ప్రదేశ్‌లోని మాండీ జిల్లా థునాగ్ ప్రాంతమంతా కారుమబ్బులు ఆవరించి నలువైపుల్నుంచీ కమ్ముకొస్తూ పట్టపగటిని చిమ్మచీకటి చేసేశాయి. ఈ వాతావరణ నేపథ్యంలోనే... థునాగ్‌లోని ‘కాలేజ్ ఆఫ్ హార్టికల్చర్ అండ్ ఫారెస్ట్రీ’కి చెందిన ఇద్దరు లెక్చరర్లకు నెలలు నిండాయి. ఏ సమయంలోనైనా వారికి నొప్పులు మొదలయ్యే అవకాశముంది.
హిమాచల్ ప్రదేశ్‌లో అందునా పర్వత్ర పాంతమైన మాండీ పరిసరాల్లో ఇలా కురిసే అకస్మాత్ వర్షాలూ, హఠాత్తుగా వచ్చే మెరుపు వరదలు (ఫ్లాష్ ఫ్లడ్స్) చాలా మామూలు. ఒక పక్క నిండు గర్భిణులైన తమ లెక్చరర్లు... మరోపక్క కమ్ముకొస్తున్న వర్షపు ధాటి...ఇంకో పక్క పొంచి ఉన్న వరద ముప్పు!
ఏం చేయాలో తోచని అక్కడి విద్యార్థులు... మోసుకెళ్లేందుకు వీలుగా ముందుగా పల్లకి లాంటి ఓ మంచె కట్టారు. అలా కట్టిన ఆ పల్లకిలో లెక్చరర్‌ను కూర్చోబెట్టి ఆ మంచెను మోశారా విద్యార్థులు.
అసలే పర్వత ప్రాంతం! అంతా ఎగుళ్లూ దిగుళ్లు. మరోపక్క స్టూడెంట్లకు... ‘వానెప్పుడు ముంచుకొస్తుందో... ప్రసవపు నొప్పులెప్పుడోస్తాయోనని గుండెనిండా దిగులు. నిట్టనిలువుగా ఉండే పర్వత మార్గాలు కూలి కొండదారులు మూసుకు పోతే వాటినెలా దిగాలో తెలియని దిగాలు!!
అలాంటి నేపథ్యంలో దాదాపు పదకొండు కిలోమీటర్ల ΄÷డవున అత్యంత కఠినమైన దారుల్లో ముందుకు సాగారు. గోడల్లా నిలువుగా ఉన్న సానువులను దిగారు. అలా కఠిన మార్గాల్ని ఓడిస్తూ ఎట్టకేలకు పర్వత పాదాల వద్దనున్న హాస్పిటల్‌కు చేరారూ... తమ లెక్చరర్లనూ చేర్చారు. ఇటీవల జరిగిన ఈ సంఘటన తాలూకు క్లిప్స్ వైరల్ కావడంతో ఆ స్టూడెంట్ల పట్ల అభినందనలూ, ప్రశంసలు వెల్లువెత్తాయి... అచ్చం అక్కడి క్లౌడ్ బరస్ట్ టైమ్‌లో ఫ్లాష్‌ఫ్లడ్స్‌లాగే!!
‘ఆ స్టూడెంట్స్ తెగువకూ, ధైర్యానికీ మా సలాం’ అంటూ ఒకరు ప్రశంసిస్తే... ‘గురుపూర్ణిమకు గురుదక్షిణ ఆ గురువులకు చక్కగా దొరికిందం’’టూ మరొకరు కితాబిచ్చారు. ‘‘ఇది కదా ఇండియా ప్రజల సంస్కారమం’’టూ అందరూ ఆ విద్యార్థులకు జేజేలు పలికారు.